Writer Padmabhushan Review: మూవీ రివ్యూ: రైటర్ పద్మభూషణ్

చిత్రం: రైటర్ పద్మభూషణ్
రేటింగ్: 2.75/5
తారాగణం: సుహాస్, టీనా శిల్పరాజ్, రోహిణి, ఆశిష్ విద్యార్థి, గౌరి ప్రియ, గోపరాజు రమణ తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
కెమెరా: వెంకట్ ఆర్. శాఖమూరి
ఎడిటింగ్: కె. పవన్ కల్యాణ్, సిద్దార్థ్ తాతోలు
నిర్మాతలు: అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహరన్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: షణ్ముఖ ప్రశాంత్
విడుదల: 3 ఫిబ్రవరి 2023

సుహాస్ అనగానే "కలర్ ఫొటో" గుర్తొస్తుంది. అతని సినిమాలో ఏదో ప్రత్యేకత ఉంటుందనేది ఒక అంచనా. "రైటర్ పద్మభూషణ్" పేరుతో రావడం, పేడింగ్ ఆర్టిస్టులు కూడా గుర్తింపున్న నటీనటులు కావడం వల్ల ప్రేక్షకుల దృష్టి దీనిపై పడింది. 

కథలోకి వెళ్దాం. లైబ్రరీలో పనిచేసే  పద్మభూషణ్ అనే యువకుడు ఒక నవల రాస్తాడు. ఇంతకీ అతని తల్లి గృహిణి, తండ్రి ఒక ఆఫీసులో క్లర్క్. ఖర్చులన్నీ పోను నెలకి తన జీతంలో రూ 8000 మిగిలితేనే అదొక ఘనవిజయంగా భావిస్తుంటాడు ఆ తండ్రి. తల్లిదండ్రులకి చెప్పకుండా ఫ్రెండ్ చేత నాలుగు లక్షలు అప్పు చేయించి మరీ తన నవల కాపీలు అచ్చువేసి పుస్తకాల షాపుల్లో పెడతాడు. కానీ ఎవరూ కొనరు. గొప్ప రైటర్ గా పేరు తెచ్చుకోవాలన్న తన కల కలగానే మిగిలిపోతుంటుంది. 

ఇంతలో తన మేనమామ నుంచి తన తల్లిదండ్రులకి ఒక పెళ్లివేడుకకి పిలుపొస్తుంది. ఆ మేనమామ బాగా ధనవంతుడు. కొంతకాలంగా ఆ కుటుంబంతో మాటలు లేకపోయినా ఈ పిలుపుతో మళ్లీ కలుస్తారు. 

అయితే ఆ వేడుకలో ఆ రైటర్ పద్మభూషణ్ కి తన కూతుర్నిచ్చి పెళ్లిచేస్తానని ప్రకటిస్తాడు. అందుకు కారణం తనకి తెలియకుండానే తాను ఫేమస్ రైటరైపోవడం...తన పేరుతో ఎన్నో పుస్తకాలు మార్కెట్లో ఉండడం...ఒక బ్లాగ్ కూడా సక్సెస్ఫుల్ గా నడుస్తుండడం. అతనికి తన మేనమామ కూతురు ఫ్యానైపోతుంది. కనుక పెళ్లి తనతోనే అనుకుంటుంది తాను కూడా. 

ఇంతకీ తన పేరుతో అన్నేసి నవలలు, బ్లాగులో సీరియల్ రాస్తున్నదెవరు? ఒక పక్కన తనది కాని పాపులరిటీని ఎంజాయ్ చేస్తూనే తన పేరుతో రాతలు రాసే ఆ వ్యక్తిని పట్టుకోవడమే హీరో పని. చివరిదాకా ఆ అన్వేషణే. క్లైమాక్స్ లో ఆ వ్యక్తి ఎవరనేది రివీలౌతుంది.  

ఈ కథలో ప్రధానమైన కంప్లైంట్ ఎత్తుకున్న కథాంశమే. ఈ రోజుల్లో నవలా రచయితలకి క్రేజెక్కడుంది? స్మార్ట్ ఫోన్ల యుగంలో లైబ్రరీలో ఉద్యోగం చేసే హీరోనా? ఆ హీరోకి తన కూతుర్నిచ్చి పెళ్లిచేయడానికి ధనికుడైన ఒక వ్యక్తి ఉవ్విళ్ళూరడమా? దానికేదో కారణం చెప్పినా అది అతికించినట్టే ఉంది తప్ప అతికినట్టు లేదు. 

అలాగే బార్బర్ షాపుల్లో పుస్తకాలు, మేగజైన్స్ ఉండే రోజులెప్పటివి? 1990ల్లో ఉండేది అలాగ. 

