వారి 'పొలిటికల్‌ గేమ్‌'ను బయటపెట్టేదెలా?

రాజకీయం కూడా  ఆటే. నిజమైన ఆటల్లో నిబంధనలుంటాయి. క్రీడాస్ఫూర్తి ఉంటుంది. ఓడిపోయినవారిని కూడా విజేతలు బాగా ఆడారని, మంచి పోరాటం చేశారని అభినందిస్తారు. కాని రాజకీయాల్లో ఏం నిబంధనలుండవు. చట్టాలను, నిబంధనలను, చివరకు కోర్టు తీర్పులను కూడా తుంగలో తొక్కి ఒకరిని మరొకరు  దెబ్బ తీసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని అసలు పట్టించుకోరు. క్రీడల్లో కొన్ని విలువలు పాటిస్తారు. కాని రాజకీయ క్రీడలో ఎలాంటి విలువలూ పాటించరు. అలాంటివాటిని ఉప్పు పాతరేస్తారు.  

రాజకీయ పార్టీలు ప్రజాసేవ చేయడం కంటే సొంత ప్రయోజనాలు సాధించుకోవడానికే ప్రాధాన్యమిస్తాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏ పని చేస్తే క్రెడిట్‌ వస్తుందనుకుంటాయో ఆ పనే చేస్తాయి. సొంత ప్రయోజనాల కోసం ప్రజాప్రయోజనాలను నాశనం చేయడానికి వెనకాడవు. పైకి మిత్రుల్లా కనబడే పార్టీలు లోపల శత్రువుల్లా, పైకి శత్రువుల్లా కనబడేవి లోపల మిత్రుల్లా ఉంటాయి. అలా ఎన్నో పొలిటికల్‌ గేమ్స్‌ జరుగుతుంటాయి. ప్రస్తుతం ఓ పొలిటికల్‌ గేమ్‌ రహస్యంగా జరుగుతున్నట్లు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. 

ముఖ్యంగా ఈ పొలిటికల్‌ గేమ్‌ కారణంగా తన రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటాయని భావిస్తున్న వైఎస్సార్‌సీపీ దాన్ని బయటపెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఏమా పొలిటికల్‌ గేమ్‌? ఎవరాడుతున్నారు? ఆ పొలిటికల్‌ గేమ్‌ పేరు 'ప్రత్యేక హోదా'. ఆడుతున్నవారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవర్‌స్టార్‌ కమ్‌ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌. ప్రత్యేక హోదా కోసం మొదటినుంచి తాము ఉద్యమాలు, పోరాటాలు చేస్తుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవర్‌స్టార్‌ భుజాల మీద తుపాకీ పెట్టి, అతనితో పోరాటం చేయించి ప్రత్యేక హోదా సాధించే ప్రయత్నం చేస్తున్నాడని వైకాపా 'థింక్‌ ట్యాంక్‌' నాయకులు అంటే వ్యూహకర్తలు అభిప్రాయపడుతున్నారు. 

పవన్‌ కళ్యాణ్‌ తిరుపతి సభ అనుకోకుండా అంత హడావుడిగా ఏర్పాటు కావడం వెనక చంద్రబాబు హస్తం ఉందంటున్నారు. పవన్‌ వచ్చే నెల 9న కాకినాడలో సభ ఏర్పాటుకు కూడా టీడీపీ సహకారం ఉందని చెబుతున్నారు. బాబు, పవన్‌ ఒక్కటై ప్రత్యేక హోదాపై డ్రామా ఆడుతున్నారని 'అనుకోవడం' తప్ప ఆధారాల్లేవు. అయినా వారద్దరి మధ్య ఉన్న రహస్య అవగాహనను బయటపెట్టాలని వైకాపా మేధావులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రత్యేక హోదా కోసం మొట్టమొదట ఉద్యమాన్ని తామే ప్రారంభించామని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.  Readmore!

ఈమధ్య ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు ప్రత్యేక హోదా సాధన రాజకీయ పార్టీల వల్ల కాకపోతే ఉద్యోగులం పోరాటంలోకి దిగుతామన్నారు. ఈ ప్రకటన కూడా చంద్రబాబే చేయించారని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అశోక్‌బాబు ముఖ్యమంత్రికి సన్నిహితుడని, కావల్సిన మనిషని అంటుంటారు. ఇక ప్రత్యేక హోదా సాధన కోసం పెద్దఎత్తున ప్రజాఉద్యమం లేవదీయాలని వైకాపా ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీలను, ప్రజాసంఘాలను, వివిధ జేఏసీలను కూడగట్టాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తమతో కలిసి పనిచేయాల్సిందిగా పవన్‌ కళ్యాణ్‌ను కూడా అడుగుతామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. 

పవన్‌ కళ్యాణ్‌ తిరుపతి సభ తరువాత ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలో కదలిక వచ్చినట్లు కొందరు భావిస్తున్నారు. నిన్న ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఇంట్లో కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి, అరుణ్‌ జైట్లీ తదితరులు కీలక సమావేశం జరపడం ఈ వాదనకు నిదర్శనంగా ఉంది. ప్రత్యేక హోదా పేరు పెట్టకుండా భారీ సాయం ప్రకటిస్తారని, అందులో రైల్వేజోన్‌, మరికొన్ని కీలక అంశాలు ఉంటాయని మీడియా వార్తలు చెబుతున్నాయి. ఈ ప్రకటన వచ్చే నెల 2వ తేదీనే వస్తుందని, మూడో తేదీ నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళుతున్నందున, ముందురోజే సాయం ప్రకటించేందుకు అంతా సిద్ధం చేస్తున్నారట...! 

ఇలాంటి హడావుడి ఇదివరకు అనేకసార్లు జరిగింది. ఏదో జరగబోతున్నట్లు మీడియాలో వార్తలు రావడం, ఆ తరువాత 'ఓస్‌...ఇంతేనా' అనిపించడం గతంలో అనుభవమే. కాంగ్రెసు ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రయివేటు బిల్లు ప్రవేశపెట్టి, ప్రభుత్వ దాన్ని విజయవంతంగా తుంగలో తొక్కేసిన తరువాత కేంద్ర మంత్రి సుజనా చౌదరి 'వారం రోజుల్లో కీలక ప్రకటన వస్తుంది' అని చెప్పారు. 'ఏపీ ప్రజలకు శుభవార్త వినిపిస్తాం' అని ప్రధాని చెప్పారు. అంతే....! ఆ తరువాత మళ్లీ ఇప్పుడు ఏదో హడావుడి చేస్తున్నారు. ఇది నాటకమో, నిజమో చూద్దాం. 

Show comments