కాంగ్రెస్ మైండ్ గేమ్ సక్సెస్ అవుతుందా?

అసెంబ్లీ ఎన్నికలు కావొచ్చు, పార్లమెంటు ఎన్నికలు కావొచ్చు ఏ ఎన్నికలైనా సరే రాజకీయ పార్టీలు ఆడే మైండ్ గేమ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఓటర్ల ఆలోచనా ధోరణి మార్చడమే, వారిని తమ వైపు తిప్పుకోవడమే రాజకీయ పార్టీల లక్ష్యం. ఈ మైండ్ గేమ్స్ ప్రజల బలహీనతలతో లింక్ అయి ఉంటాయి. 

ఆ బలహీనతలను క్యాష్ చేసుకోవడమే పార్టీల పని. మైండ్ గేమ్ అంటే ఏమీ లేదు. చాలా సింపుల్. ఒక విషయాన్ని పదేపదే ప్రజలకు అదే పనిగా నూరి పోస్తుంటే ఈ ప్రభావం ఓట్లు వేసే సమయంలో కనబడుతుందని నాయకుల లాజిక్. చెప్పే విషయంలో అబద్దముందా, నిజముందా అనే విషయం అనవసరం. చెప్పేది ప్రజల బుర్రలోకి వెళుతోందా లేదా అనేదే ప్రధానం. 

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. పార్టీలు కత్తులు దూసుకుంటున్నాయి. మైండ్ గేమ్స్ ఆడుతున్నాయి. గులాబీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పట్టుకుంది. అవి అమలు కావంటూ ప్రజల మైండ్ లోకి ఎక్కిస్తోంది. ఇక కాంగ్రెస్ బడుగు బలహీన వర్గాల బలహీనతతో మైండ్ గేమ్ ఆడుతోంది. 

కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను ఎత్తేస్తుందని, రాజ్యాంగాన్ని మారుస్తుందని అదే పనిగా ఊదరగొడుతోంది. ఈ విషయాన్ని పెద్దఎత్తున ప్రచారం చేస్తోంది. ప్రధానంగా రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే చాలు ఇదే విషయం చెబుతున్నారు. ఆయన ధాటికి  తట్టుకోలేని బీజేపీ అగ్ర నాయకులు ఆ పని చేయబోమని చెప్పడానికి నానా తంటాలు పడుతున్నారు.

Readmore!

ప్రధాని మోడీ, అమిత్ షా ఇంకా ఇతర కేంద్ర నాయకులు రిజర్వేషన్లు రద్దు కావని అదే పనిగా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ నాయకులు మాత్రం ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఖరాకండిగా చెబుతున్నారు. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్స్ రద్దు చేసే ప్రసక్తే లేదంటున్నారు. అయినా కాంగ్రెస్ వాళ్ళు ఊరుకోవడంలేదు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని చెప్పడానికి ఆధారాలు కూడా ఉన్నాయంటూ రేవంత్ రెడ్డి యేవో కాయితాలు కూడా ప్రచారంలో చూపించాడు.

రిజర్వేషన్స్ అనేవి మన దేశంలో రాజకీయ పార్టీలకు పెద్ద ఆయుధం. దాన్ని వెపెన్ మాదిరిగా, భయపెట్టడానికి బూచి మాదిరిగా వాడుకుంటారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో తాను అధికారంలోకి రావడం కోసం రిజర్వేషన్లను ఆయుధంలా వాడుకుంటోంది. బూచి మాదిరిగానూ వాడుకుంటోంది. రిజర్వేషన్లు అనేవి బడుగు బలహీన వర్గాల, వెనుకబడిన వర్గాల బలహీనత. 

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా ఆ  బలహీనత  అలాగే ఉంది. ప్రభుత్వాలు, పార్టీలు ఆ బలహీనతను అలాగే ఉంచాయని చెప్పొచ్చు. ఆ బలహీనత పోయి ఆ వర్గాలు బలంగా మారితే రాజకీయ పార్టీలకు, నాయకులకు మనుగడ కష్టమైపోతుంది.  ఒకవేళ ఆ వర్గాలు బలంగా మారినా కూడా పార్టీలు రిజర్వేషన్లు వదలవు. 

రిజర్వేషన్ల రద్దుపై రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రచారానికి కాంగ్రెస్ అధిష్టానం ఫిదా అయిందట. మోడీపై బలంగా దాడి చేస్తుంటే హ్యాపీగా ఫీలవుతోందట. ఇంకా ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లో కూడా రిజర్వేషన్స్ రద్దు అంశాన్ని బలంగా చెప్పాలని అధిష్టానం ఆయన్ని కోరిందని సమాచారం. తెలంగాణలో ఎన్నికలు పూర్తి కాగానే ఆయన వేరే రాష్ట్రాలకు వెళతాడు. 

సాధారణంగా ప్రభుత్వాలు తాము లక్షల్లో ఉద్యోగాలు  ఇచ్చామని డప్పు కొట్టుకుంటాయి. కానీ వాటిల్లో అత్యధికంగా ప్రైవేటు రంగంలోనే ఉంటాయి. అక్కడ రిజర్వేషన్లు ఉండవు. ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తక్కువ. ఉన్న ఖాళీలు కూడా భర్తీ చేయడంలేదు. అలాంటాప్పుడు రిజర్వేషన్ల అమలు ఏముంటుంది ?

కమ్యూనిస్టులు, అభ్యదయవాదులుగా చెప్పుకునే కొందరు ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రైవేటు, కార్పొరేట్ రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయబోమని ఆ రంగంలోని ప్రముఖులు. అధినేతలు, యజమానులు తేల్చిచెప్పారు. ప్రతిభకే పట్టం కడతామని అన్నారు. 

అగ్రవర్ణాల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారు చాలామంది ఉన్నారు. ప్రభుత్వాలు వారిని పట్టించుకోవు. ఆ వర్గాలు ఓటు బ్యాంక్ కాదు కదా. మొత్తమ్మీద బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఏం చేస్తుందో తెలియదుగానీ కాంగ్రెస్ మైండ్ గేమ్ మాత్రం చాలా బలంగా ఉంది.

Show comments