Butta Bomma Review: మూవీ రివ్యూ: బుట్ట బొమ్మ

చిత్రం: బుట్ట బొమ్మ 
రేటింగ్: 2/5
తారాగణం: అనిఖా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట, నవ్య స్వామి తదితరులు
స్క్రీన్ ప్లే- డైలాగ్: గణేష్ రావూరి
సంగీతం: గోపి సుందర్
కెమెరా: వంశీ పచ్చిపులుసు
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాతలు: నాగ వంశి, సాయి సౌజన్య
దర్శకత్వం: శౌరీ చంద్రశేఖర్
విడుదల: ఫిబ్రవరి 4, 2023

మళయాళంలో 2020 లో వచ్చిన "కప్పెల" కి తెలుగు రీమేక్ ఈ "బుట్టబొమ్మ".  అందరూ కొత్త ఆర్టిస్టులతో తీసిన సినిమాయే అయినా సితార బ్యానర్ ఈ సినిమా చేయడంతో కాస్త దృష్టిపడింది. 

కథలోకి వెళ్తే సత్య (అనిఖా) అరకులో నివశించే ఒక మధ్యతరగతి అమ్మాయి. తల్లిదండ్రులకి ఆర్ధిక ఇబ్బందులుంటాయి. అనుకోకుండా ఎవరికో ఫోన్ చేయబోయి రాంగ్ నెంబర్ కొట్టడంవల్ల మురళి (సూర్య వశిష్ట) అనే ఆటో డ్రైవర్ లైన్లోకి వస్తాడు. క్రమంగా ఆమె జీవితంలోకి కూడా ఎంటరౌతాడు. 

మురళి మీద ఇష్టాన్ని పెంచుకున్న సత్య ఇంట్లో చూసిన మంచి సంబంధాన్ని కూడా కాదని వైజాగ్ పారిపోతుంది. అక్కడ అనుకోకుండా ఆర్కె (అర్జున్ దాస్) ఆమెకి అడ్డుపడతాడు. అక్కడి నుంచి నాటకీయ పరిణామాల మధ్య చివరికి ఏమవుతుందో చెప్పే కథే ఈ "బుట్ట బొమ్మ".

సూర్య వశిష్ట పాత్రకు తగ్గట్టుగా ఇన్నోసెంట్ గా కనిపించాడు.

హీరోయిన్ అనిఖా సురేంద్రన్ ఆకట్టుకుంది. కానీ ఆమె క్యారక్టరైజేషన్లో మొదటి సగంలో తెలివైన అమ్మాయిలా కనిపిస్తుంది తప్ప పాత్రకి కావాల్సిన ఇన్నోసెన్స్ కనపడదు. 

నవ్య స్వామి హీరోయిన్ ఫ్రెండ్ గా తొలిసగంలో కాసేపు ఉనికి చాటుకుంది. 

నటుల్లో మార్కులు పడేది మాత్రం అర్జున్ దాస్ కే. ఇతని బేస్ వాయిసే పెద్ద ఎసెట్. ఆ గొంతుకి తగ్గ రూపం, దానికి తగిన పాత్ర పడడంతో ఇతను బాగా రిజిస్టర్ అవుతాడు. 

టెక్నికల్ గా చెప్పుకోవాలంటే ఇందులో కెమెరావర్క్ ఒరిజినల్ కి తీసిపోని విధంగా ఉంది. సంగీతం మాత్రం డల్ గా ఉంది. పాటలు కూడా జస్ట్ ఏవరేజ్. ఎడిటింగ్ షార్ప్ గానే ఉన్నా తొలి సగంలో లాగ్ అనిపించిందంటే సరిపడా సరుకు కథనంలో లేదని అనుకోవాలి. 

ఇక దర్శకత్వం విషయానికొస్తే ఒరిజినల్లో ఉన్న వీక్ పాయింట్స్ ని స్ట్రాంగ్ చేసే పని పెట్టుకోకుండా, ఉన్న స్ట్రాంగ్ ఎలిమెంట్స్ ని వీక్ చేసే విధంగా రీరైట్ చేసుకున్నారు. ముఖ్యంగా సెకండాఫులోని ఒక సన్నివేశంలో హీరోయిన్ బాత్ రూములోంచి గట్టిగా అరవచ్చు కదా అనే డౌట్ ఒరిజినల్ చూసినప్పుడు కూడా కలుగుతుంది. అదే డౌట్ మళ్లీ ఇక్కడ కూడా కలిగిస్తే ఎలా? చేసే మారులేవో ఇంటిలిజెంట్ గా, కన్విన్సింగ్ గా ఇలాంటి చోట చేస్తే బాగుండేది. అలాగే పెద్దగా అవసరంలేని శరీ షాప్ కీపర్ యొక్క తల్లి పాత్రకి ఎక్కువ సీనిచ్చారు. 

