విశాఖ తొలి ఫలితం ఆ దిక్కు నుంచే?

విశాఖ సిటీలో నాలుగు దిక్కులా అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ నాలుగూ 2014, 2019లలో టీడీపీనే గెలిపించాయి. 2009లో మాత్రం విశాఖ తూర్పు మాత్రమే టీడీపీ పరం అయింది. 2024లో విశాఖ సిటీలో రాజకీయం ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తిని పెంచుతోంది.

సాధారణంగా కౌంటింగ్ స్టార్ట్ అయిన తరువాత ట్రెండ్స్ మాత్రమే బయటకు వస్తాయి. మధ్యాహ్నం నాటికి ఫలితాల మీద క్లారిటీ వస్తుంది. విశాఖలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో తొలి ఫలితం ఎక్కడ నుంచి వస్తుంది అన్నది చూస్తే కనుక విశాఖ దక్షిణం అని అంటున్నారు. ఇది మొత్తం సిటీలో తక్కువ ఓటర్లు ఉన్న సీటు. ఈసారి ఎన్నికల్లో రెండు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్లలో రెండున్నర లక్షలకు పై దాటారు.

దీంతో మొదటి ఫలితం విశాఖ సౌత్ నుంచే అని అంటున్నారు. అలా బోణీ కొట్టబోయే పార్టీ ఏది అన్నది కూడా అంతా తర్కించుకుంటున్నారు. విశాఖ సౌత్ లో పోరు ఒక స్థాయిలోనే సాగింది. టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్లుగా సాగిన ఈ పోరులో వైసీపీకి కొంత మొగ్గు ఉన్నట్లుగా పోలింగ్ అనంతరం అంచనాలు ఆ పార్టీ వారు వేసుకుంటున్నారు.

రెండు సార్లు ఇక్కడ నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ హ్యాట్రిక్ విజయం కోసం తపన పడుతున్నారు. ఆయన ఈసారి గ్యారంటీగా గెలుస్తాను అని అంటున్నారు. దాంతో తొలి ఫలితం ఫ్యాన్ పార్టీకి అనుకూలం అవుతుందని ఆ జోరుతో విశాఖ సిటీలో మిగిలిన చోట్లా జయభేరీ మోగిస్తామని చెబుతున్నారు. 2004,2009లో విశాఖ సౌత్ ఫలితం అనుకూలంగా రావడంతో విశాఖ సిటీలో కాంగ్రెస్ మిగిలిన సీట్లు గెలుచుకుందని గుర్తు చేస్తున్నారు. ఇది సెంటిమెంట్ అని అంటున్నారు. Readmore!

టీడీపీ కూటమి సైతం దక్షిణం మీద ధీమా పడుతోంది. మేము కూడా దక్షిణం నుంచే విజయయాత్ర మొదలుపెడతామని అంటోంది. అలా రెండు పార్టీలకు దక్షిణం సెంటిమెంట్ గా మారింది. ఈ సెంటిమెంట్ ఏ పార్టీని అందలం ఎక్కిస్తుందో చూడాలి.

Show comments