Sir Review: మూవీ రివ్యూ: సార్

చిత్రం: సార్
రేటింగ్: 2.5/5
తారాగణం: ధనుష్, సంయుక్త, సాయి కుమార్, తనికెళ్ల భరణి, సముద్రఖని, తోటపల్లి మధు, నర్రా, హైపర్ ఆది తదితరులు
కెమెరా: జె. యువరాజ్
సంగీతం: జి. వి ప్రకాశ్ కుమార్
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాత: సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య
దర్శకత్వం: వెంకీ అట్లూరి
విడుదల తేదీ: 17 ఫిబ్రవరి 2023

"రంగ్ దే" లాంటి వినోదాత్మక చిత్రాన్ని అందించిన తర్వాత చాలా గ్యాప్ తీసుకుని "సార్"తో ముందుకొచ్చాడు దర్శకుడు వెంకి అట్లూరి. అయితే మునుపటి చిత్రాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకులు థియేటర్లకొస్తారేమొనని కాబోలు ముందుగానే ఇందులో కామెడీలు గట్రా ఉండవని చెప్పేసారు. తమిళ హీరో ధనుష్ హీరోగా, మళయాళ నటి సంయుక్త హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో తెలుగు దర్శకుడు తీసిన సినిమా ఇది.

కథలోకి వెళ్తే అది 1999 నేపథ్యం. విద్యని భారీ వ్యాపారంగా మార్చి త్రిపాఠి (సముద్రఖని) అనే వ్యక్తి పెద్ద విద్యాసంస్థని నడుపుతుంటాడు. ఆ కళాశాలలో బాలు (ధనుష్) ఒక వార్డెన్ లాంటి చిన్న లెక్చరెర్. ప్రైవేట్ కాలేజీల వల్ల ప్రభుత్వ కళాశాలలు నిర్వీర్యం అయిపోతున్నాయని, ప్రభుత్వం ప్రైవేట్ విద్యాసంస్థలపై ఫీజ్ నియంత్రణ బిల్ తీసుకురావడానికి సిద్ధపడుతుంది. అది గ్రహించిన త్రిపాఠి ప్రభుత్వ కాలేజీలను తానే దత్తత తీసుకుని లెక్చరెర్స్ ని పెట్టి, వాళ్లకి జీతాలు కూడా తానే ఇచ్చి నడిపిస్తానని ముందుకొస్తాడు. ఇది కేవలం తన వ్యాపారాన్ని కాపాడుకోవాడానికి ప్రభుత్వానికి త్రిపాఠి వేసిన ఒక బిస్కెట్. అందులో భాగంగా పెద్దగా విషయం లేదనుకున్న బాలుని తన కాలేజి నుంచి సిరిపురం ప్రభుత్వ కళాశాలకి పంపిస్తాడు త్రిపాఠి. ఆ ఇంటర్ కళాశాలను బాలు తీర్చి దిద్దిన విధానం, ఆ ఊరిలోని విద్యార్థులను చదువు వైపుకి తిప్పిన వైనం, త్రిపాఠి నుంచి ఎదుర్కున్న సమస్యలు, ఆ కళాశాలలోనే మీనాక్షి (సమ్యుక్త) అనే మరొక లెక్చరర్ తో ప్రేమ...ఇదంతా తక్కిన కథ.  

ఇలాంటి కథ ఎంచుకున్నప్పుడు ముందుగా ఎదురయ్యే ప్రశ్న ఒక్కటే. రియలిస్టిక్ గా తీయాలా లేక నేపథ్యంగా ఈ కథని పెట్టుకుని ఫార్ములా దినుసులతో కమర్షియల్ చిత్రంగా మలచాలా అని. రెండూ కాకుండా మధ్యస్థంగా తీసే పని పెట్టుకున్నట్టున్నాడు దర్శకుడు. అందుకే కాసేపు రియలిస్టిక్ గా ఉన్నట్టు అనిపిస్తూనే హై వోల్టేజ్ ఫైట్స్ లాంటి అంశాలతో కమర్షియల్ ఛాయలు కూడా కనిపిస్తుంటాయి.  

కథగా ఇది చాలా మంచి పాయింట్. తీసుకున్న నేపథ్యం కూడా 1999 కనుక ఆ కాలం నాటి రియాలిటీని ఆసక్తికరంగా చెప్పగలిగే అవకాశముంది. కథ, కథనం విషయంలో దర్శకుడి కష్టం కనిపిస్తుంది. ఒకానొక సిన్సియర్ లెక్చరెర్ యొక్క సంకల్పం, పోరాటం, గెలుపు...తెర మీద నడుస్తుంటే చూస్తున్న ప్రేక్షకులకి కళ్లు చెమ్మగిల్లాలి. ఎందుకంటే ప్రైవేట్ కాలేజీల వెల్లువలో భారీ ఫీజులు చెల్లించి సరైన చదువుకి నోచుకోలేని పేద విద్యార్థుల దీన గాధలు అందరికీ తెలుసు కనుక ఇది అందరూ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్. అయితే ఇక్కడే కులాల టాపిక్ కూడా తీసుకొచ్చి, ఎంత పల్లెటూరైనా 1999లో మరీ ఆ స్థాయిలో పరిస్థితులు నిజంగా ఉన్నాయా అనే సందేహాన్ని కలిగిస్తాడు. 

