చంద్రన్న బాటలో.. అఖిలప్రియ బెదిరింపులు

నంద్యాల ఉప ఎన్నిక అధికార తెలుగుదేశం పార్టీకి 'చావో రేవో' అన్న పరిస్థితిని తీసుకొచ్చింది. నిజానికి, నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ గెలిచినా, ఓడినా సంఖ్యా పరంగా ఆ పార్టీకి వచ్చే చిక్కు ఏమీ లేదు. పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం ద్వారా అడ్డగోలుగా దక్కించుకున్న నియోజకవర్గమది. కానీ, అక్కడ ఓడితే తమ రాజకీయ భవితవ్యానికి కష్టకాలమేనని చంద్రబాబు అభద్రతాభావానికి గురవుతున్నారు. 

ఇక, టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు యెదుట తమ బలాన్ని చాటుకోవడానికి నంద్యాల ఉప ఎన్నికలో గెలవడమొక్కటే మార్గమని మంత్రి భూమా అఖిలప్రియ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఇప్పటికే అనేక పబ్లిసిటీ స్టంట్లు షురూ చేసేశారు. 'పవన్‌కళ్యాణ్‌ మా వెంటే వుంటారు..' అంటూ నిన్ననే ఓ స్టేట్‌మెంట్‌ పడేశారామె. అంతేనా, 'సింపతీ' కొల్లగొట్టడానికి అఖిలప్రియ చేస్తోన్న పబ్లిసిటీ స్టంట్లు అన్నీ ఇన్నీ కావు. 

భూమా నాగిరెడ్డి సోదరుడి కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి, నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ తరఫున పోటీ చేస్తోన్న విషయం విదితమే. ఈ రోజు ఆయన నామినేషన్‌ కూడా వేశారు. ఈ సందర్భంగా అఖిల ప్రియ భావోద్వేగానికి గురయ్యారు. తల్లిదండ్రుల్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టేశారు. కానీ, వైఎస్‌ జగన్‌కి అత్యంత సన్నిహితురాలిగా శోభా నాగిరెడ్డి పనిచేయడం, వైఎస్సార్సీపీ నుంచే శోభా నాగిరెడ్డితోపాటు, భూమా నాగిరెడ్డి 2014 ఎన్నికల్లో గెలవడం ఎలా మర్చిపోగలం.? భూమా అఖిల ప్రియ ఎమ్మెల్యే అయ్యిందే వైఎస్సార్సీపీ నుంచి. మరి, వైఎస్సార్సీపీకి వెన్నుపోటు పొడిచిన వైనాన్ని అఖిల ప్రియ మర్చిపోతే ఎలా.? 

ఇది చాలదన్నట్టు, తన తండ్రి భూమా నాగిరెడ్డిని కేసులతో శిల్పా మోహన్‌రెడ్డి వేధింపులకు గురిచేశారనీ, ఇకపై శిల్పా మోహన్‌రెడ్డికి కష్టకాలం మొదలైందనీ, కౌంట్‌ డౌన్‌ షురూ అయ్యిందనీ అఖిలప్రియ హెచ్చరించేశారు. మంత్రి పదవిలో వుంటూ, రాజకీయ ప్రత్యర్థిని హెచ్చరించడమంటే ఏమనుకోవాలి.? ఎంతైనా చంద్రబాబు పార్టీలో వున్నారు కదా.. ఆ పోకడలు అలాగే వుంటాయ్‌.! 

నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి ఈక్వేషన్స్‌ శరవేగంగా మారిపోతున్నాయి.. టీడీపీ అనుకూలత తగ్గిపోయి, వైఎస్సార్సీపీ అనుకూలత పెరుగుతోన్న దరిమిలా, అఖిలప్రియ సెంటిమెంట్‌ కార్డ్‌తోపాటు అన్ని రకాల ప్రయోగాలూ చేసేసి.. చివరికి ఇదిగో ఇలా హెచ్చరికలకు దిగారనుకోవాలి.

Show comments