చంద్రబాబు కంటే రాజమౌళి గ్రేట్‌....!

గతంలో తెలుగు మీడియం పాఠశాలల్లో పిల్లలకు వక్తృత్వ, వ్యాసరచన పోటీలు పెట్టేవారు. ఈ పోటీల్లో ఒక అంశం తప్పనిసరిగా ఉండేది. 'కత్తి గొప్పదా? కలం గొప్పదా?' అనే అంశంపై ప్రసంగ పోటీయో, వ్యాస రచన పోటీయో నిర్వహించేవారు. పిల్లలు సహజంగానే కలం గొప్పదని తేల్చేవారు. అలాగే బుద్ధి బలం గొప్పదా? కత్తి బలం గొప్పదా? అనే పోటీ పెట్టేవారు. విద్యార్థులు బుద్ధి బలం గొప్పదని ముగింపునిచ్చేవారు. ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు ఇప్పుడు ఇలాంటి పోటీ పెడితే ఇవ్వాల్సిన అంశం ఏమిటంటే...ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గొప్పవాడా? సినిమా దర్శకుడు రాజమౌళి గొప్పవాడా? అని.

రాజమౌళి గొప్ప దర్శకుడు. వరుసగా తీసిన సినిమాలన్నీ సూపర్‌డూపర్‌ హిట్‌ అవుతున్నాయి. బాహుబలి సినిమా అద్భుతంగా తీసి జాతీయ అవార్డు సంపాదించాడు. చంద్రబాబు నాయుడూ గొప్పవాడే. కాదనేందుకు అవకాశం లేదు. రాజకీయ నాయకుడిగా, ఉమ్మడి ఆంధ్రకు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసి, మళ్లీ నవ్యాంధ్రకు సీఎంగా చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుంది. ఇద్దరూ వారి వారి రంగాల్లో గొప్పోళ్లే అయినప్పుడు రాజమౌళిని గొప్పగా చెప్పుకోవడం ఎందుకు? ఎందుకంటే రాజధాని అమరావతి  నిర్మాణంపై ఆయనతో  మాట్లాడటానికి, ఆయన సలహాలు, సూచనలు తీసుకోవడానికి సుమారు ఐదు నెలలపాటు ఎదురుచూడటానికి ప్రభుత్వం సిద్ధపడింది కాబట్టి. 

ప్రభుత్వంతో (సీఆర్‌డీఏ) మాట్లాడటానికి తనకు ఏప్రిల్‌ వరకు తీరిక లేదని, బాహుబలి-2 సినిమాతో బిజీగా ఉన్నానని రాజమౌళి చెప్పడంతో అధికారులకు ఎదురుచూపులు తప్పవు. లెక్క ప్రకారమైతే ముఖ్యమంత్రి లేదా ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడాలంటే రాజమౌళి అపాయింట్‌మెంట్‌ తీసుకొవాలి. అవసరమైతే ఎదురుచూడాలి. కాని సీన్‌ రివర్స్‌ అయింది. అవసరం రాజమౌళిది కాదు, ప్రభుత్వానిది. నిజంగా ఇది విచిత్రమే. పూర్వకాలంలో రాజులు తాము ఏదైనా చూసి మనసు పారేసుకుంటే దాన్ని సాధించి తీసుకురావాలని అధికారులను ఆదేశించేవారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రూపంలో ఉన్న రాజు చంద్రబాబు నాయుడు బాహుబలి సినిమాలోని మహిష్మతి నగరాన్ని చూసి మనుసు పారేసుకున్నారు. 

అలాంటి నగరాన్ని (ఐకానిక్‌ భవనాలను) నిర్మించి పూర్వ వైభవం ప్రజలకు చూపించాలనుకుంటున్నారు. ప్రపంచంలోని పలు దేశాలు తిరిగి నిజమైన, అద్భుతమైన నగరాలను చూసి మనసు పారేసుకొని అమరావతిని ఇలా అంటే విదేశీ నగరంలా కట్టాలనుకున్నారు. ఏ నగరం చూస్తే ఆ నగరంలా అమరావతి నిర్మిస్తానని చెప్పుకున్నారు. కాని చంద్రబాబు రాజుకు ఏదీ నచ్చలేదు. చివరకు అవాస్తమైన గ్రాఫిక్స్‌ నగరం మహిష్మతి ఆయనకు తెగ నచ్చేసింది. ప్రపంచంలోని నిజమైన నగరాలు నచ్చినట్లే ఊహాజనితమైన నగరం కూడా నచ్చింది. ఇది రాజమౌళి ఆలోచనల్లోంచి పుట్టిన నగరం కాబట్టి దాన్ని వాస్తవంగా నిర్మించాలంటే ఆయన సహకారం అవసరం. 

ఉన్నట్లుండి రాజమౌళి ఆర్కిటెక్టుగా, డిజైనర్‌గా మారిపోయాడు. సినిమాలోని నగరాన్ని చూసి మనసు పారేసుకొని అలాంటి నగరం నిర్మించాలనే ఆలోచన ప్రపంచంలోని ఏ పాలకుడికీ వచ్చివుండదేమో....! ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్టులు రూపొందిస్తున్న డిజైన్లు చంద్రబాబుకు ఎందుకు నచ్చడంలేదు? అసలు అమరావతిని ఆయన ఎలా నిర్మించాలనుకున్నారు? ఆయన భ్రమల్లో జీవిస్తూ ప్రజలను ఊహాలోకాల్లో తేలియాడిస్తున్నారు. గత ఏడాది ప్రారంభించిన మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ ఎంపిక ఇప్పటివరకు పూర్తి చేయలేకపోయిన చంద్రబాబు 'అద్భుత రాజధాని' ఎలా నిర్మించగలరు? 

ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు పనికిమాలిన డిజైన్లు ఎందుకు రూపొందిస్తున్నాయి? అలాంటప్పుడు విదేశీయుల కంటే మనోళ్లే గొప్పోళ్లు కదా. బాబుకు పొరుగింటి పుల్లకూర తప్ప దేశవాళీ కూర రుచిగా ఉండదు. విదేశీయులను పట్టుకొని ఇంతకాలం వేలాడి ఇప్పుడు ఒక సినిమా దర్శకుడి అపాయింట్‌మెంట్‌ కోసం ఎదురుచూస్తున్నారంటే 'గొప్పోడు' అని ఎవరిని అనుకోవాలి? బాబు స్థాయి తగ్గిందా? రాజమౌళి స్థాయి పెరిగిందా? 

Show comments