ఎమ్బీయస్‍: ఆస్కార్ వేదికపై తెలుగు

‘నాటునాటు’ పాట ధర్మమాని ఆస్కార్ వేదికపై తెలుగు శబ్దం వినబడి, చాలా ఆనందం కలిగింది. నా జీవితకాలంలో యిది జరుగుతుందని అనుకోలేదు. ఇండియన్ మూలాలున్న అమెరికన్ సైంటిస్టులు నోబెల్ బహుమతి తెచ్చుకున్నపుడు కాస్త సంతోషించినా, అమెరికా శంఖులో పోస్తే తప్ప తీర్థం కాలేదు కదా, యిక్కడే ఉండి వుంటే గుంపులో గోవిందాగా ఉండేవారేమో అనిపించి మనసు చివుక్కుమంటుంది. భాను అతైయా, రెహమాన్, రసూల్ వంటి వారు తెచ్చుకున్నపుడు నిజమైన సంతోషం కలిగింది. కానీ అప్పుడు కూడా విదేశీయుల సినిమా ద్వారా వచ్చింది అనే స్పృహ కాస్త యిబ్బంది పెట్టింది. నాటునాటు విషయంలో అలాటి శషభిషలు ఏమీ లేవు. ఇది తెలుగు సినిమా, తెలుగు పాట, తెలుగువాళ్లు తీసి, అక్కడిదాకా వెళ్లి జండా ఎగరేశారు. వేదికపై కూడా యిది తెలుగు పాట అని రొక్కించి చెప్పారు. ప్రపంచంలో వేలాది భాషలున్నాయి. ఇలాటి ప్రఖ్యాత వేదికపై మన భాషను ప్రస్తావించారు కదా. తెలుగు కుర్రవాళ్లు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ గొంతెత్తి తెలుగు పాటను పాడగా కొందరు విదేశీ డాన్సర్లు మన తెలుగు పాటకు నర్తించారు కదా! ఇంతకన్న ఆనందమేముందిరా!

ఇండియా అన్నా యింత పులకింత రావాలి కదా, తెలుగు అన్నారని ప్రత్యేకంగా మురిసిపోవడం దేనికని మీరు అడగవచ్చు. నాకు భాషోన్మాదం లేదు. ప్రపంచభాషల్లో కల్లా తెలుగే గొప్పది లాటి స్టేటుమెంట్లు యివ్వను, నాకు యితర భాషల గురించి పెద్దగా తెలియదు కాబట్టి! సినిమా విషయంలో తెలుగు ఐడెంటిటీ మీద మాత్రం సెన్సిటివ్. ఎందుకంటే ఇండియన్ సినిమాపై పుస్తకం అనగానే 80శాతం హిందీ సినిమాల గురించే రాస్తారు. బెంగాలీ సినిమాల గురించి ఒక చాప్టర్ ఉంటుంది. పారలల్ సినిమాల గురించి ఒక చాప్టర్‌ ఉంటుంది. గతంలో అయితే దక్షిణాది సినిమాలన్నిటినీ ఒకే చాప్టర్‌లో చుట్టబెట్టేసేవారు. తర్వాతి రోజుల్లో మలయాళం, కన్నడ ఆర్ట్ సినిమాలకు ఎవార్డులు రావడంతో వాటి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి, తెలుగు, తమిళం గురించి స్పృశించి వదిలేసేవారు. బాలచందర్ వచ్చాక తమిళ సినిమాలపై ఫోకస్ పడింది.

ఇక తక్కిన భాషలకు వస్తే పంజాబీ, గుజరాతీ, ఒడియా, భోజపురి సినిమాల గురించి రెండు మూడు లైన్లలో సరిపెట్టేస్తారు. మరాఠీ కొస్తే పాత మరాఠీ సినిమాల గురించి చెప్తారు తప్ప కొత్త వాటి గురించి మాట్లాడరు. ఇటీవలి కాలంలో కొద్దికొద్దిగా మార్పు వస్తున్నా యిప్పటికీ హిందీ సినిమా వాళ్లకు అహంకారం బాగా ఉంది. తమిళవాళ్లు తాము యావత్తు సౌతిండియాకు ప్రతినిథులుగా చూపుకున్నట్లు, హిందీ రంగం తాము మొత్తం భారతదేశానికి ప్రతినిథులుగా చెప్పుకుంటారు. ఇటీవల దక్షిణాది నుంచి పాన్ ఇండియా సినిమాలు వస్తూంటే పళ్లు నూరుకోవడాలు చూస్తున్నాం. నేను హిందీ లేదా తెలుగు సినిమాలు గొప్పవి లేదా చెత్తవి అనటం లేదు. హిందీ సినిమాలతో బాటు యితర భాషాచిత్రాల అస్తిత్వాన్ని గుర్తించాలని అంటున్నాను. బాగుండడం, బాగోలేక పోవడం దేనిలోనైనా ఉంటుంది. హిందీ వాళ్ల మార్కెట్ పెద్దది కాబట్టి వాళ్లకు వచ్చే పేరు మనకు రాదు. అలాటి పరిస్థితుల్లో ఇండియా నుంచి తెలుగు పాట ఒకటి వచ్చి ఆస్కార్ మీద అభినయించబడింది అంటే తప్పకుండా గర్వించదగిన విషయమే.

