నిజం నిప్పులాంటిది. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు. తప్పు చేస్తే, కొన్నాళ్ళు తప్పించుకోగలరేమోగానీ, శిక్ష తప్పదనే విషయం తమిళనాడులో జయలలిత ఉదంతం చెప్పకనే చెప్పింది. అక్రమాస్తుల కేసులో ఆమెపై నేరం నిరూపించబడింది. ఈ కేసులో గతంలోనే ఆమె జైలు శిక్ష అనుభవించారు. ఆ తర్వాత క్లీన్ చిట్ తెచ్చుకున్నారు. అయితే, ప్రాణం పోయిన తర్వాత కూడా ఆమెను ఆ కేసు వీడలేదు. అక్రమాస్తుల కేసులో జయలలిత దోషిగా తేలారు. జీవించి లేరు గనుక, జైలు శిక్ష తప్పిందంతే. ఇదే కేసులో శశికళ జైలు శిక్ష ఎదుర్కొనాల్సి వస్తోంది. జయలలితలానే ఈమె కూడా గతంలో శిక్ష నుంచి తప్పించుకున్నా, చివరికి 'దోషి' అన్న ముద్ర నుంచి తప్పించుకోలేకపోయారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాలనుకున్న టైమ్‌లో ఆమెను విధి ఇలా వెంటాడింది. దీనర్థమేంటి.? తప్పు చేస్తే, శిక్ష అనుభవించి తీరాల్సిందేనని. దేశంలో ఇంకా న్యాయ వ్యవస్థపైనా, చట్టాలపైనా ప్రజల్లో విశ్వాసం వుందంటే, కాస్త ఆలస్యమైనా ధర్మం గెలుస్తోంది కాబట్టే.
రేప్పొద్దున్న వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఏం జరుగుతుంది.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే. ఇప్పటిదాకా వైఎస్ జగన్‌పై ఆరోపణలకు సంబంధించి నేర నిరూపణ అయితే జరగలేదు. జగన్ కూడా జైలుకు వెళ్ళారు, దోషిగా కాదు.. నిందితుడిగా మాత్రమే. కాంగ్రెస్ హయాంలోనే వైఎస్ జగన్ మీద ఆరోపణలు వచ్చాయి. పార్టీ నుంచి బయటకు వచ్చినందుకే ఆయనపై ఈ ఆరోపణలు. కేసులు నమోదయ్యింది కూడా అప్పుడే. వైఎస్ జగన్‌పై అక్రమాస్తుల కేసుని అడ్డం పెట్టుకుని టీడీపీ చెయ్యని రాజకీయం లేదు. అధికారం ఇప్పుడు టీడీపీ చేతుల్లోనే వుంది. కేంద్రంలో కూడా టీడీపీ మద్దతిచ్చిన ప్రభుత్వమే అధికారం చెలాయిస్తోంది. ఆరోపణలు నిరూపించి, జగన్‌ని జైలుకి పంపించే అవకాశం టీడీపీకి వున్నా.. ఆ పని చేయలేకపోతోందంటే దానర్థమేంటి.? సరే, జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగానే మిగిలిపోతారా.? దోషిగా తేలతారా.? అన్నది తర్వాతి అంశం. దాని చుట్టూ జరుగుతున్న రాజకీయం, ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల్ని కూడా నాశనం చేస్తోంది. చట్ట సభల్లో ప్రజల సమస్యల చుట్టూ జరగాల్సిన చర్చ, జగన్ అక్రమాస్తుల చుట్టూ తిరుగుతోంది. అదే మరి, టీడీపీ రాజకీయమంటే. ఒకవేళ జగన్ దోషిగా తేలితే, శిక్ష పడాల్సిందే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
కానీ, గురివింద తీరున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేస్తున్నదేమిటి.? జగన్ మీద ఆరోపణలు చేస్తున్నారు సరే, ఓటుకు నోటు కేసులో తన పాత్ర గురించి ఆయన మర్చిపోతే ఎలా.? ఆయన మర్చిపోతారో లేదో, జనం మాత్రం ఎప్పటికీ ఓటుకు నోటు కేసునైతే మర్చిపోరు. ఎందుకంటే, అది 'కల్పన' కాదు.. నిజం. టీడీపీ ఎమ్మెల్యే, ఇంకో ఎమ్మెల్యేని 5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయాలనుకున్నది నిజం. ఈ క్రమంలో 50 లక్షల రూపాయల అడ్వాన్స్‌తో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కింది నిజం. ఈ మొత్తం వ్యవహారానికి చంద్రబాబు బ్రీఫింగ్ చేసింది కూడా నిజం. వీటికి సాక్ష్యాలుగా ఆడియో, వీడియో టేపులున్నాయి. రేవంత్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే కానే కాదని చంద్రబాబు చెప్పగలరా.? ఆడియో టేపుల్లో వాయిస్ తనది కాదని చంద్రబాబు చెప్పగలరా.? ఛాన్సే లేదు. అయినాగానీ, 'ఆ కేసులో ఏముంది.?' అంటూ అమాయకంగా ప్రశ్నించేస్తారు చంద్రబాబు. ఇదే మరి, బుకాయింపు అంటే. ఎన్నాళ్ళిలా బుకాయించగలరు.? ఏమీ లేకపోతే, న్యాయస్థానం ఓటుకు నోటు కేసులో మరో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు తాజాగా నోటీసులు ఎందుకు జారీ చేసిందట.
ఓ పక్క, కేసు సుప్రీంకోర్టు మెట్లెక్కింది.. ఇంకో పక్క ఏసీబీ ప్రత్యేక కోర్టు సండ్రకు సమన్లు పంపింది.. ఇప్పుడు, చంద్రబాబు తప్పించుకునేందుకు మార్గాలు వెతకడం, మీడియా ముందు బుకాయించడం మినహా చెయ్యగలిగిందేమీ లేదు. 'తప్పించుకు తిరుగువాడు దన్యుడు..' అని అన్ని సందర్భాల్లోనూ అనలేం. అక్కడ తమిళనాడు ఉదంతం స్పష్టంగా కన్పిస్తోంది. 'ఆంధ్రా శశికళ' అంటూ జగన్ మీద వెటకారాలు చేశారుగానీ, ఏమో భవిష్యత్తులో ఆ ఆంధ్రా శశికళ - చంద్రబాబు కాబోరని గ్యారంటీ ఏంటీ.? ఇంతకీ, చినబాబుని ఎమ్మెల్సీగా చేస్తోన్నదీ, మంత్రివర్గంలోకి తీసుకోనున్నదీ ఓటుకు నోటు కేసు భయంతోనేనా.? ఏమో మరి, చంద్రబాబుకే ఎరుక.!
వెంకట్ ఆరికట్ల