షేక్‌ హ్యాండ్‌లో తేడా వుంది జగన్‌.!

చంద్రబాబుకి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చినా సరే, వైఎస్‌ జగన్‌ ఆ పని చేయలేదంటూ టీడీపీ అనుకూల మీడియాలో పెద్ద ప్రచారమే జరిగింది. అసలు చంద్రబాబుని, వైఎస్‌ జగన్‌ 'ఎట్‌ హోం' కార్యక్రమంలో కలవడానికే ఇష్టపడలేదనీ, మొహమాటానికి ఓ సారి 'నవ్వి ఊరుకున్నారు' అని నిన్నంతా బ్రేకింగ్‌ న్యూస్‌లు దర్శనమిచ్చాయి. తెల్లారేసరికి ఆ పత్రికల్లో 'కరచాలనం' చేశారు అన్ని కనిపించినా, ముక్తాయింపులో 'కరచాలనానికి ఇష్టపడలేదు' అనే పేర్కొన్నారు. 

అయితే, సాక్షి మీడియాలో మాత్రం, చంద్రబాబుతో వైఎస్‌ జగన్‌ కరచాలనానికి సంబంధించి ఫొటోలు స్పష్టంగా కన్పించాయి. వీడియోల్లోనూ చంద్రబాబు, వైఎస్‌ జగన్‌ కరచాలనం చేసుకున్నారనే విషయం స్పష్టమవుతోంది. ఇక్కడ, జగన్‌కి చంద్రబాబుతో కరచాలనం ఇష్టమా.? లేదా.? అన్నది కాదు ప్రశ్న. 'గౌరవార్ధం' అయినా జగన్‌, చంద్రబాబుతో కరచాలనం చేశారా? లేదా? అన్నదే ముఖ్యం. చంద్రబాబుతో, వైఎస్‌ జగన్‌ కరచాలనం చేసిన మాట వాస్తవం. 

కానీ, ఇక్కడో మెలిక లేకపోలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఇష్టపూర్వకంగానే వైఎస్‌ జగన్‌ కరచాలనం (షేక్‌హ్యాండ్‌) చేశారు. ఆ విషయం ఫొటోల్లో స్పష్టమవుతోంది. కేసీఆర్‌, జగన్‌ చాలా బలంగానే 'చేతులు కలపడం' కన్పిస్తోంది. చంద్రబాబు విషయంలోనే జగన్‌, కాస్త మొహమాటంగానే చేతులు కలిపారు. జగన్‌ నుంచి ఎలాగైతే మొహమాటంగా కరచాలనం జరిగిందో, చంద్రబాబు (కాస్త నవ్వినట్లు ఫొటోల్లో కనిపిస్తున్నా ఆ నవ్వు వెనుక అర్థం వేరే వుంది లెండి..) నుంచీ అంతే. ఇద్దరి బాడీ లాంగ్వేజ్‌, ఇద్దరి ముఖ కవళికలు.. ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 

చిత్రమైన విషయమేంటంటే, తెలంగాణలో కేసీఆర్‌, వైఎస్సార్సీపీని దెబ్బ కొట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు వైఎస్సార్సీపీని దెబ్బకొట్టారు. అయినా, జగన్‌కి కేసీఆర్‌ అంటే అదో ఇది. చంద్రబాబు అంటే మాత్రం, వైఎస్‌ జగన్‌కి ఎప్పటికీ సమసిపోని వైరం వుంది. నిజమే మరి, వైఎస్‌ జగన్‌ విషయంలో చంద్రబాబు చేసే విమర్శలకీ, కేసీఆర్‌ చేసే విమర్శలకీ తేడా వుంది. కేసీఆర్‌, ఎప్పుడూ వైఎస్‌ జగన్‌ని విమర్శించడానికి ఇష్టపడరు. చంద్రబాబు అలా కాదు కదా. అదే తేడా. Readmore!

Show comments