అయితే యిది అంత సులభంగా జరగలేదు. హాలీవుడ్ వాళ్లు సెర్చిలైట్లు వేసుకుని బయలుదేరి మన మట్టిలో మాణిక్యాన్ని వెలికి తీయలేదు. మనమే వెళ్లి మేం మాణిక్యం, మమ్మల్ని నాలుగు వైపుల నుంచి, అన్ని కోణాల నుంచి పరిశీలించి ఒప్పుకోండి అని చెప్పుకోవలసి వచ్చింది. ఈ లాబీయింగును, మార్కెటింగును కొందరు తప్పు పడుతున్నారు. మొదట్లో 50 కోట్లు ఖర్చు పెట్టారట అన్నారు, యిప్పుడు 80 అంటున్నారు. ఏం ఖర్చు పెట్టినా రాజమౌళియో, ఆయన యిన్వెస్టర్లో పెట్టారు తప్ప ప్రజాధనం దోచి పెట్టలేదు. వాళ్ల డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో మనమెవరం చెప్పడానికి? దానివలన మీకూ, నాకూ నష్టమేమైనా వచ్చిందా? అంత బాగా రాని యీ సినిమాకు కాకుండా మరో మంచి సినిమాకు లాబీయింగు చేయాల్సింది అని మీరూ, నేనూ అనుకోవచ్చు. కానీ ఆ సినిమాలు తీసినప్పుడు యీ అవకాశం వచ్చి ఉండకపోవచ్చు. ఇప్పుడు వదులుకుంటే మళ్లీ రాదనే భయం ఉండవచ్చు. మార్కెటింగ్ అనేది తప్పేమీ కాదు. ఎంతమంచి వస్తువుకైనా పబ్లిసిటీ ఉండాల్సిందే. డైమండ్‌ను జ్యూయెలరీ షాపులో అద్దాల బీరువాలో చూస్తేనే డైమండ్ అనుకుంటాం. ఇంట్లో గూట్లో కనబడితే, ఏదో మెరిసే రాయి, పిల్లలకి ఆటస్థలంలో దొరికితే పట్టుకుని వచ్చి పడేశారనుకుంటాం.

ప్రఖ్యాత తెలుగు హీరోలతో, సక్సెసులున్న డైరెక్టరుతో సినిమా తీసి తెలుగు ప్రాంతంలో రిలీజు చేస్తూ కూడా పబ్లిసిటీపై కోట్లు ఖర్చు పెట్టటం లేదా? తెలుగంటే ఏమిటో తెలియని ప్రాంతంలో, తెలియని మనుషుల దృష్టిని ఆకర్షించాలంటే ఖర్చవదా? ఏ దేశంలో ఏ భాషలో ఏ సినిమా తయారైంది, దాని క్వాలిటీ ఏమిటి అని కాగడాలు వేసుకుని వెతకడమే వాళ్ల పనా? తెలుగువాడినై యుండి, తెలుగుగడ్డపై ఉంటూ యిక్కడ రిలీజయ్యే సినిమాల్లో పదో వంతు కూడా చూడటం లేదే! థియేటర్లలో, టీవీ ఛానెళ్లలో, ఓటిటిలో అవి నన్ను వెంటాడినా పట్టించుకోవటం లేదే! మరి వాళ్లు సబ్‌టైటిల్స్ చదివే కష్టాన్ని ఓర్చుకుంటూ వేలాదిగా విడుదలయ్యే విదేశీ సినిమాల్లో ఎన్ని చూడగలుగుతారు? మనం కూడా చూడండి, ఓటిటిలో ఫలానా సినిమా బాగుందని ఎవరైనా తెలిసున్నవాళ్లు చెపితే చూస్తాం. మా సినిమా ఒకటి చూసి అఘోరించావు కాబట్టి యీ పదీ కూడా చూడమని ఆ ప్లాట్‌ఫాం వాళ్లు తోమారని చూడం కదా!

తెలియనివాళ్లకు మన ప్రోడక్టుని పరిచయం చేయడానికి వాళ్లను పిలిచి, అన్నపానాదులు యివ్వడం తప్పదు. పెళ్లిచూపులకు వచ్చినవాళ్లకి కాఫీ, టిఫెన్లు యివ్వమా? ఊరవతలి స్థలాలు అమ్మేవాడు రవాణా సౌకర్యం, భోజన సదుపాయం ఏర్పాటు చేయడా? ఎన్ని పెడతామన్నా వీటి కోసం అవతలివాడు దేబిరిస్తూ రాడు కదా, వాణ్ని మొహమాట పెట్టేవాడు మనకు దొరకాలి. దొరికించుకోవాలంటే ముత్యాలముగ్గు కాంట్రాక్టరు చెప్పినట్లు ‘కరుసవుద్ది’. అన్నీ ఫలించి రేపుమర్నాడు హాలీవుడ్ వాళ్లు ఇండియన్ ఫిల్మ్‌మేకర్లతో కొలాబరేషన్ పెట్టుకుంటే దేశానికి ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ మూలంగా ఎంతో లాభం ఒనగూడుతుంది. అయినా ప్రభుత్వం యీ లయజనింగ్ ఖర్చు భరించదు. ప్రయివేటు వ్యక్తులే భరించాలి. నిజానికి అలాటి కొలాబరేషన్ ఆఫర్ వస్తే దాన్ని ఎగరేసుకుని పోవడానికి బాంబే సినీరంగం వాళ్లు సిద్ధంగా ఉంటారు. వాళ్ల ఫిగర్స్‌తో పోలిస్తే మనం తేలిపోతాం కదా!

ఇవన్నీ తెలిసి కూడా రాజమౌళి, అతన వెనక ఉన్నవాళ్లు కోట్లకు కోట్లు ఖర్చు పెట్టారంటే మెచ్చుకోవలసినదే. ‘‘సెల్ఫీ’’ లాటి డిజాస్టర్‌ సినిమా హీరో అక్షయ కుమార్‌కు 80 (?) కోట్లు యివ్వడానికి వెనుకాడని బాంబే నిర్మాతలు యీ లాబీయింగు ఖర్చులో కొంత భరిస్తే బాగుండేది. మన దగ్గర డబ్బుండగానే సరిపోదు, సరైన వ్యక్తులను పట్టుకోవాలి కూడా. లంచం యిచ్చి ఉద్యోగాలు, కాంట్రాక్టులు తెచ్చుకోవడానికి సిద్ధపడే వారు చాలామందే ఉంటారు. కానీ ఎవర్ని, ఎలా ఎప్రోచ్ కావాలో తెలిసినవాళ్లు తక్కువమంది ఉంటారు. సరైన వాళ్లని ఐడెంటిఫై చేసి, కార్యం సాధించుకుని వచ్చినందుకు కూడా రాజమౌళిని అభినందించాలి. ‘‘శంకరాభరణం’’ వంటి కళాత్మక సినిమా తీశాను కదా అని నిర్మాత చేతులు ముడుచుకుని కూర్చోలేదు. వందలాది ప్రివ్యూలు వేసి డిస్ట్రిబ్యూటర్లను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేశారు. అందుకే ఆ సినిమా మన వరకు చేరింది.

