చెప్పేవాడు చంద్ర‌బాబు మ‌రి!

చంద్ర‌బాబు చెబితే విన‌సొంపుగా వుంటుంది. ఆయ‌న చెప్పేవ‌న్నీ నీతి సూక్తులే. ఎల్లో మీడియాలో అవే బ్యాన‌ర్ హెడ్డింగ్‌లు. రానున్న ఐదేళ్ల‌లో చంద్ర‌బాబు పాల‌న ఎంత గొప్ప‌గా సాగుతున్న‌దో అనే ఫీలింగ్‌ను క్రియేట్ చేయ‌డానికి నిత్యం నీతి సూత్రాల్ని వ‌ల్లె వేస్తూ క‌థ‌నాలు ఉండ‌నున్నాయి. అయితే వాస్త‌వాలేంటో ప్ర‌జ‌లు గ్ర‌హించ‌లేని అమాయ‌కంగా లేరు. బాబు సూక్తుల మ‌ర్మం, అలాగే ప్ర‌జ‌ల చైత‌న్యం గురించి... అంద‌రికీ అన్నీ తెలుసు. కానీ మ‌న అనుకూల పాల‌కులు ఏం మాట్లాడినా, చేసినా జ‌నం కోస‌మే అని న‌మ్మించ‌డ‌మే ప‌ర‌మావ‌ధి అన్న‌ట్టుగా క‌థ‌నాలుంటాయి.

తాజాగా చంద్ర‌బాబు త‌న పార్టీ నాయ‌కులు, బూత్‌లెవెల్ కార్య‌క‌ర్త‌ల‌తో నిర్వ‌హించిన టెలీకాన్ఫ‌రెన్స్‌లో అన్న మాట‌లు మీడియాలో బ్యాన‌ర్ అయ్యాయి.

"అధికారం వ‌చ్చింద‌ని క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డొద్దు. విర‌వీగ‌డం లాంటి చ‌ర్య‌లొద్దు. ప్ర‌జ‌లు త‌ప్పు ప‌ట్టేలా ఎలాంటి ప‌నులు చేయొద్దు"

ఇవ‌న్నీ చేయ‌డానికి ఎవ‌రికి అవ‌కాశం వుంటుంది?  క‌క్ష సాధింపుల‌కు చోటు లేద‌నే సంకేతాల్ని ఎవ‌రు పంపాలి?  సామాన్య టీడీపీ కార్య‌క‌ర్త‌లో, నాయ‌కులో కాదు క‌దా!  సీఎంగా చంద్ర‌బాబు బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత‌, కొంత మంది అధికారుల విష‌యంలో వ్య‌వ‌హ‌రించిన తీరుపై ఇదే ఎల్లో మీడియాలో ఎలాంటి క‌థ‌నాలు వ‌చ్చాయో చూశాం. Readmore!

అధికారంలోకి వ‌చ్చామ‌న్న అత్యుత్సాహంతో ఇప్ప‌టికే టీడీపీ క్షేత్ర‌స్థాయిలో చేయ‌కూడ‌ని త‌ప్పుల‌న్నీ చేస్తోంద‌న్న వ్య‌తిరేక అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇందుకు టీడీపీ పెద్ద‌ల వ్య‌వ‌హార శైలి కూడా కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. య‌థా రాజా... త‌థా ప్ర‌జ అన్న రీతిలో రాష్ట్ర స్థాయిలో అధికార పార్టీ నాయ‌కుల న‌డ‌వ‌డిక‌ను అనుస‌రించి, కిందిస్థాయిలో కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తార‌నేది వాస్త‌వం.

అధికారంలో ఎవ‌రున్నా, తాము త‌ప్పు చేస్తున్నామ‌న్న భావ‌న ఏ మాత్రం వుండ‌దు. అందుకే ఐదేళ్లు తిరిగే స‌రికి, అటూఇటూ అధికారం మారుతూ వుంటుంది. ఎల్లో మీడియాలో బ్యాన‌ర్ హెడ్డింగ్‌లు కోసం కాకుండా, అరాచ‌కాల‌ను అరిక‌ట్టేలా పాల‌న సాగించాల్సిన అవ‌స‌రం వుంది. అప‌రిమిత‌మైన అధికారం ప్ర‌త్య‌ర్థుల‌పై ప‌గ‌, ప్ర‌తీకారం తీర్చుకోడానికి కాద‌ని గ్ర‌హిస్తే చాలు... ఎన్ని మంచి ప‌నులైనా చేయొచ్చు.

కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌, క్షేత్ర‌స్థాయిలో ఏం జ‌రుగుతున్న‌దో ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబునాయుడు నిజాయితీగా నిజాలు తెలుసుకుంటే మంచిది. క‌క్ష సాధింపుల‌కు పాల్ప‌డొద్దు, విర‌వీగొద్దు అని పిలుపు ఇవ్వ‌డం మంచిదే. అయితే ఆచ‌ర‌ణ ముఖ్యం అని ప్ర‌జ‌లు అంటున్నారు.

Show comments