చంద్రబాబు మెడకి 'స్విస్‌ ఛాలెంజ్‌'.!

ఏదో చేసేద్దామనుకుంటే.. ఇంకోదో అయ్యింది.! మొదటి నుంచీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిది ఏకపక్ష వైఖరే. 'ఒంటరి'గా నిర్ణయాలు తీసుకోవడం అలవాటు. ఆయన నిర్ణయాలు తీసుకున్నాకే, తూతూ మంత్రంగా మంత్రులకు సమాచారమిస్తారు. పేరుకే క్యాబినెట్‌ భేటీ.. అక్కడ జరిగేదంతా పూర్తిగా చంద్రబాబు స్వీయ నిర్ణయాల మేరకే. ఇది ఇప్పుడు కొత్తగా వెలుగు చూసిన వ్యవహారమేమీ కాదు. చంద్రబాబుకి అత్యంత సన్నిహితులైనవారు చెప్పేమాట. ఇది బహిరంగ రహస్యం. 

రాజధాని అమరావతి నిర్మాణం ఎక్కడ జరగాలి.? అన్న విషయమే, చంద్రబాబే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. 'అడవుల్లో రాజధాని కట్టలేం కదా..' అంటూ, పచ్చని పంట పొలాల్లో రైతుల పొట్టగొట్టి మరీ రాజధాని నిర్మాణానికి నిర్ణయం తీసేసుకున్నారు చంద్రబాబు. అదేదో రైతుల్ని ఒప్పించి చేయాలి కదా.? అంటే, 'ఒప్పించా కాబట్టే భూ సమీకరణ జరిగింది..' అంటూ బుకాయిస్తారు తప్ప, తెరవెనుక బెదిరింపుల వ్యవహారం గురించి నోరు మెదపరు. 

ఇదొక్కటే కాదు, ఏ విషయంలో అయినా చంద్రబాబు వైఖరి అంతే. స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలోనూ చంద్రబాబు, తనకు నచ్చిన రీతిలో నిర్ణయాలు తీసుకున్నారు. ఫలితం, హైకోర్టులో 'స్టే'. 'అబ్బే, అదేమీ తుది తీర్పు కాదు.. మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే..' అంటూ బుకాయించడానికి మంత్రి నారాయణ లాంటి 'భజనపరులు' చంద్రబాబు వెంట ఎప్పుడూ వుంటారు. 

రాజధాని నిర్మాణం అత్యంత ప్రతిష్టాత్మకం.. పైగా ఇది ఆత్మగౌరవంతో కూడుకున్న విషయం. అంతర్జాతీయ స్థాయి రాజధాని.. అని చెబుతున్నప్పుడు, ప్రతి విషయం ఎంత పారదర్శకంగా జరగాలి.? న్యాయస్థానం రాజధాని నిర్మాణానికి సంబంధించి స్విస్‌ ఛాలెంజ్‌ విధానాన్ని ప్రశ్నించినప్పుడు, ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీడియాపైన కూడా వుంది కదా. దురదృష్టవశాత్తూ ఏపీలో మెజార్టీ మీడియా సంస్థలు, చంద్రబాబు చెప్పుచేతల్లోనే నడుస్తున్నాయి. 

ఇలా ఎన్నాళ్ళు చంద్రబాబు మీడియాని మేనేజ్‌ చేయగలరు.? ప్రజల్ని బుకాయించగలరు.? స్విస్‌ ఛాలెంజ్‌ విధానంపై హైకోర్టు స్టే విధించింది. ఆ స్టే ఎత్తివేసేందుకు ప్రభుత్వం అప్పీల్‌కి వెళ్ళే అవకాశం వుంది. సమస్యల్ని సరిదిద్దకుండా అప్పీల్‌కి వెళితే ప్రస్తుతానికి ప్రభుత్వానికి ఊరట లభించొచ్చుగాక. కానీ, భవిష్యత్తులో పరిస్థితులు ఇలాగే వుండవు కదా. ఐదేళ్ళకోసారి ప్రభుత్వాలు మారే అవకాశం వుంది. ఆల్రెడీ రెండున్నరేళ్ళు గడిచిపోతోంది. ఇంకో రెండున్నరేళ్ళ తర్వాత ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఇప్పుడు అధికారంలో వున్నారు గనుక, బుకాయిస్తారు.. రేప్పొద్దున్న అధికారం పోతే పరిస్థితేంటి.? 

ఏమవుతుంది, మహా అయితే రాజకీయ దుమారం.. అని చంద్రబాబు సరిపెట్టుకోవచ్చుగాక. అప్పుడు లోటుపాట్లు బయటపడితే, ఇది ఆషామాషీ వ్యవహారం కాదు.. రాజధాని - ఆత్మగౌరవం.. చరిత్ర పుటల్లో చంద్రబాబు ద్రోహిగా నిలిచిపోతారనడంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అనవసరం. న్యాయస్థానమే సూటి ప్రశ్నలు సంధించాక, ప్రజలకు సమాధానమివ్వాల్సింది పోయి.. జిమ్మిక్కులు చేస్తామనడం నూటికి నూరుపాళ్ళూ హాస్యాస్పదమే.

Show comments