మనం అద్భుతమైన కావ్యమొకటి రాసి యింట్లో కూర్చుంటే దాని సంగతి పదిమందికీ తెలుస్తుందా? రాజాస్థానానికి వెళ్లి వినిపించాలి. నేను వెళ్లను అనడానికి పోతన గారికి చెల్లింది, కానీ ఊళ్లో కొంతమందికైనా పిలిచి వినిపించి ఉంటాడు. లేకపోతే జనసామాన్యం నోళ్లల్లో ఆ పద్యాలు ఎలా నానతాయి? త్యాగయ్య కూడా రాజుల దగ్గరకు వెళ్లలేదు కానీ ఆయనకి శిష్యబృందం ఉంది. వాళ్లు ప్రచారం చేస్తూ యిది త్యాగయ్య గారి కీర్తన అని చెప్పారు పాపం. ఈ రోజుల్లో శిష్యుల్ని నమ్ముకుని యింట్లో కూర్చుంటే లాభం లేదు. రాజమౌళి తను వెళ్లకుండా వేరే వారిని పంపిస్తే, యీ సినిమా స్టోరీ అసలు నాదేనండి, దాన్ని పక్కన పడేయండి, నా దగ్గర అద్భుతమైన స్టోరీ లైన్ ఉంది, కలిసి వర్కవుట్ చేద్దాం అంటూ తనను తాను మార్కెట్ చేసుకుంటాడు. అందుకని రాజమౌళే స్వయంగా కదిలి వెళ్లి నెలల తరబడి క్యాంపు వేశారు. ఈ 80 కోట్లలో ఆయన సమయం విలువ కూడా కలిపారో లేదో!

మన తెలుగువాళ్లకు ఓ జబ్బుంది. ఎవరినైనా మెచ్చుకోవాలంటే ఆయనకు రావలసినంత పేరు రాలేదు. గుర్తింపు లేదు. తెలుగువాడిగా పుట్టడం దురదృష్టం అని స్టేటుమెంట్లు గుప్పిస్తారు. బాపు-రమణలకు పద్మ ఎవార్డులు రాలేదని అందరూ వాపోతున్న రోజుల్లో నేను ‘పద్మశ్రీలు ఎందుకు రావాలండి?’ అనే ఆర్టికల్ రాశాను. ‘అందమైన అమ్మాయిలు బాపు బొమ్మలనిపించు కోవాలని చూస్తారు’ అంటూ బాపు గురించి తెలుగులో ఎన్ని వ్యాసాలు రాస్తే ఏం లాభం? పద్మ ఎవార్డులు యిచ్చే బ్యూరాక్రసీ ఉన్న ఢిల్లీ మీడియాలో ఇంగ్లీషులో రావాలి కానీ.. అంటూ వాదించాను. అలాగే ఘంటసాలకు భారతరత్న రావాలి అంటూ యిక్కడే మీటింగులు పెడతారు. ఢిల్లీ సర్కిల్స్‌లో తెలుగేతరుల మధ్య ఘంటసాల పాటలు సర్క్యులేట్ చేసి, గొంతు పరిచయం చేస్తే కదా వాళ్లకు ఆయన ఘనత తెలిసేది! రచయితల్లో కూడా మనలో మనం శతాబ్దపు కవి, యుగాంతపు రచయిత అని బిరుదులు యిచ్చేసుకుంటే సరిపోయిందా? ఇంగ్లీషులో, హిందీలో వారి రచనలు అనువాదం చేసి అక్కడా పేరు తెప్పించ వద్దా?

ఇర్వింగ్ వాలెస్ తన ‘‘ప్రైజ్’’ నవలలో రాశాడు, ‘‘గీతాంజలి’’ని ఠాగూరు మిత్రులు స్వీడిష్ భాషలో అనువదించారు కాబట్టి నోబెల్ కమిటీకి ఆ పుస్తకం విలువ తెలిసి బహుమతి యిచ్చారని. ఇంగ్లీషులో ఉన్నా లాభం లేకపోయేదన్నమాట. నోబెల్ సంపాదించి ఠాగూరు ఇండియాలో కవులున్నారని చాటి చెప్పాడు. అంటే కవిగా గొప్పగా రాయడమే కాక, కాస్త పిఆర్ కూడా చేశాడన్నమాట, దాని వలన ఆయన రీచ్ పెరిగింది. ఆయన మిగతా రచనలు కూడా యితర భాషల్లోకి అనువదితమయ్యాయి. ఇప్పుడు రాజమౌళి చేస్తున్నదీ అదే. తెలుగు సినిమా రీచ్ పెంచాడు. తొలి నుంచి మన తెలుగు సినిమాలకు తమిళ సినిమాలతో పోలిస్తే విస్తృతి తక్కువ. మలేసియా, సింగపూర్, శ్రీలంక యిత్యాది దేశాల్లో కూడా తమిళ వాటికి మార్కెట్ ఉండేది. నిజానికి అక్కడ మనవాళ్లు కూడా గణనీయంగా ఉండేవాళ్లు. తమిళులు పరదేశంలో ఉన్నారు కాబట్టి తెలుగు సినిమాలు చూపించినా చూసేవారేమో. కానీ మన వాళ్లకు ఆ టెక్నిక్ తెలిసేది కాదు.