అక్కడక్కడ మంచి సీన్స్ రాసుకుని బాగానే నడిపినా ఓవరాల్ గా చూస్తే జస్ట్ ఏవరేజ్ అనిపించేలా ఉంది. దర్శకుడిగా వెంకిలో సున్నితత్వంతో కూడిన కథని చెప్పాలనుకున్నాడు. అలాంటప్పుడు ఒక హీరో పడే సామాజికపరమైన స్ట్రగుల్ ఆర్గానిక్ గా పరిణతిచెందుతూ ఉన్నట్టయితే ఎమోషన్ మరింత బలంగా ఉండేది. కానీ ఇక్కడ అన్నీ సడెన్ గా జరిగిపోతుంటాయి. ఊరి జనంలో పేరుకుపోయిన చదువుపై వ్యతిరేకత హీరో ఇచ్చే ఒక్క స్పీచ్ తో మారిపోతుంది. ఆ వెంటనే వచ్చే పాట అరవ వాసనతో కొట్టుకుపోయి పండాల్సిన ఎమోషన్ అరకొరగా పండినట్టవుతుంది. ఇలాంటివే చాలా ఉన్నాయి. విలన్లు పరీక్షరాయడానికి వెళ్లే బస్సుని ఆపితే సుబ్రహ్మణ్యభారతి గెటప్పులో వచ్చి హీరో ఫైట్ చేయడం లాంటివి ఎంచుకున్న ఈ ఫార్మాట్ లో కాస్త అతిగా అనిపిస్తాయి. అయినా ఆ గెటప్ సుబ్రహ్మణ్యభారతిదని తమిళ వాళ్లకి తెలుస్తుంది కానీ తెలుగువాళ్ళల్లో చాలామందికి తెలియకపోవచ్చు. బైలింగువల్ అయినా కూడా డబ్బింగ్ లాగ అనిపించేది ఇలాంటి వాటివల్లే. 

సంగీతం మాత్రం ఘోరంగా ఉందని చెప్పాలి. ఒక్కటంటే ఒక్క పాట కూడా వినసొంపుగా లేదు. ఏ ట్యూన్ కూడా మనసుకు హత్తుకోదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల పర్వాలేదనిపించినా ఎక్కువ శాతం అత్యంత సాధారణంగా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. కెమెరావర్క్ వగైరాలు ఓకే.

ధనుష్ తన పాత్రలో ఒదిగిపోయాడు. అయితే చాలా రియలిస్టిక్ గా ఉంటూనే తను మాస్ హీరో అని గుర్తు చెయ్యాలన్నట్టుగా అవసరం లేని ఫైట్లు అవి చేసాడు. పూర్తిగా ఫార్ములాకి కట్టుబడి ఉంటే "జైభీం" లో సూర్యలాగ కనిపించేవాడు. 

హీరోయిన్ సంయుక్త పర్వాలేదు. భావోద్వేగాలు పండించడానికి పెద్దగా స్కోపైతే ఇవ్వలేదు దర్శకుడు.

హైపర్ ఆది కనిపించిన కాసేపూ కాస్త నవ్వించాడు. సాయికుమార్ పాత్రకి కొంచెం నిడివున్నా తనికెళ్ల భరణిని మరీ ప్యాడింగ్ ఆర్టిస్టుగా వదిలేసాడు దర్శకుడు. ఆమాత్రం పాత్రకి ఇంకెవర్ని పెట్టుకున్నా సరిపోయేది. సముద్రఖని నెగటివ్ పాత్రలో పాజిటివ్ మార్కులేయించుకుంటాడు.

కథగా చూస్తే హృతిక్ రోషన్ ప్రధానపాత్రలో వచ్చిన "సూపర్30", సూర్య కథానాయకుడిగా వచ్చిన "జైభీం" ఛాయలు కనిపిస్తాయి. కథానాయకుడి ఆచూకి వెతుక్కోవడంతో మొదలయ్యే కథనంతో కొంతవరకు "సీతారామం" కూడా గుర్తొస్తుంది.

కమర్షియల్ గా హిట్టయ్యే లక్షణాలు అంతగా కనపడకపోయినా పాయింట్ పరంగా మంచి సినిమా అనిపించుకునే విధంగా ఉంది. అద్భుతమని నలుగురికీ చెప్పడానికి లేదు, అలాగని పెదవి విరిచేయడానికీ లేదు. ఎంచుకున్న పాయింట్, రాసుకున్న విధానం బాగున్నా సినిమా అనుభూతి విషయంలో ఇంకేదో ఉండాలనిపిస్తూ ముగుస్తుంది. 

బాటం లైన్: ఏవరేజ్ మాష్టారు!

Show comments