టార్గెట్ పెద్దిరెడ్డి!

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆయ‌న త‌న‌యుడు, రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డిని టీడీపీ టార్గెట్ చేసింది. మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ త‌ర్వాత‌, టీడీపీ ప్ర‌ధానంగా టార్గెట్ చేసుకుంది పెద్దిరెడ్డి కుటుంబాన్నే. వైసీపీ ప్ర‌భుత్వంలో పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆయ‌న త‌న‌యుడు మిధున్‌రెడ్డి కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఏదైనా జ‌గ‌న్‌తో పాటు వీరికి తెలియాల్సిందే అన్న‌ట్టు పాల‌న సాగింది.

ముఖ్యంగా కుప్పంలో చంద్ర‌బాబునాయుడిని రాజ‌కీయంగా ఇబ్బంది పెట్టేందుకు పెద్దిరెడ్డి కుటుంబం తీవ్రంగా ప్ర‌య‌త్నించింది. జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు న‌డుచుకున్న‌ప్ప‌టికీ, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం చెప్పింది వేద‌వాక్కు అన్న‌ట్టుగా సాగింది. ఇప్ప‌టికే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కుమారుడిని మ‌ద్యం స్కామ్‌లో ఇరికించేందుకు టీడీపీ అన్ని ర‌కాలుగా ఫైల్‌ను క‌దుపుతోంది.

తాజాగా పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిపై జ‌ల‌వ‌న‌రుల‌శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. అవులుప‌ల్లి ప్రాజెక్టులో పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి పాపాలు అన్నీఇన్నీ కావ‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ ప్రాజెక్టులో పెద్దిరెడ్డి రూ.600 కోట్ల అవినీతికి పాల్ప‌డ్డార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. ఎన్జీటీ నిబంధ‌న‌లకు విరుద్ధంగా ప్రాజెక్టును నిర్మించార‌ని ఆయ‌న అన్నారు. ఆవులుప‌ల్లితో పాటు ఇత‌ర సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి జ‌రిగిందా? అనే కోణంలో విచారిస్తున్న‌ట్టు ఆయ‌న చెప్పుకొచ్చారు.

సాగునీటి ప్రాజెక్టులో పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అవినీతికి పాల్ప‌డ్డార‌ని ఆరోపించిన నేప‌థ్యంలో... సాధ్య‌మైన‌న్ని ఎక్కువ కేసులు తండ్రీత‌న‌యుల‌పై పెట్టాల‌నే ఆలోచ‌న‌లో టీడీపీ ఉంద‌ని అర్థం చేసుకోవ‌చ్చు. ఇవాళ పుంగ‌నూరుకు పెద్దిరెడ్డిని వెళ్ల‌కుండా అడ్డుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వం ఆరంభం నుంచే క‌క్ష తీర్చుకోడానికి అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు... రాజ‌కీయ వాతావ‌ర‌ణం తెలియ‌జేస్తోంది.  Readmore!

Show comments