తమిళ సినిమాలకు ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ వచ్చేది. మార్కెట్ పెద్దది కాబట్టి సాంఘిక సినిమాలతో సహా అనేక సినిమాలు కలర్‌లో తీసేవారు. మనకు చాలాకాలం దాకా బ్లాక్ అండ్ వైటే. అమెరికాలో స్థిరపడిన మన తెలుగువాళ్లు అప్పట్లో తెలుగు సినిమాలు చూడగోరుతున్నారని తెలిసి మన సినిమారంగం వాళ్లు అక్కడ పంపిణీ వ్యవస్థ ఏర్పాటు చేయబోయారు కానీ కుదరలేదు. మేం కలకత్తాలో ఉండే రోజుల్లో తమిళ సినిమాలు కొన్ని థియేటర్లలో ఆదివారం మార్నింగ్ షోలు వేసేవారు. తెలుగు సినిమాలు చూడాలంటే ఆంధ్ర సంఘం హాలులో 16 ఎంఎం మాత్రమే గతి. ‘‘పిల్ల జమీందారు’’ సినిమా ఒక్కటే హాల్లో చూడగలిగాను. అదీ సౌత్ కలకత్తా నుంచి సెంట్రల్ కలకత్తాకు వెళ్లి చూడాల్సి వచ్చింది. మన పంపిణీ వ్యవస్థ అంత పరిమితంగా ఉండేది. 2000 తర్వాత అమెరికాలో తెలుగు జనాభా ఎక్కువై పోయి, సినిమాలకు యుఎస్ మార్కెట్ ప్రధాన వనరుగా మారింది. ఇలాటి మార్కెట్ ఎన్నో దశాబ్దాలుగా మనం మిస్సవుతూ వచ్చాం.

రాజమౌళి ‘‘బాహుబలి’’ తలపెట్టినపుడు కరణ్ జోహార్ దాని పొటెన్షియల్ గమనించి పాన్ ఇండియా సినిమాగా ఎలా చేయాలో ట్రిక్కులు చెప్పాడట. దెబ్బకి తెలుగు సినిమా స్థాయి, తెలుగు నటీనటుల, టెక్నీషియన్ల పేర్లు దేశానికంతటికీ తెలిసిపోయింది. వాళ్ల మార్కెట్ రేంజ్ పెరిగింది. ప్రభాస్‌ 100 కోట్ల క్లబ్బులో చేరిపోయాడు. అది చూసి తక్కిన హీరోలకు కూడా జ్ఞానోదయం అయింది. ఊళ్లో చెఱువులో యీదుతూ అదే సుఖంగా ఉందనుకున్నవాళ్లు ఉత్తరాది నదుల్లో మొసళ్లతో పోరాడడానికి సిద్ధపడుతున్నారు. ఆ తర్వాత దక్షిణాది నుంచి పాన్ ఇండియా సినిమాలు తయారవుతున్నాయి. మార్కెట్ రేంజ్ పెరగడంతో సినిమా స్కేలు పెద్దదైంది. రిస్కు ఎక్కువ కాబట్టి క్వాలిటీపై శ్రద్ధ పెంచుకున్నారు. మనం తీసే సినిమాల్లో 5 శాతమైనా భారీగా తీయగలిగే సాహసం చేయవచ్చనే ధైర్యం కలిగింది. నిజానికి మనం ‘‘సీతారామకల్యాణం’’, ‘‘నర్తనశాల’’, ‘‘శ్రీకృష్ణావతారం’’ వంటి గొప్ప పౌరాణికాలు తీసే రోజుల్లో యిలాటి మార్కెట్ ఉండి ఉంటే అవి కలర్‌లో భారీ బజెట్‌తో తీయగలిగేవారు కదా అనిపిస్తుంది.

నేషనల్ మార్కెట్ గమ్యం చేరాక రాజమౌళి తన గమ్యాన్ని ఇంటర్నేషనల్ మార్కెట్‌కు జరిపాడు. అంతర్జాతీయం అంటే అతని దృష్టిలో హాలీవుడ్డే. గొప్ప ఎమోషనల్ సినిమా తీసి ఏ కేన్స్‌లోనో ఎవార్డు కొట్టవచ్చు. కానీ దానివలన సినీవిమర్శకులు మెచ్చుకుంటారు తప్ప ఫ్యూచర్ బిజినెస్ జరిగేది హాలీవుడ్‌లోనే. సత్యజిత్ రాయ్ సినిమాలకు బెర్లిన్, వెనిస్, మాస్కో లాటి చోట్ల అంతర్జాతీయ ఎవార్డులు వచ్చాయి. దానివలన ఆయనకు సొంతంగా పేరు వచ్చింది తప్ప, బెంగాలీ సినిమాల మార్కెట్ పెరగలేదు. ఇప్పుడు అంతా సవ్యంగా జరిగితే మన తెలుగువాళ్లకు, భారతీయులకు అంతర్జాతీయ అవకాశాలు వస్తాయి. అంటే మన హీరోలు హాలీవుడ్‌లో హీరోలయి పోతారని కాదు. గతంలో ఛోటామోటా, నాన్ గ్లేమరస్ పాత్రలకు బదులు, గుర్తింపు ఉన్న గ్లేమరస్ పాత్రలు కమ్మర్షియల్ సినిమాల్లో రావచ్చు. అదొకటే కాదు, టెక్నీషియన్లకు ఛాన్సు రావచ్చు. అవి రాకపోయినా, మా తర్వాతి సినిమా ఇండియాలో షూట్ చేస్తాం, మీ టెక్నీషియన్లను సెకండ్ యూనిట్‌కు వాడుకుంటాం అనవచ్చు. మీ పురాణాలను మేం తీస్తాం, ఇండియన్ సెంటిమెంట్లు దెబ్బ తినకుండా ఎలా ఎడాప్ట్ చేయాలో స్టోరీ డిస్కషన్స్‌లో కూర్చోండి అనవచ్చు. మనకు టాలెంటు ఉంది, వాళ్లకు టెక్నాలజీ ఉంది. రెండూ కలిస్తే మంచి రిజల్టు రావచ్చు కదా.

