కుల సమీకరణలన్నీ పక్కన పెట్టేసిన జగన్!

సాధారణంగా రాజ్యసభ ఎంపీ ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తాయి. కుల ప్రాంత సమీకరణల్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఇతరత్రా అన్ని కారణాలకంటె ముఖ్యంగా వీటిని పరిగణిస్తారు. అయితే ఏపీసీఎం జగన్మోహనరెడ్డి ఈసారి చాలా భిన్నంగా వ్యవహరించారు. కుల, ప్రాంత సమీకరణల్ని కూడా పక్కన పెట్టేశారు. కేవలం.. తన ప్రభుత్వ విధానాలు, రాష్ట్ర పురోగతికి సంబంధించిన అంశాలను మాత్రమే ఆయన పరిగణనలోకి తీసుకున్నారు. రాజ్యసభ ఎంపీల ఎంపికలో జగన్ , ఆ రకంగా తనదైన ముద్ర చూపించారు.

రాజ్యసభ ఎంపీ ఎన్నికల సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ కు నాలుగు ఎంపీ సీట్లు దక్కాయి. వాటికి గాను.. జగన్ మొట్టమొదటగా అయోధ్య రామిరెడ్డి పేరును చాలాకాలం కిందటే ప్రకటించారు. ఇక వైవీసుబ్బారెడ్డి లాంటివాళ్లు కూడా పోటీలో ఉండగా, బాబాయి అయిన ఆయనకు సీటు దక్కుతుందనే అభిప్రాయం వ్యాప్తిలోకి వచ్చింది.

కాకపోతే.. శాసనమండలిని రద్దు చేయడం, ఆ రకంగా పార్టీకి ఆప్తులైన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీ స్థానాన్ని, మంత్రిపదవులను కోల్పోయే ప్రమాదం రావడం తటస్థించింది. దీంతో జగన్ వ్యూహం మార్చారు. మంత్రి పదవులు కోల్పోయే ఆ ఇద్దరినీ కూడా రాజ్యసభకు పంపేయాలని అనుకున్నారు. అయితే అయోధ్య రామిరెడ్డికి ఆల్రెడీ ప్రకటించిన నేపథ్యంలో.. గుంటూరు జిల్లాకే చెందిన మోపిదేవికి ఈ దఫా ఛాన్సు దక్కకపోవచ్చునని వచ్చే ఏడాది ఇస్తారని పార్టీలో ఊహాగానాలు సాగాయి. జగన్ వాటిని ఖాతరు చేయలేదు.

అలాగే కులసమీకరణల గురించి కూడా చర్చ జరిగింది. అయోధ్య రామిరెడ్డి ఒకరు కాగా, పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ఇవ్వడం ద్వారా బీసీలకు ఒకటి ఇచ్చినట్లయింది. పరిమల్ నత్వానీ రూపంలో మూడో సీటు ఆబ్లిగేషన్ అయింది. మోపిదేవి రూపేణా నాలుగో సీటు కూడా బీసీలకు ఇవ్వకుండా.. ఎస్సీఎస్టీ, మైనారిటీ వర్గాలనుంచి ఎంపిక చేస్తారని అంతా అనుకున్నారు. కానీ జగన్ అవేమీ పట్టించుకోలేదు. మోపిదేవికి టికెట్ ఇచ్చారు. ముఖేష్ అంబానీ కోరిక మేరకు పరిమల్ నత్వానీని ఏపీ నుంచి రాజ్యసభకు పంపడం.. అనేక రకాలుగా రాష్ట్రానికి మేలు చేస్తుందనే అంచనాలున్నాయి.

Show comments