ప్ర‌భాక‌ర్‌చౌద‌రికి ప‌రిటాల ఫ్యామిలీ చెక్‌!

అనంత‌పురంలో త‌మ ఆధిప‌త్యం కోసం మాజీ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రికి ప‌రిటాల ఫ్యామిటీ చెక్ పెట్టింద‌నే చ‌ర్చ ఆ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. అనంత‌పురం జిల్లాలో టీడీపీ నాయ‌కులంతా త‌మ అదుపాజ్ఞ‌ల్లో ఉండాల‌ని ప‌రిటాల కుటుంబం మొద‌టి నుంచి కోరుకుంటోంది. త‌మ‌ను కాద‌ని స్వ‌తంత్రంగా ఎవ‌రైనా వ్య‌వ‌హ‌రిస్తే, వారికి చెక్ పెట్టే వ‌ర‌కూ ప‌రిటాల కుటుంబం నిద్ర‌పోద‌నే పేరు వుంది.

ఈ నేప‌థ్యంలో ధ‌ర్మ‌వ‌రంలో వ‌ర‌దాపురం సూరితో తీవ్రంగా, అనంత‌పురంలో మాజీ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రితో పైకి క‌నిపించ‌ని విభేదాలు ప‌రిటాల కుటుంబానికి వున్నాయి. ప‌రిటాల ఎఫెక్ట్ ఎలా వుంటుందో ధ‌ర్మ‌వ‌రం, అనంత‌పురం అభ్య‌ర్థుల‌ను చూస్తేనే తెలిసిపోతుంది. ధ‌ర్మ‌వ‌రం టికెట్‌ను ప‌రిటాల శ్రీ‌రామ్ ఆశించారు. వ‌ర‌దాపురం సూరి టీడీపీని వీడి బీజేపీలో చేరిన‌ప్ప‌టి నుంచి ప‌రిటాల శ్రీ‌రామ్ అన్నీ తాను చూస్తున్నారు.

టీడీపీ టికెట్ కోరుకోవ‌డంలో త‌ప్పులేదు. రాప్తాడు సీటును ప‌రిటాల సునీత‌కు కేటాయించారు. అయితే పొత్తులో భాగంగా సీటు త‌న‌కు వ‌స్తుంద‌ని వ‌ర‌దాపురం సూరి న‌మ్మ‌కంగా ఉన్నారు. ఆయ‌న ఆశ‌ల‌న్నీ గ‌ల్లంత‌య్యాయి. ధ‌ర్మ‌వ‌రం తెర‌పైకి బీజేపీ జాతీయ నేత స‌త్య‌కుమార్ రావ‌డం వెనుక‌, ప‌రిటాల ఫ్యామిలీ వుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

తాజాగా టీడీపీ నాలుగో జాబితాలో అనంత‌పురం అభ్య‌ర్థిగా అనూహ్యంగా ద‌గ్గుపాటి వెంక‌టేశ్వ‌ర‌ప్ర‌సాద్ తెర‌పైకి వ‌చ్చారు. దీంతో మాజీ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రి ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. ప్ర‌భాక‌ర్ చౌద‌రి అనుచ‌రులు విధ్వంసానికి దిగారు. ప్ర‌భాక‌ర్ చౌద‌రికి చెక్ పెట్ట‌డం వెనుక ప‌రిటాల ఫ్యామిలీ వుంద‌ని ప్ర‌భాక‌ర్ చౌద‌రి అనుచ‌రులు అనుమానిస్తున్నారు. అందుకే త‌మ‌కు న‌మ్మ‌క‌స్తుడైన రాప్తాడు మాజీ ఎంపీపీ దగ్గుపాటిని తీసుకొచ్చార‌ని ప్ర‌భాక‌ర్ చౌద‌రి అనుచ‌రులు ఆరోపిస్తున్నారు.

రాప్తాడు మండ‌లంలోని ఎం.బండ‌మీద‌ప‌ల్లి ద‌గ్గుపాటి స్వ‌స్థ‌లం. ఇవాళ 10 గంట‌ల‌కు ప్ర‌భాక‌ర్ చౌద‌రి మీడియాతో అన్ని విష‌యాలు చెబుతాన‌న్నారు. ఆయ‌న ఏం మాట్లాడ్తారో అనే ఉత్కంఠ నెల‌కుంది.

Show comments