నిజానికి యిది ఉభయతారకమైన ప్లాను. మనతో చేతులు కలిపి, ఇండియాలో వాళ్ల ప్రెజెన్స్‌ను పెంచుకోవడం వలన వాళ్ల మార్కెట్ యింకా పెరుగుతుంది. ఇండియాలో వేలాది థియేటర్లున్నాయి. ఓటిటి వచ్చాక అమెరికాలో థియేటర్ల ఆక్యుపెన్సీ తగ్గుతూండవచ్చు. థియేటర్లకు జనాల్ని రప్పించాలనే లక్ష్యంతో వాళ్లు సినిమాల బజెట్ పెంచుకుంటూ పోతున్నారు. అది రాబట్టాలంటే వాళ్లకీ మార్కెట్ పెరగాలి. గతంలో హాలీవుడ్‌లో సినిమా వచ్చిన ఏడాది తర్వాత మన దగ్గర వచ్చేది. ఇప్పుడు వాళ్లతో బాటే మనకూ రిలీజ్ చేస్తున్నారు. మన ప్రాంతీయ భాషల్లో డబ్ చేయించి విడుదల చేస్తున్నారు. డబ్బింగ్ కూడా ఉత్తమస్థాయిలో ఉండేట్లు చూస్తున్నారు. అవతార్ 2  తెలుగు డబ్బింగుకి సినిమా హీరో అవసరాల శ్రీనివాస్ చేత మాటలు రాయించారు. పేద్ద సినిమాలే కాకుండా మామూలు సినిమాలకు కూడా మన భారతీయ భాషల్లో డబ్బింగ్ మార్కెట్ ఉంటే వాళ్ల రాబడి పెరుగుతుంది. మార్కెట్ పెంచుకునే వ్యూహంలో భాగంగా వాళ్లు మన పాటకు ఎవార్డు యిచ్చి ఉండవచ్చు.

ఇలా రాయడం వలన మనవాళ్లని కించపరుస్తున్నానని అనుకోవద్దు. నువ్వు ఒకందుకు పోస్తే, నేను ఒకందుకు తాగుతున్నాను అనే వ్యవహారం అనాదిగా ఉంది. గతంలో ప్రపంచవ్యాప్తంగా జరిగే అందాల పోటీల గురించి మనవాళ్లు అస్సలు పట్టించుకునే వారు కాదు. పేపర్లో ఒక రోజు వార్త అంతే. వాళ్ల పేర్లు మన నోటికి తిరిగేవి కూడా కాదు. అలాటిది రెండు, మూడేళ్లు వరసగా వాళ్లు అన్ని రకాల ఎవార్డులు ఇండియన్స్‌కి యివ్వడంతో మనకు యింట్రస్టు పెరిగిపోయింది. మన దగ్గర సౌందర్యసాధనాల మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ఊరూరా అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. వాటిలో పాల్గొనడం నామోషీగా ఫీలవటం లేదెవరూ. మిస్ దోసకాయలపల్లి, మిసెస్ నక్కలపాడు వంటి బిరుదుల కోసం వేలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. పెళ్లిళ్లలో బ్యుటీషియన్లు చేసుకునేటంత డబ్బు వేరెవరూ చేసుకోవటం లేదు. బ్యూటీ ప్రోడక్టులలో ఎక్కువ శాతం ఫారిన్‌వే అని గ్రహిస్తే, మన వాళ్లకు విశ్వసుందరి బిరుదులు యివ్వడం వెనక వ్యూహం అర్థమౌతుంది.

ఇప్పుడు మన పాట ఆస్కార్‌లో పోటీ పడుతోంది అనగానే గత రెండు నెలలుగా ఆస్కార్ పదం మన నాలికలపై ఎంతలా ఆడుతోందో గమనించండి. రేప్పొద్దున పల్లెల్లో సైతం ఆస్కార్ సెలూన్లు, ఆస్కార్ టైలరింగ్ షాపులూ వెలసినా ఆశ్చర్యపడకండి. పనిలో పనిగా ఆస్కార్‌లో మనతో పోటీకి వచ్చిన హాలీవుడ్ సినిమాల పేర్లు కూడా పరిచితమై పోయాయి. అంటే వాటికి ఉచిత పబ్లిసిటీ వచ్చేసినట్లేగా! ఇక హాలీవుడ్ అనేది మనకు ఆత్మీయంగా మారిపోతుంది. అక్కడి యాక్టర్ల పోస్టర్లు వగైరాలు మన చిన్న పట్టణాలలోని కూడా సామాన్య జనులు కూడా కొనుక్కోవడం మొదలుపెడతారు. కొరియా సీరియల్స్ ఓటిటిలో పాప్యులర్ అయిపోవడంతో సిటీల్లో కొరియన్ డిషెస్ తినడం ఫ్యాషనై పోయింది. యువతలో చాలామంది కొరియన్ భాష నేర్చుకుంటున్నారని యీ మధ్యే ఒక సండే మ్యాగజైన్‌లో కథనం వచ్చింది. కె-పాప్ ఉర్రూతలూగిస్తోంది. ఇదంతా దేనివలన? కొరియన్ సీరియల్స్‌ ఓటిటి ద్వారా మన గుమ్మంలోకి రావడం చేత! థియేటర్లలో అయితే కె పాప్ యింత ప్రజాదరణ పొందేదే కాదు. రీచ్, మార్కెట్ పెరిగిన కొద్దీ కొరియన్లు క్వాలిటీ మెరుగు పరుచుకుంటూ పోతున్నారు.

