జయలలిత లేని తమిళనాడులో అంటే అన్నా డీఎంకే ప్రభుత్వంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రి పాలైనప్పటినుంచి అంటే సెప్టెంబరు 22 నుంచి ఇప్పటివరకు అధికారులు ఎవరి పని వారు చేసుకుపోతున్నారు తప్ప ప్రభుత్వం క్రియాశీలకంగా పనిచేస్తున్న దాఖలాలు లేవు. మరోమాటలో చెప్పాలంటే పేరుకే ప్రభుత్వం ఉంది.
పన్నీరు శెల్వం ముఖ్యమంత్రి పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉంది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆయన్ని పదవిలో ఉండనిస్తారా? అనేది అనుమానమే. అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు జయలలిత ఉన్నంతకాలం అమ్మ...అమ్మ అంటూ ఆమె భజన చేశారు. ఆమె కన్నుమూసిన తరువాత జయ స్నేహితురాలు శశికళ నటరాజన్ ఉరఫ్ చిన్నమ్మ భజన చేస్తున్నారు. ఆమె పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టడమే కాకుండా ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టాలని అత్యధికమంది కోరుతున్నట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. చిన్నమ్మలో 'అమ్మ'ను చూసుకుంటున్నారు.
జయ ఎంతటి శక్తిమంతురాలో శశికళ కూడా అంతటి సామర్థ్యమున్న నాయకురాలని భావిస్తున్నారు. ఓపక్క జయలలిత మరణం విషయంలో చిన్నమ్మను వివాదాలు చుట్టుముడుతుండగా మరోపక్క ఆమె ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని పార్టీ కేడర్ కోరుతోంది.
శశికళే ముఖ్యమంత్రి కావాలని అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, రెవిన్యూ మంత్రి ఆర్‌బి ఉదయ్ కుమార్ బహిరంగంగానే ఆకాంక్షించారు. త్వరలోనే మరికొందరు మంత్రులూ బయటపడొచ్చు. శశికళ ప్రధాన కార్యదర్శి కావడానికి వీలుగా పార్టీ రాజ్యాంగాన్ని సవరిస్తామని కూడా చెబుతున్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల జె.జయలలిత పెరవై శాఖలు శశికళ ప్రధాన కార్యదర్శి కమ్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుతూ తీర్మానాలు చేశాయి. జయలలిత పెరవై కార్యదర్శి ఉదయ్‌కుమార్, మరికొందరు నాయకులు ఇదేవిధమైన తీర్మానం చేసి పోయస్ గార్డెన్‌కు వెళ్లి శశికళకు అందించారు. శశికళ 'పురట్చితలైవి ఛారిటబుల్ ట్రస్టు' తరపున కొన్నేళ్లుగా సామాజిక సేవ చేస్తున్నారట...! కోటిన్నరమంది అన్నాడీఎంకే కార్యకర్తలు ఆమే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారట...!
జయలలిత తుదిశ్వాస విడిచినట్లు ప్రకటన వచ్చిన మరుక్షణమే 'నేనే ముఖ్యమంత్రినవుతా' అని శశికళ బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమె ఆ ప్రకటన చేయగానే పన్నీరు శెల్వం గుండెల్లో రాయి పడింది. తన పదవికి ఎసరు పెట్టొద్దని ఆయన చిన్నమ్మను వేడుకున్నాడు. ఆమెను ప్రధాన కార్యదర్శిగా ఉండమని, తాను సీఎంగా ఉంటానని చెప్పాడు. తాను ప్రధాన కార్యదర్శి పదవికే పరిమితమవుతానని ఆమె చెప్పినట్లు వార్తలొచ్చాయి. కాని పరిణామాలు మారిపోతున్నట్లుగా కనబడుతోంది.
పన్నీర్ శెల్వంను ఎవ్వరూ ముఖ్యమంత్రిగా గౌరవిస్తున్నట్లేకాదు కనీసం గుర్తిస్తున్నట్లు కూడా లేదు. తాను ముఖ్యమంత్రినని, హుందాగా వ్యవహరించాలని ఆయన కూడా అనుకుంటున్నట్లు లేదు. ఆయన కూడా శశికళ ముందు చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి ఏర్పడింది. అధికారులు సైతం పోయస్ గార్డెన్‌కు వెళ్లి శశికళతో నేరుగా మాట్లాడుతున్నారు. అన్నాడీఎంకేలో పరిణామాలు ముదిరిపోయి పార్టీ పూర్తిగా శశికళ వైపు తిరిగిపోతే పన్నీరు శెల్వంకు కన్నీరు మిగులుతుంది. మరోసారి తాత్కాలిక ముఖ్యమంత్రిగానే మిగిలిపోతారు.
పన్నీరుశెల్వం మొదటిసారి 2001 సెప్టెంబరులో ముఖ్యమంత్రి అయ్యారు. అప్పట్లో సుప్రీంకోర్టు ఆంక్షల కారణంగా జయలలిత పదవి నుంచి దిగిపోయారు. తనకు అత్యంత విధేయుడైన పన్నీరు శెల్వంను ఎంపిక చేశారు. ఆ సమయంలో ఆయన జయ మంత్రివర్గంలో ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నారు. 2001 సెప్టెంబరు 21 నుంచి 2002 మార్చి 1 వరకు (సుమారు ఆరు నెలలు) పదవిలో ఉన్నారు. సుప్రీంకోర్టు ఆంక్షలు తొలగించడంతో 2002 మార్చిలో జయ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు.
అక్రమాస్తుల కేసులో ప్రత్యేక కోర్టు ఆమెను దోషిగా ప్రకటించి జైలు శిక్ష విధించడంతో 2014 సెప్టెంబరు 27న పన్నీరు శెల్వం రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2015 మే 22 వరకు (సుమారు 8 నెలలు) ఆ పదవిలో ఉన్నారు. రెండుసార్లూ తాత్కాలిక ముఖ్యమంత్రిగా పనిచేసిన తరువాత మంత్రిగా చేశారు. మూడోసారి మంత్రిగా ఉన్నప్పుడే 2016 డిసెంబరు 5న జయలలత కన్నుమూశారు. పన్నీర్ శెల్వం 6వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ప్రస్తుతం జయలలిత మంత్రివర్గమే కొనసాగుతోంది. ఇప్పడాయనకు ఎసరు పెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి.
ఇవి ఎంతవరకు ఫలిస్తాయో తెలియదుగాని ప్రమాదఘంటికలు మాత్రం బలంగా మోగుతున్నాయి. ఒకవేళ శశికళ ముఖ్యమంత్రి అయితే ఈయన మళ్లీ ఆమె దగ్గర మంత్రిగా చేరతారా? మరో దారి చూసుకుంటారా? వేచి చూడాలి.