రూ.25 వేల కోట్ల నష్టం.. బెంగళూరుకు బుద్ధొచ్చిందా?

బహుశా.. కావేరీ నీటి విషయంలో సుప్రీం కోర్టు తీర్పుకు విలువనిచ్చి.. తమిళుల వంతు నీటిని వాళ్లకు వదిలేసి ఉండుంటే.. దాని వల్ల కొత్తగా వచ్చే నష్టం ఏమీ లేకపోయేదేమో! సుప్రీం కోర్టు తీర్పు వచ్చాకా కూడా చేసిన రచ్చతో.. తమిళులకు వెళ్లే నీటినేమీ ఆపలేకపోగా.. ఒంటికి నిప్పు పెట్టుకున్న నొప్పి కూడా తెలుస్తోంది కన్నడీగులకు. 

అది కూడా ఈ సారి రచ్చ అంతా బెంగళూరు వేదికగా జరగడంతో కన్నడీగులు కావాల్సినంత చెడ్డ పేరును, సొంత రాష్ట్రంలో పరిశ్రమకు బోలెడంత నష్టాన్ని మిగుల్చుకున్నారు. కావేరీ పరిణామాల నేపథ్యంలో బెంగళూరులో జరిగిన విధ్వంసం, తత్ఫలితంగా అన్ని ఐటీ ఆధారిత పరిశ్రమలన్నీ బంద్ కావడం. తదితర పరిణామాలతో జరిగిన నష్టం అక్షరాలా పాతిక వేల కోట్ల రూపాయలు అని అసోచామ్ అంచనా వేసింది!

ప్రత్యేకించి ఈ తరహా విధ్వంసం బెంగళూరుకు చాలా చెడ్డ పేరును తీసుకు వస్తుందని కూడా అసోచామ్ హెచ్చరించడం గమనార్హం. వైష్యమ్యాలతో ప్రైవేట్ ఆస్తులపై దాడులు చేయడం, మనుషుల మీదకు కూడా దాడులకు పూనుకోవడం అనేది చెడు అభిప్రాయానికి కారణం అవుతుందని అసోచామే చెప్పనక్కకర్లేదు. అల్లర్లు చేసిన వాళ్లకు కూడా తెలిసే ఉంటుంది. 

మరి ఇంత జేసి ఏం సాధించారు? తమిళనాడుకు వెళ్లే నీళ్లనేమో ఆపలేకపోయారు. తమిళులతో పాత శత్రుత్వానికి ఇప్పుడు పదును పెంచుకున్నారు. రేపటి నుంచి ఏ వేదిక మీద అయినా తమిళులు, కన్నడీగులు ఎడమొహం పెడమొహంగా ఉండాల్సిందే! 

ప్రస్తుతానికి అయితే బెంగళూరులో క్రమంగా ప్రశాంత వాతావరణం ఏర్పడుతోంది. ఆర్టీసీ బస్సులు ఇప్పుడిప్పుడే రోడ్డెక్కుతున్నాయి. రెండు రోజుల పాటు మూత బడ్డ ఐటీ కంపెనీలు బుధవారం తెరుచుకున్నాయి. అయితే ఈ గొడవ  ఇప్పుడే సద్దుమణిగినట్టే అనుకోవడానికి లేదు. కావేరీ నీటిని తమిళనాడుకు వదలడం గురించి  సుప్రీం పెట్టిన గడువు ఇంకా పూర్తి కాలేదు. ఆ రోజులోపు కన్నడీగులు మళ్లీ ఎక్కడ భగ్గుమంటారో అనే భయాందోళనలున్నాయి. మరోవైపు ఇప్పుడు తమిళులు నిరసనలు.. బంద్ లు అంటూ హడావుడి చేస్తున్నారు.

Show comments