టాలీవుడ్ 1000 కోట్లు@ 2017

టాలీవుడ్ లో ఇది ఆనందించాల్సిన వ్యవహారమో, భయపడాల్సిన వ్యవహారమో అర్థం కావడం లేదు. 2016 కొంత వరకు ఫరవాలేదు అనిపించేలాగే ముందుకు వెళ్తోంది. బయ్యర్లు మరీ భయంకరంగా దెబ్బతినడం అన్నది  బ్రహ్మోత్సవం, సర్దార్ గబ్బర్ సింగ్  విషయంలోనే జరిగింది. బ్రహ్మోత్సవం విషయంలో దాన్ని ఏవిధంగా తిరిగి పూడ్చాలన్న దానిపై నిర్మాతలకు బయ్యర్లకు ఓ ఓవరల్ అగ్రిమెంట్ జరిగిపోయింది. ఇక సర్దార్ గబ్బర్ సింగ్ సంగతి కూడా ఇంచుమించు అలాగే వుంది. 

సో దాదాపుగా మంచి హిట్ లు పడ్డాయి, బయ్యర్లు హ్యాపీనే. మీడియం సినిమాల విషయంలో కూడా ఫరవాలేదనే మాదిరిగానే వుంది. నిర్మాతలు నష్టపోయారేమో కానీ బయ్యర్లు కాదు. ఇక వచ్చే మూడు నెలల్లో ధృవ మినహా భారీ సినిమాలు ఏవీ పెద్దగా లేవు. అందువల్ల ఇక 2016 కాస్త సాఫీగా వెళ్లిపోయినట్లే అనుకోవాలి.కానీ 2017 లో మాత్రం బయ్యర్ల పరిస్థితి ఎలా వుంటుందా అన్న దానిపై ఇండస్ట్రీలో కాస్త భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. 

దాదాపు అరడజను భారీ సినిమాలు 2017లో రానున్నాయి. పైగా సర్దార్ గబ్బర్ సింగ్ నుంచి స్టార్ట్ అయిన కొత్త వ్యవహారం ఏమిటీ అంటే, తమ స్వంత పూచీ కత్తుపై కొనుక్కుంటున్నామని, తిరిగి ఎటువంటి నష్టపరిహార చెల్లింపులు కోరమని బయ్యర్ల చేత ముందస్తుగానే ఔట్ రేట్ అగ్రిమెంట్ లు చేయించుకుంటున్నారు. అందువల్ల సినిమా తేడా వచ్చిందో దెబ్బయిపోయేది బయ్యర్లు, ఇంకా కచ్చితంగా చెప్పాలంటే థియేటర్ల వారీ, ఊళ్లవారీ కొనుకున్నవారు. 

2017 స్టార్టింగ్ లోనే గౌతమీ పుత్ర శాతకర్ణి, ఖైదీ నెం 150 విడుదలవుతున్నాయి. ఈ రెండూ దాదాపు వంద కోట్ల మార్కెట్ ను టార్గెట్ చేసిన సినిమాలే. ఒక్క థియేటర్ రైట్స్ నే 70 కోట్ల వరకు వుండే అవకాశం వుంది. ఆ తరవాత పవన్-డాలీల కాంబినేషన్ లోని కాటమరాయుడు కూడా భారీ సినిమానే. ఆపై బాహుబలి 2 వుండనే వుంది. 

ఈ సినిమా హక్కులు కొనడం అంటే దాదాపు జూదం ఆడిన రేంజ్ లో వుంటోంది. సీడెడ్ లాంటి చిన్న ఏరియాకే పాతిక కోట్ల రేటు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆ తరవాత మహేష్ బాబు-మురగదాస్ సినిమా వుంది. మురుగదాస్ సినిమాలేవీ మన దగ్గర అద్భుతంగా ఆడిన దాఖలాలు లేవు. కానీ మహేష్ కాంబినేషన్ తోడు కావడంతో ఇది ఏకంగా 150 కోట్ల బిజినెస్ ను టార్గెట్ చేసింది.

2017లోనే బన్నీ-హరీష్ శంకర్ సినిమా వుంటుంది. ఆ తరవాత పవన్-త్రివిక్రమ్ సినిమా కూడా వుండే అవకాశం వుంది. అలాగే యువి వారి భాగమతి కూడా భారీ సినిమానే. ఇవన్నీ కూడా కాస్త మంచి రేట్లు రాబట్టుకోగల అవకాశం వున్న సినిమాలు. అన్నీ బాగుండి ఆడితే, బయ్యర్లకు కాసుల పంటే. కానీ ఏ సినిమా ఏ మాత్రం తేడా చేసినా, బయ్యర్ల కొంప కొల్లేరైపోతుంది. 

2017 మొత్తం మీద ఈ భారీ సినిమాల బిజినెస్ నెస్ నే వెయ్యి కోట్లకు పైగా వుండే అవకాశం వుంది. కాంబినేషన్లు తెచ్చిన క్రేజ్ తో ఇంత బిజినెస్ చేయడం సాధ్యమయింది. అంటే 2017లో తెలుగు ప్రేక్షకులు టాలీవుడ్ కు ఒక్క భారీ సినిమాలకే 1000 కోట్లు తమ శ్రమ ధనం అందించేందుకు రెడీ కావాల్సిందే.

Show comments