Amigos Review: మూవీ రివ్యూ: అమిగోస్

చిత్రం: అమిగోస్
రేటింగ్: 2.25/5 
తారాగణం: కళ్యాణ్ రామ్, ఆశికా రంగనాథ్, సప్తగిరి, బ్రహ్మాజి తదితరులు
కెమెరా: సౌందర్ రాజన్
ఎడిటింగ్: తమ్మిరాజు
సంగీతం: గిబ్రాన్
నిర్మాత: నవీన్ యెర్నేని, వై రవి శంకర్
దర్శకత్వం: రాజేంద్ర రెడ్డి
విడుదల తేదీ: 10 ఫిబ్రవరి, 2023

2022లో "బింబిసార" సర్ప్రైజ్ హిట్. టైం ట్రావెల్ కాన్సెప్టుతో చాలా కొత్తగా ఉండి ప్రేక్షకుల మెప్పు పొందింది. అదే విధంగా ఈసారి "డొప్పెల్ గేంగర్స్" కాన్సెప్టుతో వచ్చిన ఈ "అమిగోస్" ట్రైలర్ విడుదలైనప్పటినుంచి కొన్ని అంచనాలు ఏర్పరిచింది. 

వినడానికి "డొపెల్ గేంగర్స్" అనేది కొందరికి కొత్తపదంలా కనిపిస్తున్నా "లుక్ అలైక్" కి ఇది మరో పేరంతే. గతంలో ఈ లుక్ అలైక్స్ కథలు అనేకం చూసాం తెలుగు తెరమీద. ఎన్.టి.ఆర్ "రాముడు భీముడు", చిరంజీవి "ముగ్గురు మొనగాళ్లు", నాగార్జున "హల్లో బ్రదర్" ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అయితే వాటిల్లో కామన్ పాయింట్ ఆ లుక్ అలైక్స్ అన్నదమ్ములవడం. కానీ ఈ డొపెల్ గేంగర్స్ అలా కాదు. వీళ్ళ మధ్య ఎటువంటి బంధుత్వాలూ ఉండవు..కానీ ఒకేలా ఉంటారు. అదొక్కటే తేడా. ఈ తరహా పాయింట్ కొత్తదా అంటే అదీ కాదు. కమల్ హాసన్ "ఇంద్రుడు చంద్రుడు" ఎప్పుడో చూసాం. అందులో పాత్రలిద్దరూ కేవలం లుక్ అలైక్స్ అంతే..బంధుత్వమేదీ ఉండదు. కనుక సౌండింగ్ కొత్తగా ఉండడం, ఎన్నో ఏళ్ల నుంచి డొపెల్ గేంగర్స్ వెబ్సైట్స్ కూడా ఉండడం..వాటి బ్యాక్ గ్రౌండ్లో సినిమా కావడం వల్ల ఇదేదో కొత్త ప్రయోగంలా అనిపిస్తుందంతే. 

కథలోకి వెళ్తే ఇషికా అనే అమ్మాయిని సిద్ధార్థ్ ప్రేమిస్తాడు. కానీ అనుకోని విధంగా సిద్ధార్థ్ ఒక వెబ్సైట్ ద్వారా తనలాగే పోలిన మరొక ఇద్దర్ని కలుస్తాడు. ఒకడు కలకత్తాకి చెందిన మైకేల్, మరొకడు బెంగళూరుకు చెందిన మంజునాథ హెగ్డే. వీరిలో ఒకడు పెద్ద క్రిమినల్. అతను సిద్ధార్థ్ ని ఎలా వాడుకోవాలనుకుంటాడు, దానిని హీరోగా సిద్ధార్థ్ ఎలా తిప్పికొడతాడు, మధ్యలో మంజునాథ్ ఎలా నలుగుతాడు అనేదే కథంతా. 

