'అత్త'తో విభేదాలపై దాపరికమెందుకు?

సమాజంలో, రాజకీయాల్లో అనూహ్యమైన ఘటనలు సంభవించినప్పుడు కొందరు వ్యక్తులు అనుకోకుండా తెర మీదికి వస్తుంటారు. అసలు నిజాలు చెబుతామంటారు. తెర వెనక జరిగిన కథలన్నీ బయటపెడతామంటారు. ఆ తరువాత వారేం చేస్తారో తెలియదుగాని కొంతకాలంపాటు వార్తల్లో వ్యక్తులవుతారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు (అన్న జయకుమార్‌ కూతురు) దీపా జయకుమార్‌ ఇప్పుడు మీడియాకు వార్తగా మారింది.

ప్రాంతీయ మీడియా మొదలు జాతీయ మీడియా వరకు ఆమె పేరు మారుమోగుతోంది. ఆమెను ఇంటర్వ్యూ చేయని పత్రికగాని, ఛానెల్‌గాని లేదేమోననిపిస్తోంది. జయలలిత ఆస్పత్రిలో ఉండగానే ఆమె రాజకీయ వారసురాలిని తానేనని దీప ప్రకటించడం సంచలనమైంది. అత్తను చూద్దామని ఆస్పత్రికి వెళితే గేటు దాటి లోపలికి అడుగు పెట్టనివ్వలేదు. అంత్యక్రియలకూ హాజరు కానివ్వలేదు. సరే...ఈ కథలన్నీ తెల్సినవే. జయలలిత అనారోగ్యంపై, మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న దీప తెర వెనక జరిగిన కుట్రలన్నీ బయటపెడతానంటోంది. 

తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని, ఎన్నికల్లో పోటీ చేస్తానని చెబుతోంది. జయకు రాజకీయ వారసురాలినే కాకుండా ఆస్తికి కూడా తానే వారసురాలినని ఢంకా బజాయిస్తోంది. తాను జయలలిత ఇంట్లోనే పుట్టి పెరిగానని, తానంటే అత్తకు చాలా ప్రేమని అంటోంది. ఇదంతా తన వారసత్వానికి ప్రాతిపదికగా దీప చెప్పుకుంటోంది.  

జయ స్నేహితురాలు శశికళ అన్నాడీఎంకేను ఆక్రమించుకోవడం ఎంతమాత్రం సహించలేకపోతోంది. సరే...ఆమె వాదన వినిపించడంలో తప్పు లేదు. జయ అనారోగ్యం, మరణం వెనక కారణాలను శశికళ, అన్నాడీఎంకే నాయకులు దాస్తున్నట్లే జయలలితకు-అన్న జయకుమార్‌ కుటుంబానికి విభేదాల విషయాన్ని దీప దాస్తోంది.  ఏ కారణం వల్ల విభేదాలు వచ్చాయో, జయ ఇంట్లోంచి అన్న కుటుంబం ఎందుకు బయటకు వెళ్లిపోవాల్సి వచ్చిందో, వదిన చనిపోయినప్పుడు, దీప పెళ్లయినప్పుడు జయ ఎందుకు వెళ్లలేదో, ఆ తరువాత ఆ కుటుంబాన్ని దశాబ్దాల తరబడి ఎందుకు పట్టించుకోలేదో తెలియదు. కొంతకాలం నుంచి మీడియాతో మాట్లాడుతున్న దీప అత్త  తమను దూరం చేశారని చెబుతోందిగాని అసలు కారణాలు చెప్పడంలేదు.         

తాజాగా 'ఆంధ్రజ్యోతి'కి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ విభేదాల గురించి ప్రస్తావించలేదు. 2007లో తాను చివరిసారిగా జయను కలుసుకున్నానని, ఆ రోజు ఆమె జన్మదినమని, ఆ రోజు ఆమె మనసు నొప్పించేలా ప్రవర్తించానని దీప చెప్పింది. కాని దాన్ని గురించి వివరించలేదు. చిన్న చిన్న కోపతాపాలు సహజమని, అంతమాత్రాన కావల్సివారిని ఎవరైనా దూరం పెడతారా? అని ప్రశ్నించింది. అత్తను కలుసుకునేందుకు తాను చాలాసార్లు పోయస్‌ గార్డెన్‌కు వెళ్లినా శశికళ తదితరులు కలవనివ్వలేదని, కనీసం తానొచ్చిన విషయం కూడా జయకు చెప్పలేదని దీప ఆవేదన చెందింది. దీప తమ్ముడు దీపక్‌ను శశికళ తన వైపుకు తిప్పుకుంది. అంటే అక్కాతమ్ముళ్లను విడదీసింది. జయ అంత్యక్రియల్లో అతను పాల్గొన్నాడు. ఈ విషయమై అడిగినప్పుడు దీప 'నో కామెంట్‌' అని వ్యాఖ్యానించింది.  

అన్న జయకుమార్‌ చనిపోయిన తరువాత ఆ కుటుంబంతో జయకు బంధం తెగిపోయింది. ఇందుకు వదిన (దీప తల్లి) కారణమని ఇదివరకు ఓ పత్రిక రాసింది. మొత్తంమీద విభేదాలు రావడానికి ఎవరెంత కారణమో తెలియదు.

రెండు చేతులు మోగితేనే చప్పట్లు వస్తాయి కదా. కాబట్టి విభేదాలకు పూర్తిగా జయ కారణమో, జయకుమార్‌ కుటుంబం కారణమో చెప్పలేం. దీప రాజకీయాల్లోకి రావాలనుకుంటోంది. కుట్రలు ఛేదిస్తానంటోంది. అలాంటప్పుడు జయకు, తమకు కుటుంబానికి విభేదాలు ఎలా ఏర్పడ్డాయో, అది స్వయంకృతాపరాధమా? ఎవరైనా చిచ్చు పెట్టారా? అనే విషయాలను వివరించాల్సిన బాధ్యత దీపకు ఉంది. తానేమిటో ప్రజలకు తెలియచేయాలంటే దీప ఈ విభేదాల గురించి కూడా ఓపెన్‌గా చెప్పాలి.

ఇక దీప అత్తను చివరిసారి ఎప్పుడు చూసింది? ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ '2007లో అత్తను నేను చివరిసారి కలుసుకున్నాను. ఆ రోజు ఆమె జన్మదినం. తన మనసు నొప్పించేలా ప్రవర్తించాను. అప్పట్నుంచి మళ్లీ కలుసుకోలేకపోయాను'...అని చెప్పింది.

ఆంగ్ల మ్యాగజైన్‌ 'ది వీక్‌'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 2002లో జయ రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కలుసుకున్నానని చెప్పింది. అప్పుడు జయ తనతో ప్రేమగా మాట్లాడారని, చాలాసేపు కబుర్లు చెప్పుకున్నామంది.  తాను జయ ఆంటీని చూడ్డం అది చివరిసారి అని చెప్పింది. ఈ తేడా ఎందుకొచ్చింది? ఏది ఏమైనా దీప తన అత్త మరణం వెనక కుట్రను ఛేదించగలిగితే పెద్ద సంచలనమే కలుగుతుంది.

Show comments