ప్యూర్ వెజ్.. పక్కా మోసం

శాకాహారులు రెస్టారెంట్ కు వెళ్లి ప్యూర్ వెజ్ అడుగుతుంటారు. ఇక శనివారం వచ్చిందంటే చాలామంది మాంసాహారులు కూడా శాకాహారులుగా మారిపోతుంటారు. ఇలాంటి వాళ్లంతా రెస్టారెంట్లకు వెళ్లి ముందుగా అడిగేది వెజ్ గురించే.

ఇలాంటి వాళ్లంతా తాము శాకాహారం తింటున్నామనే భ్రమలో ఉంటారు. కానీ కిచెన్ లోపల వ్యవహారం మాత్రం మరో విధంగా ఉంటుంది. 'ప్యూర్ వెజ్' అనే పదం పైకి చెప్పుకోడానికి మాత్రమే. ఈరోజు ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు ఓ రెస్టారెంట్ పై జరిపిన దాడుల్లో కిచెన్ చూసి ఆశ్చర్యపోయారు. కిచెన్ లో ఓ ప్లాస్టిక్ బుట్ట నిండా చేప ముక్కలున్నాయి. వాటిపై పన్నీరు ముక్కలు పెట్టారు. 'ప్యూర్ వెజ్' ఆర్డర్ చేసినోళ్లకు ఈ పన్నీరు ముక్కలే వడ్డిస్తున్నారు.

హైదరాబాద్ లో గడిచిన కొన్ని రోజులుగా ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు పలు రెస్టారెంట్లపై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముక్కున వేలేసుకునే వాస్తవాలు బయటపడుతున్నాయి. పైన చెప్పుకున్న ఉదంతం అలాంటిదే.

ఈరోజు ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. హోటల్ సాయిబృందావన్, మాస్టర్ చెఫ్ రెస్టారెంట్స్ లో దాడులు నిర్వహించారు. ఇక సోమాజిగూడలోని కృతుంగ - ది పాలెగార్స్ క్యూజిన్ లో నిబంధనల ఉల్లంఘనను గుర్తించారు. చాలా పదార్థాలపై సరైన లేబుల్స్ ఎక్స్-పైరీ డేట్ లేకపోవడంతో ఆ ఆహార పదార్థాల్ని స్పాట్ లో పారబోశారు అధికారులు. Readmore!

ఇక ఏరియాలో రెస్ట్-ఓ-బార్, కేఎఫ్సీ రెస్టారెంట్లపై కూడా దాడులు నిర్వహించారు. ఇక్కడ కూడా అదే నిర్లక్ష్యం. గడువు తీరిన పదార్థాలు ఉపయోగించడం, అపరిశుభ్రత. కాస్త పేరున్న రెస్టారెంట్లలోనే పరిస్థితి ఇలా ఉందంటే, సామాన్య హోటళ్లలో ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు.

Show comments