ఆ మధ్యన జూ ఎన్.టి.ఆర్ "జై లవ కుశ"తో ట్రిపులాక్షన్ చేసాడు. బహుశా అదే టైపులో ఒక సినిమా చెయ్యాలని కళ్యాణ్ రామ్ కి కూడా కోరిక పుట్టుండొచు. ఎందుకంటే కథ వేరైనా పాత్రల తీరుతెన్నులు ఆ సినిమాకి, ఈ సినిమాకి సమాంతరంగా కనిపిస్తాయి. "ఒక హీరో, ఒక విలన్, ఒక అమాయకుడు... అదీ కథ" అన్నంత ఈజీగా చెప్పేయొచ్చు. 

గతంలో సీనియర్ ఎన్.టి.ఆర్ ఒకే సినిమాలో మూడు పాత్రలు చేసినా ఎక్కడా ఎన్.టి.ఆర్ కాకుండా ఆ పాత్రలే కనిపించేవి. ఆయన మనవడైన కళ్యాణ్ రామ్ మాత్రం అంత వైవిధ్యాన్ని ప్రదర్శించలేకపోతున్నాడు. అటువంటప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయడం అనవసరం. చేసినా..అద్భుతంగా అనిపిస్తే ప్రయోగంగా మార్కులు పడతాయేమో తప్ప నటుడిగా మార్కులు పడవు. 

కథా కథనాల విషయానికొస్తే...ప్లాట్ పాయింట్ ఆసక్తికరంగానే ఉంది. ఒకేలాంటి  పోలికలున్నవాళ్లని ఒక వెబ్సైట్ కలపడం, దానివల్ల ఏర్పడే ప్రమాదాలు..! కానీ కథగా మలచడంలో ఐ.క్యూని ఎక్కువగా వాడుకోలేదు. కథనం కూడా అంతే. అక్కడక్కడే తిరుగుతూ పేలవమైన సన్నివేశాల మధ్య నడిచింది. హీరోయిన్ తాను చేసుకోబోయేవాడికి పెట్టే పరీక్ష గానీ, పెళ్లిచూపుల సీన్ గానీ, కళ్యాణ్ రామ్ కృష్ణుడు టైపులో దొంగలకి కనపడే షాట్ గానీ, ఎన్.ఐ.ఎ ఎపిసోడ్ గానీ చాలా కృతకంగా ఉన్నాయి. తెలుగు సినిమాల్లో ఎన్.ఐ.ఎ ని జోకర్స్ గా చూపించడం పరిపాటైపోయింది. "అఖండ" నుంచి "అమిగోస్" వరకు ఇదే తంతు కొనసాగుతోంది.

ఎక్కడా టెన్షన్ పెట్టే సీక్వెన్స్ కానీ, మనస్ఫూర్తిగా నవ్వుకోగలిగే సన్నివేశాలు కానీ, గూజ్బంప్స్ వచ్చే మొమెంట్స్ కానీ లేకపోవడం ఈ సినిమా ప్రత్యేకత. ఆఖరికి "ఎన్నో రాత్రులొస్తాయి కానీ" పాటని కూడా ఎంజాయ్ చేసే పరిస్థితి లేకుండా ఉందంటే అప్పటి వరకు చూసిన సినిమాలో స్క్రీన్ ప్లే ఎంత లూజుగా ఉందో అర్ధమౌతుంది. నిజానికి ఆ పాటని ప్రచారానికి బాగా వాడారు. 

టెక్నికల్ గా సినిమా అటు ఇటుగా ఉంది. కెమెరా వర్క్ బాగానే ఉన్నా నేపథ్యసంగీతం దెబ్బకొట్టింది. ఈ తరహా సినిమాకి ఉండాల్సిన మేజికల్ మెస్మెరైజింగ్ బీజీఎం కొరవడింది. "బింబిసార" స్కోర్ చేసింది ఈ విషయంలోనే. 

ఎడిటింగ్ కూడా ఇంకాస్త షార్ప్ గా ఉండి నిడివి తగ్గించినట్టైతే బాగుండేది. కథలో విస్తీర్ణత లేకపోవడం వల్ల అక్కడక్కడే తిరుగుతూ నిడివి ఎక్కువగా అనిపిస్తుంది. 

