బొత్స చెబితే నవ్వుతారు... వాళ్ళు చెబితే?

ఏ రాజకీయ పార్టీకైనా తామే గెలుస్తామన్న నమ్మకం ఉంటుంది. అది ధీమా అవవచ్చు. మరోటి అయినా కావచ్చు ఎన్నికల్లో గెలుపు ఆశలు ఎవరికైనా ఉంటాయి. ఓడిపోతామని ఎవరూ చెప్పుకోరు కదా. ఆ మాటకు వస్తే ఇండిపెండెంట్ అయినా కూడా గెలుస్తాను అనే అంటాడు.

వైసీపీ 175కి 175 అని అంటోంది. వై నాట్ అన్నది రెండేళ్ళుగా ఆ పార్టీ నినాదంగా ఉంది. దానికి వారు లాజిక్ ని కూడా యాడ్ చేస్తున్నారు. అంత నంబర్ వచ్చిన తరువాత తాము మరింతగా సీట్లు రావాలని టార్గెట్ పెట్టుకుంటామని  మరో 24 సీట్లే మిగిలాయి కాబట్టి వాటిని కూడా గెలుస్తామని చెప్పుకుంటామని అంటున్నారు.

పోలింగ్ సరళిని చూస్తే తమకు ఏ సెక్షన్లు అయితే అనుకూలంగా ఉన్నాయో వారే ఎక్కువ సంఖ్యలో ఓటు చేశారు  కాబట్టి  తాము గెలుస్తామని లాజిక్ తో మాట్లాడుతున్నామని అంటున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ దీని మీద మాట్లాడుతూ 175 సీట్లూ గెలుస్తామని చెప్పారు.

దానిని టీడీపీ తమ్ముళ్ళు తప్పుపడుతున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు లాంటి వారు అయితే జనాలు బొత్స మాటలు విని నవ్వుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు. అదే నోటితో ఆయన మేము భారీ సీట్లతో గెలుస్తున్నామని చంద్రబాబు జూన్ 9న సీఎం గా ప్రమాణం చేస్తున్నారు అని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. జూన్ 9 డేట్ జగన్ ది కాదు చంద్రబాబుది అంటున్నారు. Readmore!

ఆయన అలా చెప్పడం వారి పార్టీ వరకూ ఓకే. మరి బొత్స చెబితే జనాలు నవ్వుతారు అంటున్న గంటా లాంటి వారు తాము గెలుస్తున్నామని 9వ తేదీని ముందే ప్రకటించి హడావుడి చేయడం మీద అదే జనాలు నవ్వుకోరా అని వైసీపీ నేతలు అంటున్నారు. జనాలు ఓటేసారు. తీర్పు చెప్పేసారు. ఎవరి జాతకం ఏమిటి అన్నది ఈవీఎంలలో ఉంది. అందువల్ల నవ్వు కనుక వస్తే ఈవీఎంలు నవ్వుకోవాలి తప్ప ఎవరూ కాదు, అసలు మ్యాటర్ అందులోనే ఉంది కాబట్టి ఈవీఎంలే పకపకా నవ్వాలి. అవి జూన్ 4న ఎటూ నవ్వుతాయి. అపుడు ఎవరు ఆనందిస్తారు  అన్నది తేలిపోతుంది అంటున్నారు.

Show comments