జగన్ ప్రశ్న: స్వాగతించడానికి చంద్రబాబు ఎవరు?!

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను ఇచ్చేదేమీ లేదు, సాయం మాత్రమే ఉంటుందన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనను స్వాగతిస్తున్నామని ప్రకటించడానికి  చంద్రబాబు ఎవరు? అని ప్రశ్నించాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత , ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగే ఈ విషయాన్ని చంద్రబాబు ఎలా స్వాగతిస్తాడు? అని ప్రశ్నించాడు జగన్.  ప్రత్యేకహోదా విషయంలో బాబు వైఖరిని జగన్ తీవ్రంగా దుయ్యబట్టాడు. విభజిత ఆంధ్రప్రదేశ్ కు ప్రాణప్రాయమైన ప్రత్యేకహోదా అంశంపై కేంద్రం వైఖరిని, ఈ అంశంపై ఏపీ సీఎం వైఖరిని జగన్ తీవ్రంగా ఖండించాడు. 

రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుకు, ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీ వైఖరికి ఏమీ తేడా లేదని జగన్ వ్యాఖ్యానించాడు. సమైక్యాంధ్రను కోరుకుంటున్న ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేసి, పార్లమెంటు తలుపులు మూసి ఆంధ్రప్రదేశ్ ను విభజించారని, ప్రత్యేకహోదా విషయంలో కూడా అర్ధరాత్రి ప్రకటనలతో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని జగన్ విమర్శించాడు.

కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏపీ ప్రజల చెవుల్లో క్యాబేజీ పెట్టారని జగన్ వ్యాఖ్యానించాడు. ప్రత్యేకహోదా తో ఏపీకి మేలు జరుగుతుందన్న ప్రజల ఆశలపై అరుణ్ జైట్లీ నీళ్లు చల్లారని.. ఈ విషయంలో కేంధ్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ శనివారం ఏపీ బంద్ ను నిర్వహించనున్నామని జగన్ ప్రకటించాడు. ఈ బంద్ కు సహకరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగేలా చూడాలని జగన్ ఆ రాష్ట ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. 

Show comments