ఇక విశ్లేషణలోకి వెళ్తే...షార్ట్ ఫిల్మ్ బాగుందనుకుంటే మొబైల్లో చూసేసి తృప్తి చెందొచ్చు. ఓటీటీలో ఫలానా సినిమా బాగుందన్నప్పుడు చూస్తే నచ్చేయొచ్చు. కానీ ఆ రెండూ థియేటర్ లో చూస్తే నచ్చకపోవచ్చు. సినిమాలకి కూడా స్థానం బలం అనేది ఉంటుందనడానికి ఇదొక నిదర్శనం. 

కప్పెల అనే మలయాళ సినిమా ఓటీటీలో వచ్చి మెప్పు పొందింది. దానికి ముందు కేరళలో థియేటర్స్ లో వచ్చినా దాని ఇంపాక్ట్ ఇతర రాష్ట్రాల వారికి తెలియదు. కరోనా లాక్డౌన్ కాలంలో ఆ చిత్రాన్ని ఓటీటీలో చూసే తీరుబడి తెలుగువాళ్లల్లో కూడా చాలామందికి కలిగింది. ఒక సీరియస్ కథని ఎక్కడా సో కాల్డ్ కమెర్షియల్ హంగుల్లోకి తీసుకెళ్లకుండా రియలిస్టిక్ గా తీసారు మళయాళంలో. నచ్చినవాళ్లకి నచ్చింది. 

ఆ సినిమా రీమేక్ హక్కులు కొని తెలుగులో ఇలా "బొట్టబొమ్మ" అని తీసారు సితార బేనర్ వారు. రీమేక్ చేయడంలో తప్పులేదు. కానీ ప్రధాన తారాగణంలో తెలుగు సినిమాల్లో కనిపించే పాపులర్ మొహాలు కనపడకపోయేసరికి ఇది రీమేక్ లాగ కాకుండా డబ్బింగ్ లాగ అనిపిస్తుంది. ఇంత కష్టపడకుండా డైరెక్ట్ గా డబ్బింగ్ చేసుంటే సరిపోతుంది కదా అనిపించవచ్చు సగటు ప్రేక్షకుడికి. 

అదలా ఉంటే ఇది పూర్తిగా మాతృకకి లోబడి తీసిన సినిమా కాదు. స్క్రీన్ ప్లేలో కొన్ని మార్పులు చేసారు. ఒరిజినల్ కి చేసిన మార్పువల్ల సినిమా మరింత గొప్పగా అనిపించాలి తప్ప ఉన్న సోల్ ని చంపేయకూడదు. ఇక్కడ ఆ పొరపాటే జరిగి సోల్ పక్కకి జరిగిపోయింది. 

"కప్పెల" చూడని వాళ్లకి ప్రధమార్థం చూస్తున్నప్పుడు ఇదొక రాం-కాం ఏమో అనిపించేలాగ సన్నివేశాలు, సంభాషణలు నడిచాయి. ఉన్నంతలో కాస్తంత సటిల్ హ్యూమర్ వగైరాలు జోడించారు. 

బుట్టబొమ్మ టైటిల్ పెట్టినందుకు చాలా కృతకంగా అనిపించే "కృష్ణుడు బొమ్మ దగ్గర బుట్టబొమ్మని పెట్టడం" అనే సన్నివేశాన్ని కల్పించారు. ఒరిజినల్లో లేని పాటలు జోడించారు, కమెర్షియల్ గా ఎంతోకొంత వయబుల్ చెయ్యాలని చాలా పాట్లు పడ్డారు. కానీ దానివల్ల ఫలితం మాత్రం పాజిటివ్ గా రాలేదు. కథలో కాన్ ఫ్లిక్ట్ పాయింటుకొచ్చేవరకు లాగ్ అనిపిస్తుంది.  తీరా ద్వితీయార్థం చూస్తే అదంతా పక్కా డార్క్ సినిమాలాగ చాలా సీరియస్ గా ఉంటుంది. సినిమాని కమెర్షియలైజ్ చేయదలచుకుంటే ఈ కథ సరైనది కాదు. ఆ విషయాన్ని మేకర్స్ గ్రహించకపోవడం ఇక్కడ తొలితప్పు. 

"కప్పెల" చూసిన వారికి నిట్టూర్పు తప్పేలా లేదు. చూడని వాళ్లు కూడా చూడమని నలుగురికి రికమెండ్ చేసేలా లేదు. 

బాటం లైన్: ఓటీటీ బొమ్మ

Show comments