సంభాషణలు చాలా వీక్ గా ఉన్నాయి. చిన్నపాటి మెరుపులు కూడా లేవు. పేపర్ మీద కథనం ఆసక్తికరంగా అనిపించవచ్చు కానీ తెర మీదకు తీసుకువెళ్లే క్రమంలో దర్శకుడు తడబడ్డాడు. 

ప్రధమార్థంలో ప్లాట్ సెట్టింగ్ బాగానే చేసినా ద్వితీయార్ధానికి వచ్చే సరికి సరుకు లేకుండా పోయింది. గతంలో చూసిన పలు సినిమాల అనుభవంతో కథాగమనం ఎలా ఉండ బోతోందో సగటు ప్రేక్షకుడు ఊహించేలా ఉంది చివరి వరకు. 

కానీ క్లైమాక్స్ లో మాత్రం "అమిగోస్-2" ఉండబోతోందన్నట్టుగా హింటిచ్చి ప్రేక్షకులని ఇంటికి పంపాడు దర్శకుడు. అది ఉంటుందా ఉండదా అనేది వేరే విషయం. ఇంతకీ సినిమాకి "అమిగోస్" (స్నేహితులు) లాంటి స్పానిష్ టైటిల్ కాకుండా "పొట్లకాయ" అని పెట్టున్నా సరిపోయేదేమో. ఎందుకంటే కథని ఒకచోట పెద్ద మలుపు తిప్పేది పొట్లకాయ కూరే! 

కళ్యాణ్ రామ్ రొటీన్ గా అనిపించాడు. పైగా "బింబిసార" పాత్రలోంచి కళ్యాణ్ రామ్ ఇంకా బయటికొచ్చినట్టు లేడు. అదే తరహా బాడీ లాంగ్వేజ్, అవే చూపులు, బేస్ వాయిస్ పెట్టుకుని సాగదీస్తూ అదే టైపు డైలాగ్ డెలివెరీ! మనస్ఫూర్తిగా తనకష్టాన్ని మెచ్చుకుందామంటే ఈ లోపాలు అడ్డొస్తున్నాయి. "ఎన్నో రాత్రులొస్తాయి కానీ.." పాటలో ఎక్స్ప్రెషన్స్ కూడా తేల్చేసాడు.

ఆశిక రంగనాథ్ బాగుంది. నటన పరంగా కూడా ఉన్నంతలో మంచి ఎక్స్ప్రెషన్స్ తో ఫ్రెష్ గా కనిపించింది. 

బ్రహ్మాజీ ఉన్నా ఒకటి రెండు చోట్లకు మించి అతన్ని ఎక్కువగా వాడుకోలేకపోయాడు దర్శకుడు. తన మీద కామెడీ ట్రాక్ బాగా రాసుకుని ఉన్నా కొన్ని మొమెంట్స్ గుర్తుండేలా ఉండేవి. కళ్యాణ్ రామ్ తండ్రిగా జేపీ ఓకే.

అంచనాలు పెట్టుకుని వెళ్తే తల పట్టుకుని బైటకి రావడం తప్పదు. "బింబిసార" కి కొనసాగింపుగా మరొక కళ్యాణ్ రామ్ సినిమా చూద్దామని వెళ్తే తెర మీద వేరే కథలో కూడా బింబిసారుడినే చూస్తున్నట్టు అనిపించవచ్చు. ప్రతివారం విడుదలైన కొత్త తెలుగు సినిమా చూడాల్సిందే అనుకునే వాళ్లు మాత్రం మరొక అవకాశం లేదు కాబట్టి వెళ్లి చూసిరావొచ్చు. వినోదం కావాలనుకుంటే మాత్రం డోస్ సరిపోక నిట్టూర్చవచ్చు. 

బాటం లైన్: మైల్డ్ డోస్

Show comments