డెడ్‌లైన్ కాస్త దాటినా.. పూర్తయితే అదే చాలు!

ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని కావాలన్నదే తెలుగు ప్రజల కోరిక అని ఈ ఎన్నికల్లో స్పష్టం అయింది. విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని ద్వారా యావత్ ఉత్తరాంధ్రకు కనీవినీ ఎరుగని అభివృద్ధి అందుతుందని జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు అక్కడి ప్రజలను ప్రభావితం చేయలేకపోయాయి.

మూడు రాజధానుల కాన్సెప్టు విఫలప్రయోగంగా తేలింది. అమరావతి రాజధానికే జై కొడుతున్నట్టుగా ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని, కూటమిని గెలిపించారు. చంద్రబాబునాయుడు అమరావతి విషయంలో వేగంగా పనులు పూర్తికావడం పట్ల తనకున్న శ్రద్ధను చాటిచెప్పేలా గతంలో ఆ శాఖకు మంత్రిగా ఉన్న పొంగూరు నారాయణ కే మళ్లీ ఆ బాధ్యతలు అప్పగించారు.

ఇప్పుడు మంత్రి నారాయణ కేవలం రెండున్నరేళ్లలో అమరావతి రాజధాని నగర నిర్మాణం పూర్తిచేస్తాం అని ప్రతిజ్ఞ చేస్తున్నారు. ప్రజలు అమరావతి రాజధానిని కోరుకుంటున్నారు. ఈ విషయంలో అతిశయాలకు పోకుండా.. ప్రాక్టికల్ గా మంత్రి నారాయణ ప్రకటనలు చేస్తే బాగుంటుందని పార్టీ వర్గాలే అంటున్నాయి.

చంద్రబాబు సర్కారు గతంలో ఏలుబడి సాగించిన రోజుల్లో తయారుచేసిన డిజైన్ల ప్రకారం నగర నిర్మాణం అనేది రెండున్నరేళ్లలో పూర్తయ్యే వ్యవహారం కాదు. అందులో పది శాతం కూడా పూర్తవుతుందో లేదో కష్టం. నిజానికి నారాయణను రెండున్నరేళ్లలో పూర్తిచేసేయాలని ప్రజలు డిమాండ్ చేయడం లేదు. కానీ.. రాజధాని స్వప్నాన్ని పూర్తిచేసే దిశగా వడివడిగా అడుగులు పడాలని మాత్రమే కోరుకుంటున్నారు. Readmore!

పోలవరం విషయంలో చంద్రబాబు సర్కారు గతంలో ఇలాగా మభ్యపెట్టింది. ఇదిగో పూర్తవుతోంది.. అదిగో పూర్తవుతోంది.. అంటూ సుదీర్ఘకాలం మాయమాటలు చెప్పింది. తీరా.. ఏమీ చేయకుండానే గద్దె దిగిపోయింది. అమరావతి విషయంలో ఈసారి కూడా అలా జరిగితే ప్రజలు ఆ పార్టీని ఎప్పటికీ క్షమించరు. మళ్లీ వారికి ఆదరణ దక్కాలంటే రాజధాని ఒక కొలిక్కి రావాలి.

రెండున్నరేళ్లు అని డెడ్ లైన్ లు ప్రకటించడం అనవసరం. కానీ.. చురుగ్గా పనులు జరుగుతూ ఉంటే చాలు.. ప్రజలు వారిని అర్థం చేసుకుంటారు.. కానీ.. నారాయణ ఇలా చిటికెలో పూర్తిచేస్తాం అనడం వల్ల తామే ఇబ్బందులో పడ్తాం అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Show comments