మొత్తంగా కథ తాలూకూ ఏంబియెన్సే మైనస్. ఇదే కథని 1980ల నేపథ్యంలో పెట్టుంటే కన్విన్సింగ్ గా ఉండేది. కానీ అలా పెట్టడం వల్ల బ్లాగులో తన పేరుతో ఇంకెవరో సీరియల్ రాయడమనే సీన్ కి అడ్డొస్తుందనుకున్నారేమో. అటువంటి క్లాషెస్ ఉంటాయనుకున్నప్పుడు మరోలా సన్నివేశాలు రూపొందించుకోవాలి తప్ప కాంప్రమైజ్ అయిపోవడమో, ఆడియన్స్ ని గ్రాంటెడ్ గా తీసుకోవడమో చేయకూడదు కదా! 

ఈ మైనస్ లు పక్కన పెట్టి, కథలోని భావోద్వేగవిషయాన్ని తీసుకుంటే అది కేవలం క్లైమాక్సులో మాత్రమే పండింది. తక్కిన సినిమా అంతా ఒక రాం-కాం జానర్లో సాగింది. 

సుహాస్ తన నటనతో మెప్పించాడు. పాత్రకు తగ్గట్టుగా ఎక్కడ ఎంత చెయ్యాలో అంత చక్కగా చేసాడు. కృత్రిమత్వం లేకుండా చివరిదాకా మోసాడు. 

హీరోయిన్ టీనా శిల్పరాజ్ పర్వాలేదు. కొన్నిచోట్ల కాస్త ఓవర్ గా అనిపించినా ఓవరాల్ గా ఓకే. మరొక నటి గౌరి ప్రియ చూడ్డానికి బాగుంది. హీరోయిన్ తండ్రి పాత్రలో గోపరాజు రమణ, హీరో తండ్రి పాత్రలో ఆశిష్ విద్యార్థి తమ పని తాము చేసారు. లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తూ రోహిణి బాగా నటించింది. 

శేఖర్ చంద్ర సంగీతాన్ని మాత్రం మెచ్చుకుని తీరాలి. పాటలన్నీ బాగున్నాయి. లిరిక్స్ స్పష్టంగా వినపడ్డాయి. సాహిత్యం రాసిన కవులు కూడా మెప్పుకి అర్హులు. ముఖ్యంగా ఒకపాటలో "తాలింపు- గుర్తింపు- వేధింపు" లాంటి పదాలతో చేసిన ప్రయోగం ఆకట్టుకుంటుంది. 

కెమెరా పనితనం బాగానే ఉంది కానీ గొప్పగా లేదు. మరీ రియలెస్టిక్ గా, ఔట్ డేటెడ్ గా ఉంది. నిడివి 2 గంటలే అయినా, ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉంటే బాగుండేదనిపించందంటే ఇది ఎంత సన్నని ఉల్లిపొర కథో అర్థమవుతుంది. 

తక్కువ బడ్జెట్లో తీసినా ఇలాంటి సినిమాలు ఎంత తోసినా థియేటర్లో కష్టం. ఓటీటీల్లో మాత్రం మంచి పేరు తెచ్చుకుంటాయి. అందుకే ఇలాంటి కథలతో కూడిన మళయాళ సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలోనే విడుదలౌతుంటాయి. బాగున్నాయనిపించుకుంటాయి. కానీ థియేటర్లోకి వచ్చి ఆడకపోవడం వల్ల సక్సెస్ కాని సినిమాగా నెగటివీటిని మూట కట్టుకోవడం తప్ప మరొకటి ఉండదు. అయితే హాల్లో విడుదలైతేనే ఓటీటీ రైట్స్ కొంటామంటే నిర్మాతలు చేయకలిగిందేమీ ఉండదు. 

సినిమా అంటే కేవలం దృశ్యాల కదలిక కాదు. ఒక భావోద్వేగపు ప్రపంచంలో ప్రయాణం చేయించడం. లాజికల్ బ్రెయిన్ ని పని చేయనీయకుండా ఎమోషన్ అనే మేజిక్ లోకి తీసుకువెళ్ళడం. అది ఆద్యంతం ఉంటే గొప్ప సినిమాగా కీర్తి పొందుతుంది, అదే కేవలం క్లైమాక్స్ కి పరిమితమైతే "మంచి సినిమాయేలే" అనిపించుకుంటుంది. క్లైమాక్స్ కారణంగా ఈ చిత్రాన్ని అలాంటి "మంచి సినిమా" కేటగరీలో వేయాల్సొస్తుంది. 

బాటం లైన్: ఓటీటీ పద్మభూషణ్

Show comments