పవనిజం.. పవన్‌ చెప్పిందే 'నిజం'

పాదయాత్ర సంగతి తర్వాత.. ముందు నా కారుని అయినా వెళ్ళనిస్తారా.? అంటూ నిన్న పవన్‌కళ్యాణ్‌ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు నిజానికి, పవన్‌కళ్యాణ్‌ అభిమానులకి గట్టిగానే తగిలేసి వుండాలి.! 

సినీ సెలబ్రిటీలో జనంలోకి వెళితే ఇంకేమన్నా వుందా.? ఆ అభిమానంలో సెలబ్రిటీలు మునిగిపోతారు.. నానా తంటాలూ పడ్తారు. హీరోయిన్ల పరిస్థితి మరీ దారుణం. అక్కడా, ఇక్కడా తాకేసి తమ 'అభిమానం' చాటేసుకుంటుంటారు. అయినాసరే, ఆ అభిమానుల్ని చూసి అక్కడికి అలా ఉప్పొంగిపోతున్నట్లు నటించక తప్పదు. పవన్‌కళ్యాణ్‌ లాంటి స్టార్‌ హీరో జనంలోకి వెళితే పరిస్థితి ఎలా వుంటుందో చాలా సందర్భాల్లో చూసేశాం, చూస్తూనే వున్నాం. 

అలాగని, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు జనంలోకి వెళ్ళడానికి ఆ అభిమానమే అడ్డంకి.. అంటే ఎలా కుదురుతుంది.? చిరంజీవీ రాజకీయాల్లోకి వచ్చారు.. ఆయనా జనంలోకి వెళ్ళారు. ఆయన్ని చూసేందుకు జనం పోటీపడ్డారు, ఎగబడ్డారు, తోపులాటలూ చోటుచేసుకున్నాయి. అభిమాన సంద్రంలో చిరంజీవి మునిగి తేలారు. ఆ అభిమానం ఓట్ల వర్షం కురిపించిందా.? లేదా.? అన్నది వేరే విషయం. 

అన్నట్టు, అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజార్యాం పార్టీ తరఫున 'యువరాజ్యం' అధ్యక్షుడిగా పవన్‌కళ్యాణ్‌ కూడా జనంలోకి వెళ్ళారు. అప్పుడు జనం అడ్డుకుంటున్నారని, రాజకీయ పర్యటనలు మానెయ్య లేదు కదా.! అక్టోబర్‌ తర్వాత సినిమాల నుంచి కాస్తంత వెసులుబాటు తీసుకుని, జనంలోకి వెళతానన్న పవన్‌కళ్యాణ్‌, పాదయాత్ర గురించి మీడియా ప్రశ్నిస్తే 'అభిమానం' అన్న మాటని అడ్డుగా వేసేశారు. భలే తెలివైనోడు సుమీ.! 

అభిమానులు అమితమైన అభిమానం చూపించడమే, పవన్‌కళ్యాణ్‌ జనంలోకి రావడానికి అడ్డంకి అన్న భావన ఏర్పడిందిప్పుడు. అలా పవన్‌కళ్యాణ్‌ ప్రొజెక్షన్‌ ఇచ్చారు కూడా. 'మెగా' సినిమా ఫంక్షన్లలో పవన్‌కళ్యాణ్‌ అభిమానుల హంగామా చూశాం, చూస్తూనే వున్నాం. ఆ అభిమానాన్ని చూసి అంతా విసుక్కుంటున్నా అభిమానులు మారడంలేదాయె. అక్కడే ఆగనోళ్ళు, జనంలోకి పవన్‌ వస్తే ఆగుతారా.? ఛాన్సే లేదు. కానీ, అభిమానుల మీద ఆయా ప్రముఖులకు కంట్రోల్‌ లేకపోతే, అసలు అభిమానం అన్న మాటకే అర్థం లేదు. 

ఒక్కటి మాత్రం నిజం.. అభిమానులు కంట్రోల్‌లో వుండాలి. ఈ విషయంలో పవన్‌కళ్యాణ్‌ పరోక్షంగా చేసిన సూచనని ఆహ్వానించాల్సిందే, అభినందించాల్సిందే. కానీ, బహిరంగ సభలు పెట్టలేను, జనంలోకి వెళ్ళలేను.. అంటూ, దానికి అభిమానం అనే 'సాకు' చూపించడం మాత్రం నూటికి నూరుపాళ్ళూ హాస్యాస్పదం. నాయకుడన్పించుకోవాలనుకున్నప్పుడు జనంలోకి వెళ్ళలేకపోతున్నాడంటే, దానికి అడ్డుపడుతున్న అభిమానం విషయంలో పవన్‌ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి తీరాల్సిందే. లేదంటే, నాయకుడన్పించుకోవడం పవన్‌కళ్యాణ్‌కి అసాధ్యం.

Show comments