రాజకీయ దిగ్గజంతో చిన్నమ్మ పోటీ పడగలదా?

దివంగత జయలలిత ప్రియ సఖి శశికళా నటరాజన్‌ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన తరువాత తమిళనాడు రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఈ కథలో రోజుకో ట్విస్టు బయటకు వస్తోంది. ఈ ట్విస్టుల్లో వాస్తవాలెన్ని, అవాస్తవాలెన్ని అనే విషయం కాలక్రమంలో తేటతెల్లమవుతుంది. జయలలిత కన్నుమూసిన దగ్గర్నుంచి జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అన్నాడీఎంకే పార్టీని నడపడం శశికళకు అంత సులభం కాదని, అదో ముళ్ల కిరీటంగా మారుతుందని అనిపిస్తోంది.

పార్టీలోని మెజారిటీ నాయకులు, సభ్యులు, కార్యకర్తలు చిన్నమ్మను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసుకున్నప్పటికీ ఆమె వ్యతిరేకవర్గం చాప కింద నీరులా విస్తరిస్తోందని మీడియాలో వస్తున్న వార్తలనుబట్టి అర్థమవుతోంది.

సంక్రాంతి సమయంలో ఆమె సీఎం పీఠం అలంకరిస్తారని మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ అదంత సులభంగా జరుగుతుందా? అనే అనుమానం కలుగుతోంది. తాను జయలలిత బాటలోనే నడుస్తానని ప్రధాన కార్యదర్శి అయిన రోజు శశి చెప్పింది. 'అమ్మ' మార్గంలో నడవటమంటే నియంతలా వ్యవహరించడమని అర్థం చేసుకున్న చిన్నమ్మ అప్పుడే జోరుగా పెత్తనం చేస్తూ నాయకులను హడలెత్తిస్తున్నట్లు సమాచారం. 

ముఖ్యమంత్రి పన్నీరుశెల్వంను కూడా హెచ్చరిస్తున్నట్లు, బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. శశికళ సీఎం అయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ సొంత పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే రాజీనామా చేయడం శశికళ వ్యతిరేక పవనాలు బలంగా వీచేందుకు సంకేతంగా కనిపిస్తోంది.

జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌కు అనేకమంది మద్దుతు ఇస్తున్నారని, ఆమె రాజకీయాల్లోకి రావాలని డిమాండ్‌ చేస్తున్నరని మీడియా సమాచారం. తాను త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని ఆమె కూడా చెప్పింది. అన్నాడీఎంకేపై ఆమె ప్రభావం ఎంత ఉంటుందో ఇప్పుడు చెప్పలేం. ప్రస్తుతమైతే చిన్నమ్మ హవా నడుస్తోంది. చిన్నమ్మ, దీపా జయకుమార్‌ ఇద్దరూ రాజకీయంగా అనుభవ శూన్యులు. జయలలిత పేరు చెప్పుకొని ప్రజల్లోకి పోవాల్సిందే. జనం వీరిని ఆదరిస్తే అది జయలలిత మీద అభిమానంతోనే అవుతుంది. వీరికంటూ సొంత ఇమేజ్‌ ఏమీ లేదు. ఇదిలా ఉంటే, ద్రవిడ రాజకీయాల్లో జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి దిగ్గజాలే కాకుండా సమకాలికులు కూడా. ఒక దిగ్గజం నేల రాలింది. మరో దిగ్గజం అవసాన దశలో ఉంది. 

ప్రస్తుతం పేరుకు మాత్రమే కరుణానిధి డీఎంకే అధినేత. ఆయన తన వారసుడిగా ప్రియ పుత్రుడు ఎంకే స్టాలిన్‌ను కొంతకాలం క్రితం ప్రకటించారు. ఇలా ప్రకటించడం కేవలం లాంఛనప్రాయమే. స్టాలినే వారసుడనే విషయం ఎప్పుడో అందరికీ తెలుసు. ఇక తాజాగా స్టాలిన్‌ను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పార్టీ ఎన్నుకుంది. కరుణానిధి అనారోగ్యం కారణంగా పూర్తిగా అచేతనావస్థలో ఉన్నారు. అదే సమయంలో జయ కన్నుమూయడం, శశికళ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి కావడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఉత్కంఠభరితంగా కూడా మారాయి. ఈ నేపథ్యంలో ఇది రాజకీయంగా డీఎంకేకు కీలక సమయం. దీంతో స్టాలిన్‌ పూర్తి అధికారాలతో రంగంలోకి  దిగారు.

కరుణ ఇంకా జీవించే ఉన్నారు కాబట్టి ఆయన గౌరవానికి భంగం కలగకుండా స్టాలిన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అ అయ్యారు. కాని ఈయనే  అధ్యక్షుడి కింద లెక్క. కరుణానిధి-జయలలిత శకం ముగిసి స్టాలిన్‌-శశికళ శకం మొదలైంది. కరుణ కంటే జయ జూనియర్‌ అయినప్పటికీ రాజకీయాల్లో ఆయనతో సమంగా ఎదిగి దిగ్గజమనిపించుకున్నారు. జనం ఇద్దరినీ బలమైన నేతలుగా భావించారు. ప్రస్తుతానికి వస్తే స్టాలిన్‌ ముందు శశికళ ఎందుకూ పనికిరాదనే చెప్పుకోవాలి.

స్టాలిన్‌కు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. కేవలం ఎమ్మెల్యే కాదు. మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, చెన్నయ్‌ మేయర్‌గా పని చేశారు. పార్టీలో యువజన విభాగం అధ్యక్షుడిగా, కోశాధికారిగా చేశారు. ఉద్యమాల్లో పాల్గొని జైలుకెళ్లిన నాయకుడు. కరుణానిధి తరువాత అంతటివాడు. ఈయనా దిగ్గజమనే చెప్పుకోవాలి. శశికళది రాజకీయ కుటుంబం కాదు. జయలలితతో మూడు దశాబ్దాల స్నేహం ఉన్నా ఆమె నీడ మాదిరిగా ఉందే తప్ప రాజకీయ అనుభవం లేదు. జయతో స్నేహాన్ని అడ్డం పెట్టుకొని 'తెర వెనక' కొన్ని పనులు చేసింది. జయ ఇంట్లోనే ఉంది కాబట్టి రాజకీయాలను పరిశీలించివుంటుంది. నాయకులతో పరిచయాలున్నాయి. ఇంతకు మించి రాజకీయ అనుభవం లేదని చెప్పొచ్చు.

ఒకవేళ ఇప్పుడు ఏదో విధంగా సీఎం అయినప్పటికీ భవిష్యత్తులో స్టాలిన్‌తో పోటీపడగలదా? ఎత్తులు వేయగలదా? వ్యూహాలు రచించగలదా? స్టాలిన్‌, శశికళ ఒకే వయసున్నవారు. స్టాలిన్‌ ఈమె కంటే కొన్ని నెలలు మాత్రమే పెద్ద.

Show comments