బాబు సూపర్ స్ట్రాటజీ అదేనా?

బాబు అను'కుల'మీడియా ఎంత దాచేస్తున్నా, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం అన్నది నేషనల్ వైడ్ గా క్వశ్చన్లు రేకెత్తిస్తోంది. ఎమ్మెల్యేల ఫిరాయింపుపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోకపోవడం, దీన్ని సాకుగా తీసుకుని, వాళ్లకు మంత్రి పదవులు కట్టబెట్టడం, రాజ్యాంగాన్ని సంరక్షించాల్సిన గవర్నర్ కూడా యథాశక్తి సహకరించడం వంటివి ఇప్పుడు మెల్లగా చర్చనీయాంశాలు అవుతున్నాయి.

పురంధ్రీశ్వరి లాంటి వాళ్లు బహిరంగ లేఖ రాయడం అన్నది ఈ విషయానికి మరింత ప్రాచుర్యం పెంచుతున్నాయి. ఇప్పటికిప్పుడు అద్భుతాలు జరిగిపోయి, ఆకాశం కిందకు దిగిపోదు కానీ, ఆంధ్రలో జరిగిన బాగోతం జాతీయ స్థాయికి చేరుకుంటుంది. పైగా రాష్ట్రపతి దగ్గరకు కూడా వెళ్తాం అంటున్నారు వైకాపా అధ్యక్షుడు జగన్. ఇవన్నీ కలిసి చంద్రబాబు ప్రతిష్టను మసకబారుస్తాయి. అయితే బాబు ఇదంతా ఊహించనిది ఏమీకాదు. అందుకే ఆయన ఓ అద్భుతమైన స్ట్రాటజీ వేసి, మంత్రివర్గంలోకి ఫిరాయింపుదారులను తీసుకున్నారట. ఈ సూపర్ స్ట్రాటజీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. 

ఇంతకీ ఆ స్ట్రాటజీ ఏమిటంటే, ఫిరాయింపుదారుల్లో ఎవరైతే వాళ్ల వాళ్ల నియోజకవర్గాల్లో సూపర్ స్ట్రాంగ్ నో, ఎవరైతే ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి జనం ముందుకు వెళ్లినా గెలిచే అవకాశం వుందో, అలాంటి వాళ్లకు మాత్రమే మంత్రిపదవులు ఇచ్చారట. ఈ విషయంలో బాబు చాలా గట్టి సర్వే చేయించుకున్నారట. ఆ సర్వే ప్రకారం రాజీనామా చేసి, గెలవగల సత్తా వున్న ఫిరాయింపు దారులకే మంత్రి పదవులు ఇచ్చారట. 

మంత్రి పదవులు ఇచ్చిన తరువాత వీళ్లు మరింత పవర్ ఫుల్ అవుతారు. పైగా అధికార పార్టీ మద్దతు, ఆర్థిక మద్దతు వుండనే వుంటుంది. రాజ్యాంగ ఉల్లంఘన, రాజీనామాల డిమాండ్ లు వీలయినంత వరకు తట్టుకునే ప్రయత్నం చేస్తారు. కాదు అంటే అప్పుడు మంత్రులు రాజీనామా చేసి, మళ్లీ పోటీకి దిగుతారు. గెలిచి, జగన్ కు ఝలక్ ఇస్తారు. అదీ బాబు సూపర్ స్ట్రాటజీ అంట.

అఖిల ప్రియకు సింపతీ వుంది. ఆదినారాయణ రెడ్డి, సుజయ రంగారావు, అమర్ నాధ్ రెడ్డి లాంటివాళ్లు వాళ్ల నియోజకవర్గంలో బలమైన నాయకులే. చంద్రబాబు సర్వేలో జ్యోతుల నెహ్రూ, జలీల్ ఖాన్ లాంటివాళ్లకు సంతృప్తికరమైన ఫలితాలు రానందునే మంత్రి పదవులు దక్కలేదని తెలుస్తోంది. 

అందువల్ల దమ్ముంటే రాజీనామా చేయించి, ఎన్నికల్లోకి దిగండి అంటున్న జగన్ కు అవసరమైతే ఝలక్ ఇచ్చేలా, సూపర్ స్ట్రాటజీని పన్ని మరీ  మంత్రివర్గ విస్తరణకు దిగారు చంద్రబాబు అని రాజకీయ వర్గాల బోగట్టా. ఏమయినా చంద్రబాబు తెలివే తెలివి.

Show comments