డిజె తెచ్చిన తంటా అంట

పాపం, ఉరిమి ఉరిమి ఎక్కడో పడినట్లు అయింది బాలయ్య పైసా వసూల్ పరిస్థితి. ఓవర్ సీస్ లో పూరి-బాలయ్య కాంబినేషన్ కు మాంచి రేటు పలుకుతుందని అనుకున్నారు నిర్మాతలు. నిజానికి దర్శకుడు పూరిజగన్నాధ్ కు ఓవర్ సీస్ మార్కెట్ అంతగా లేదు. ఓవర్ సీస్ మార్కెట్ హీరోల మీద కన్నా, డైరక్టర్ల మీద ఎక్కువగా బేస్ అయివుంటుంది. అయినా కూడా నాలుగు కోట్లు రాకపోతుందా అని అనుకున్నారు పైసా వసూల్ నిర్మాతలు.

ఇదంతా డిజె సినిమా విడుదలకు ముందు పరిస్థితి. డిజె వచ్చింది. అక్కడి బయ్యర్లను కుదేల్ చేసింది. దాంతో కమర్షియల్ సినిమా అంటే ఓవర్ సీస్ బయ్యర్లు బాబోయ్ అని భయపడే పరిస్థితి తెచ్చింది. దాంతో పైసా వసూల్ నే కాదు, మరే కమర్షియల్, భారీ సినిమాలను కొనడానికి అక్కడి బయ్యర్లు వెనకడుకు వేసారు.

దీంతో పైసా వసూల్ రేటు పడిపోయింది. రెండు కోట్లకు ఆఫర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తాము రెండు కోట్లకు ఆఫర్ చేయలేదని, అవన్నీ గాలి వార్తలన్నది పైసా వసూల్ యూనిట్ వాదన. లేదూ ఆ రేంజ్ లోనే ఆఫర్ నడుస్తోందన్నది ఓవర్ సీస్ వర్గాల మాట.

మొత్తానికి మంగళవారం రాత్రి ఓవర్ సీస్ బేరం సెటిల్ అయిందని బోగట్టా. ఎంతకు సెటిల్ అయిందన్నది పైసా వసూల్ యూనిట్ అధికారికంగా చెప్పలేదు కానీ, కోటీ ఎనబై లక్షలకు సెటిల్ అయిందని కొన్న యుఎస్ఎల్ఓ యూనిట్ ప్రకటించేసింది. కనీసం రెండు కోట్లు అన్నా కావాలి అన్న పైసా వసూల్ యూనిట్ ఆశ నెరవేరలేదు. ఇదంతా డిజె తెచ్చిన తంటా అని నిట్టూరుస్తున్నారు.

Show comments