ఇవన్నీ ఆలోచించుకుని రాజమౌళి యీ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ చేయడానికి ముందుగానే ప్లాన్ చేసుకున్నా రనుకోవాలి. బాహుబలికి విపరీతంగా పేరు వచ్చేయడంతో, దాని కంటె ఎక్కువ ఆర్భాటం ఉన్న సినిమా తీయాలని శ్రమించారు. అది దేశీయంగా డబ్బు సంపాదించినా అంతర్జాతీయ ఆడియన్స్‌ను మెప్పిస్తుందని, ఎవార్డులు కురిపిస్తుందని రాజమౌళి అనుకుని ఉండరు. ఎందుకంటే సినిమా ఎమోషనల్‌గా వీక్‌గా తయారై, పావుగంటకో థ్రిల్ కలిగిస్తూ, ఓ సర్కస్‌లా కనబడింది. ‘ఈ సినిమా నాలోని బాలుణ్ని తట్టి లేపింది’ అని వర్మ యిచ్చిన కాంప్లిమెంటు అన్యాపదేశంగా యీ అంశాన్నే తడిమింది అనిపించింది నాకు. ఈ సుదీర్ఘ సినిమాలో డైరక్టోరియిల్ ఫ్లాషెస్ కనబడి కామెరూన్, స్పీల్‌బర్గ్ మెచ్చుకుని ఉండవచ్చు కానీ మొత్తం మీద సినిమా వాళ్లకు నచ్చి ఉంటుందని నమ్మడం కష్టం. అందువలన రాజమౌళి సినిమా నెగ్గినా నెగ్గకపోయినా కనీసం యీ పాటైనా హైలైట్ కావాలని దానిపై ఫోకస్ చేసి ఉంటారని నాకు తోచింది. దీన్ని ప్రత్యేకంగా యింటర్నేషనల్ ఆడియన్స్ కోసం డిజైన్ చేశాడాయన.

నిజానికి ఎన్నో గొప్ప తెలుగు పాటలున్నా ఆస్కార్ స్థాయికి చేరింది యీ పాటా? అనిపిస్తుంది ఒక్క క్షణం. రాజమౌళి-కీరవాణి (గీతరచన కూడా కీరవాణిదే) కాంబినేషన్‌లోనే వచ్చిన ‘‘బాహుబలి’’లోని ‘కన్నా నిదురించరా’ పాట దీని కంటె చాలా చాలా మెరుగైనది. పోనీ యీ సినిమాలోనే అనుకున్నా యీ పాట కంటె ‘కొమురం భీముడో’ పాట నన్ను ఎక్కువగా కదిలించింది. నేను చెప్పిన రెండు పాటలు ఎంజాయ్ చేయాలంటే భారతీయ వాతావరణం, వీలైతే తెలుగు భాష బాగా తెలిసి ఉండాలి. నాటునాటు పాటకు అదేమీ అక్కరలేదు. ఇది సందడి సందడి పాట. ఇలాటి బీట్ ఉన్న పాటలు జనసామాన్యంలో చొచ్చుకుపోయినట్లు మెలోడీలు వెళ్లవు. మాస్టర్ వేణు ‘ఏరువాక సాగారో..’ (రోజులు మారాయి) జనాలకు ఎక్కినంత బాగా ‘తెలియని ఆనందం’ (మాంగల్యబలం) ఎక్కదు కదా. ఈ నాటునాటు పాటను రాజమౌళి హాలీవుడ్, లేదా యూరోప్ వాళ్ల కోసమే డిజైన్ చేశాడు.

ఆ డ్రస్ చూడండి, వాళ్లు మమేకమయ్యే ఆహార్యం. ఇక డాన్స్ కూడా. పాట జానపదం కానీ, నాట్యం మన దేశంలోని ఏ రాష్ట్రపు జానపదనృత్యమూ కాదు. అలాఅని సినిమా డాన్సూ కాదు. మన తెలుగు సినిమా హీరోలు కాళ్లు మెలికలు వేసేసి, గాలిలో పద్మాసనాలు వేసేయగల సమర్థులు. సులభంగా చేసేయగల ఈ సింపుల్ లెగ్ అండ్ హ్యేండ్ మూవ్‌మెంట్స్ ఎందుకిచ్చినట్లు? హీరోలిద్దరూ బీట్‌కి అనుగుణంగా విగరస్‌గా నర్తించి హుషారు తెప్పించారు. ఇద్దర్నీ సింక్రనైజ్ చేయడంలో కష్టం ఉంది కానీ లేకపోతే విడిగా చేయమంటే రెండు రోజుల షూటింగు సరిపోయేదేమో! సాధారణ పాశ్చాత్యుల కోసమే ఆ తేలికపాటి మూవ్‌మెంట్స్ అని గమనించాలి. పాతకాలం బ్రిటిష్ సినిమాల్లో, తొలితరం హాలీవుడ్ సినిమాల్లో యిలాటి కదలికలు చూసి ఉన్నారు కాబట్టి వాళ్లకు యివి సుపరిచితం. అందుకే వాళ్లు డాన్స్‌ను సులభంగా అనుకరించగలిగారు.

