నామినేటెడ్: చంద్రబాబులో మార్పు తెలిసేది అక్కడే!

చంద్రబాబు మాటల్లో చెప్పాలంటే.. ‘పార్టీ నేతలు, కార్యకర్తలు సాధికారత సాధిస్తేనే పార్టీ పునాదులు బలంగా ఉంటాయి’! ఈ మాట నిజమే. కానీ వారు సాధికారత సాధించే మార్గాలు ఏమిటి? ఎన్నికల్లో గెలిచే నాయకులు కొందరే ఉంటారు.. మిగిలిన వారంతా సాధికారత సాధించాలంటే.. వారికి ఉన్న ఏకైక మార్గం నామినేటెడ్ పోస్టులను పంచిపెట్టడమే. చంద్రబాబునాయుడు కూడా.. సీఎంగా పదవి స్వీకరించిన తర్వాత.. పార్టీ కార్యాలయానికి వచ్చిన తొలి సందర్భంలోనే నామినేటెడ్ పోస్టుల ప్రస్తావన తెచ్చారు. త్వరలోనే ఈ పోస్టుల భర్తీ ఉంటుందని సెలవిచ్చారు.

నిజానికి నామినేటెడ్ పోస్టులు పంచిపెట్టే విషయంలో చంద్రబాబునాయుడు మీనమేషాలు లెక్కిస్తూ ఉంటారనే అపప్రధ ఉంది. పదవులను ఎవరికి కట్టబెట్టాలనే విషయాన్ని ఆయన ఒక పట్టాన తేల్చరు. బాబులోని ఈ అలసత్వం, సత్వర నిర్ణయాలు లేకపోవడం కారణంగా.. పార్టీ అయిదేళ్లు అధికారంలో ఉంటే.. నామినేటెడ్ పోస్టులను మూడేళ్లకు మించి ఎవ్వరూ అనుభవించకుండాపోయిన ఉదంతాలున్నాయి.

జగన్ మోహన్ రెడ్డి తీరు వేరు. ఆయన ఇలా అధికారంలోకి రాగానే.. అలా టీడీని తన బాబాయి చేతిలో పెట్టేశారు. దాంతో రెండుసార్లు పూర్తిగా వైవీసుబ్బారెడ్డి, ఒకసారి ఏడాది పాటు భూమన కరుణాకరరెడ్డి ఆ పదవులు అనుభవించారు. చంద్రబాబునాయుడు కూడా ఆ విధంగా నామినేటెడ్ పోస్టులను సత్వరం పంచిపెట్టాలని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.

నిజం చెప్పాలంటే.. పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉన్నప్పుడు.. ఏ ఐఏఎస్ లను నియమించుకోవాలి, ఏ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టాలి.. అని ముందే ఆలోచించి పెట్టుకున్నట్టే.. నామినేటెడ్ పోస్టులు కూడా ముందే ఆలోచించిపెట్టుకోవాలని అంటున్నారు. Readmore!

మామూలుగా ప్రతిసారీ ఎంతో ఆలస్యం చేస్తూ ఉండే చంద్రబాబు.. కనీసం ఈసారి రోజుల వ్యవధిలో నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తిచేస్తేనే ఆయన మారిపోయిన చంద్రబాబు అని నమ్మడానికి వీలుంటుందని కూడా కార్యకర్తలు అంటున్నారు.

Show comments