దీనిలో బీట్, డాన్స్ ఆకర్షణీయం తప్ప లిరిక్ కాదు. బానిసలుగా ఉన్నవాళ్లు తమ ఘనత చెప్పుకుంటూ సామ్రాజ్యవాదంపై ధిక్కార స్వరం వినిపించారు కాబట్టి, వాళ్లూ మెచ్చారని కొందరు వ్యాఖ్యానించారు. సినిమా మొత్తం చూసినవాళ్లకి సందర్భం తెలియాలి తప్ప పాట మాత్రం చూసినవాళ్లకి ఆ ధిక్కారం తెలియదు. మామూలు పాటల్లోనే మాటలు పట్టించుకోం. ట్యూన్ లాక్కుని పోతుంది. ఈ పాటలో వినిపించిన అచ్చ తెలుగు పదాలను, గ్రామీణ నేపథ్యాన్ని అర్థం చేసుకుని ఆనందించేటంత ఓపిక వాళ్లకి ఉంటుందని నేననుకోను. ఎవరైనా అనువదించాలన్నా మూడు పేజీల ఫుట్‌నోట్ రాయాలి. డాన్సుని అనుకరించేవాళ్లు చాలామంది కనబడుతున్నారు తప్ప పాట పాడి వినిపించేవాళ్లు ఎక్కువగా కనబడటం లేదు. అందుకే కాబోలు, ఒరిజనల్ సింగర్స్‌నే ఆస్కార్ వేదిక పైకి పిలిచి పాడించారు.

‘‘గీతాంజలి’’కి అంతర్జాతీయ బహుమతి రావడానికి కారణం దాని థీమ్ కూడా అనుకోవాలి. క్రైస్తవులు సులభంగా అర్థం చేసుకునే ఏకోపాసన చుట్టూ ఆ గీతాలు తిరుగుతాయి, ఠాగూరు కూడా బ్రహ్మసమాజంవాడే కాబట్టి! ఆ పాటలు దశావతారాలపై ఉంటే వాళ్లు కనక్ట్ అయ్యేవారు కాదు. అలాగే ‘కన్నా..’ పాటను ఆ వేదికపై చూపిస్తే ఏదో తెలియని అనుభూతికి లోనయ్యేవారు కానీ దాన్ని సొంతం చేసుకుని ఎవార్డు యిచ్చేవారు కాదు. దీన్నయితే సొంతం చేసుకోగలిగారు. సినిమా పేరు దగ్గర్నుంచి రాజమౌళి జాగ్రత్త తీసుకున్నారు. ఆర్ఆర్ఆర్ పేరు కూడా వాళ్లు పలకడానికి అనువుగా పెట్టారు. ఫుల్ ఎక్స్‌పాన్షన్ ఎక్కడా యివ్వలేదు, గుక్క తిరగక నోరు వెళ్లబెడతారని. ఏ ‘ఛత్రపతి’ పేరు పెట్టి ఉన్నా ఉచ్చరించలేక ఉక్కిరిబిక్కిరై పోయి ఉండేవారు.  

ఇంత ప్లాన్ చేసిన రాజమౌళిని చూసి అదృష్టదేవత చిరునవ్వు నవ్వింది. ఉక్రెయిన్ పాలెస్ ఎదురుగా షూట్ చేయడం అతనికి బోనస్ అయింది. ప్రస్తుతం పాశ్చాత్య ప్రపంచం రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌ను దువ్వుతోంది. ఉక్రెయిన్‌ను హైలైట్ చేసే దేన్నయినా అది లైమ్‌లైట్‌లోకి తీసుకుని వస్తుంది. ‘అయ్యో, యింత సుందరమైన భవంతిపై దుర్మార్గపు రష్యా బాంబులు వేసి ధ్వంసం చేద్దామని చూస్తోందా’ అని సభ్యజనం అనుకోవాలని దాని కోరిక. ఇది ఫార్‌ఫెచ్‌డ్ ఐడియా అని మీరనుకోవచ్చు కానీ నోబెల్ బహుమతుల వరస చూస్తే యిది అర్థమౌతుంది. వాళ్లు ఏదైనా రష్యన్ రచనకు, లేదా గతంలో కమ్యూనిస్టు బ్లాక్‌గా ఉన్న తూర్పు యూరోప్ భాషల రచనకు బహుమతి యిచ్చారంటే దాని అర్థం, అది కమ్యూనిస్టు వ్యతిరేక రచన అని. ఆ భాషల్లో ఎంత మానవీయ రచన చేసినా వాళ్ల కంటికి ఆనదు. అత్యంత యుద్ధోన్మాద దేశమైన ఇజ్రాయేల్‌ అధినేతకు శాంతి బహుమతి యిచ్చిన నోబెల్ కమిటీ విశ్వవ్యాప్తంగా అహింసకు ప్రతీక ఐన గాంధీకి శాంతి బహుమతి యివ్వలేదు. ఎందుకంటే గాంధీ పోరాడి, ఓడించినది బ్రిటిషువారిని!

నాటునాటు పాటకు ఆ ఊపు తెచ్చినది కోరియోగ్రాఫర్ ప్రేమరక్షిత్. కానీ అతనికి యివ్వవలసినంత క్రెడిట్ యివ్వలేదు. కార్తికేయ పేరు పేర్కొన్న కీరవాణి గారు వేదికపై అతని పేరు కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేది. గోల్డెన్ గ్లోబ్ ఎవార్డు సమయంలో అప్లయి చేసేటప్పుడు గీతకారుడు, సంగీతకారుడు పేర్లు యివ్వాలి. అయితే ఆర్ఆర్ఆర్ టీము గీతకారుడి పేరు స్థానంలో గాయకుల పేర్లు యిచ్చారు. గోల్డెన్ గ్లోబ్ వాళ్లకేం తెలుసు? నామినేషన్లు ప్రకటించినప్పుడు అలాగే ప్రకటన యిచ్చేశారు. చంద్రబోసు అభిమానులు ఆయనకు అన్యాయం జరిగిందని గొడవ చేశారు. దాంతో ఎవార్డు ప్రకటన సమయానికి కరక్షన్ చేయించారు. అయితే ఎవార్డు తీసుకోవడానికి కీరవాణి ఒక్కరే వేదిక ఎక్కారు. నిజానికి చంద్రబోసు కూడా వేదికపై ఉండాలి. కానీ లేరు. ఆస్కార్ వేదికపైకి రప్పించారు. అంతవరకు సంతోషం.

మొత్తం మీద రాజమౌళి, కీరవాణి బాగా హైలైట్ అయ్యారు. హీరోలిద్దరూ లైమ్‌లైట్‌లోకి వచ్చారు. ఆనందం. జూనియర్ ఎన్టీయార్ అమెరికన్ యాసలో మాట్లాడడాన్ని కొందరు తప్పు పట్టడం నాకు వింతగా తోచింది. ఎదుటి వాళ్ల బట్టి మనం తెలుగు యాసను కూడా కాస్త మారుస్తాం. అలాగే ఇంగ్లీషూను. ఎన్నారై తెలుగువాళ్లు అమెరికన్లతో ఒకలా, మనతో మరొకలా మాట్లాడతారు. జూనియర్ చేసినదీ అదే! అది చూసి హోమ్లీగా ఫీలై అతనికి అక్కడి వాళ్లు ఛాన్సులిస్తే మంచిదే కదా. మన కంటె పైస్థాయిలో ఉన్నవారితో కొలాబరేషన్ ఎప్పుడూ మంచిదే. మన సినిమాల్లో క్వాలిటీ పెరుగుతుంది, సినిమా బజెట్‌లో 50శాతం హీరోల పారితోషికాలకు వెచ్చించే బదులు టెక్నీషియన్ల పారితోషికాలు పెంచి, ఆన్‌స్క్రీన్‌పై ఖర్చు పెడితే మంచిది. బాహుబలి ఆసియాలో గొప్ప మన తెలుగు సినిమాకు ప్రెజన్స్ తెచ్చింది. ఇప్పుడు రాజమౌళి పుణ్యమాని నాటునాటు కారణంగా హాలీవుడ్‌లో ఒక అడుగు పడింది.

అయితే రాజమౌళి పై వస్తున్న ప్రధాన విమర్శ ఏమిటంటే, మార్కెటింగ్‌పై పెట్టిన శ్రద్ధ సినిమా తీయడంపై పెట్టి ఉండాల్సింది అని. తమిళంలో ఆళ్ పాది, అడై పాది అంటారు. మనిషి ఎంత బాగున్నా, ఉడుపులు కూడా అంత బాగుండాలి అని భావం. ఇక్కడ దుస్తుల హంగు ఎక్కువై అసలు మనిషి చిక్కిపోతున్నాడు. బాహుబలి మొదటి భాగం గురించి కూడా నా అభిప్రాయం అదే, సినిమా కంటె మార్కెటింగ్ ఎక్కువై పోయిందని! నెల్లాళ్ల ముందు నుంచీ ఏ సినిమా లేకుండా చేసి, ఊళ్లో అన్ని థియేటర్లలోనూ ఆ సినిమా వేసి విజయం సాధించడం గొప్ప కాదన్నాను. కంటిలో మెరుపు తెప్పించింది తప్ప గుండెల్లో తడి తెప్పించలేదన్నాను. ఇతర దేశాల్లో యిలాటి గిమ్మిక్స్ చేయకపోయినా ఆడింది. రెండో భాగం మెరుగ్గా ఉంది. అది యింకా బాగా ఆడింది. ఆర్‌ఆర్ఆర్‌కి హంగు ఎక్కువైనా బాహుబలి స్థాయిలో విదేశాల్లో ఆడలేదు కదా! ప్రముఖ డైరక్టర్లు ప్రశంసలు కురిపించవచ్చు కానీ అసలు నిర్ణేతలు ఆడియెన్సే!

అనేక హాలీవుడ్ సినిమాల విషయంలో కూడా హంగు ఎక్కువ, అసలు సరుకు తక్కువ అనిపిస్తుంది. రాజ్ కపూర్ చాలా సినిమాలు భారీ స్థాయిలో తీసినా, ఏదో ఒక సందేశం ఉండేట్లు చూసేవాడు. ‘‘సంగం’’లో అదేమీ లేదు. కథ చిన్నది, డాబు ఎక్కువ. రెండు యింటర్వెల్స్ మధ్యంతా విదేశాల్లోనే తీశాడు. అది బాగా ఆడడంతో, తనకు షోమన్ అనే పేరు విపరీతంగా వచ్చేయడంతో దాన్ని నిలబెట్టుకోవడానికి ‘‘మేరా నామ్ జోకర్’’ను రెండు భాగాలుగా చాలా పెద్ద స్థాయిలో ప్లాను చేశాడు. ఏళ్ల తరబడి తీశాడు. మొదటి భాగం ఘోరంగా ఫ్లాప్ కావడంతో రెండోది తీయలేదు. తర్వాత ఏం తీశాడన్నది యిప్పుడు అప్రస్తుతం. రాజమౌళి కూడా షోమన్ రంధిలో పడిపోయేడేమో, మనం వగచి లాభం లేదు. ఆయన కంటెంట్, మార్కెటింగు రెండిట్లో రాణించాలని ఆశించడం తప్ప మరేమీ చేయలేం. ఈయన బాట వేశాడు కాబట్టి మరి కొందరు దానిపై నడిచి కంటెంట్ ఉన్న సినిమాలు తీసి మార్కెట్ చేసుకోవచ్చు. ‘‘బాహుబలి’’ నార్త్‌లో క్రియేట్ చేసిన మార్కెట్‌తో ‘‘కాంతారా’’ వంటి మిస్టిక్, యింటెన్సివ్ సినిమా లాభపడింది కదా. కంటెంట్ పరంగా రాజమౌళిని మించిన దర్శకులు భవిష్యత్తులో వచ్చినా భారతీయ సినిమాను ఆస్కార్ స్థాయికి తెచ్చి మార్కెట్ క్రియేట్ చేస్తున్న రాజమౌళి స్థానం మాత్రం చరిత్రలో సుస్థిరం.

– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2023)

mbsprasad@gmail.com

Show comments