ఎమ్బీయస్‍: సామాన్యుడూ - గ్రీన్ ఛానెలూ

ఇది రాసే సమయానికి తారకరత్న ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. 39 ఏళ్లవాడికి అన్ని సమస్యలుండడం నిజంగా దురదృష్టకరం. అతను త్వరలోనే కోలుకుంటాడని ఆశిస్తూ, ప్రార్థిస్తూ ఆ సందర్భంగా నాకు తట్టిన ఆలోచనపై యీ వ్యాసం రాస్తున్నాను. తారకరత్న కుప్పంలో కుప్పకూలగానే బెంగుళూరు తీసుకెళ్లే ఆలోచన చేశారు. అబ్బే అక్కరలేదు, నారాయణ హృదయాలయ వైద్యులే యిక్కడకు వచ్చారుగా అన్నారు, తర్వాత యిక్కడ చికిత్స సాగదు, బెంగుళూరే అనుకున్నారు. యాంబులెన్స్ ఉన్న హెలికాప్టర్ తెప్పిద్దామంటే దక్షిణాదిన అది లేదు కాబట్టి రోడ్డు మార్గానే తీసుకెళ్లాలి అనుకున్నారు. మామూలు ట్రాఫిక్‌లో వెళితే కాలాతీతం అయిపోవచ్చని గ్రీన్ ఛానెల్‌కై ప్రయత్నించారు. చంద్రబాబు కర్ణాటక సిఎంతో మాట్లాడారు. ఈ తర్జనభర్జనలలో అర్ధరాత్రి అయిపోయింది. అప్పుడు గ్రీన్ ఛానెల్ లోనే రోడ్డు మార్గాన బెంగుళూరు తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు.

కుప్పం నుంచి బెంగుళూరుకు దూరం 150 కి.మీ.ల లోపే కాబట్టి, అర్ధరాత్రి కాబట్టి గ్రీన్ ఛానెల్, అంటే యాంబులెన్స్ వెళ్లడానికి ఏ వాహనమూ అడ్డురాకుండా రోడ్లన్నీ క్లియర్ చేసి వెళ్లనివ్వడమన్నమాట, ఎవర్నీ పెద్దగా యిబ్బంది పెట్టి ఉండదు. మామూలుగా యాంబులెన్స్ అనగానే అందరూ తప్పుకుని, దానికి దారి యివ్వాలి. కానీ ఒక్కోప్పుడు యివ్వడానికి దారి కూడా ఉండదు. పైగా దారిలో అనేక యాంబులెన్సులు తగిలినప్పుడు సరేలే అనే ఉదాసీనత కలుగుతుంది. అందుకని గ్రీన్ ఛానెల్ పెట్టి ఓ వివిఐపి వచ్చినప్పుడు అందర్నీ ఎలా ఆపేస్తారో అలా ఆపేసి, యీ వాహనాన్ని పంపిస్తారు. ఆ సౌకర్యం చాలాచాలా అరుదుగా లభిస్తుంది. అలాటివి రాజకీయనాయకులకే సాధ్యం. 150 కాదు, 350 కి.మీ.లున్నా, అర్ధరాత్రి కాదు, మిట్టమధ్యాహ్నమైనా తమకు, తమవాళ్లకు ఆ సౌకర్యాన్ని కల్పించగలరు.

ఇవాళ చంద్రబాబు కల్పించారని కాదు, ఏడు శాతం ఓట్లున్న పవన్ కళ్యాణ్, ఒక శాతం ఓట్లున్న కాంగ్రెస్ రుద్రరాజు, బిజెపి వీర్రాజు, సిపిఐ రామకృష్ణ, సిపిఎం రాఘవులు కూడా సాధించుకోగలరు. ఇక అధికార పార్టీ ఐన వైసిపి వాళ్లయితే మాయాబజారులో ఘటోత్కచుడు చెప్పినట్లు వాళ్ల బంధుబంధుబంధులకు కూడా కల్పించగలరు. కానీ సామాన్యుడు దీన్ని కలలోనైనా ఊహించగలడా? ప్రాణమనేది ఏ జీవికైనా ఒక్కటే. తారకరత్న జీవితం అతని కుటుంబసభ్యులకు ఎంత ముఖ్యమో, సామాన్యుడి జీవితం అతని కుటుంబానికీ అంత ముఖ్యమే. తారకరత్నకు ఏమైనా అయితే టిడిపిది లోకేశ్ యాత్రపై యాంటీ-సెంటిమెంటు భయం. కానీ సామాన్యుడికి ఏమైనా అయితే రోడ్డు మీద పడే అతని కుటుంబానిది రేపెలా గడుస్తుందాన్న నిత్యభయం. గ్రీన్ ఛానెల్ మాట అటుంచి, తనెక్కిన యాంబులెన్స్‌ రోడ్డు మీద ఏ అడ్డంకులూ లేకుండా తనను ఆస్పత్రికి చేర్పిస్తుందని సామాన్యుడు నమ్మగలడా? ఇరుకు రోడ్ల మీద ఏ పార్టీ బహిరంగసభ పెట్టదనీ, తన వాహనాన్ని సజావుగా వెళ్లినిస్తుందనీ గట్టిగా అనుకోగలడా?

ఆంధ్ర ప్రభుత్వం జీఓ 1 తెచ్చినపుడు యిప్పుడున్న పరిస్థితులలో కాస్త మార్పు రావచ్చని ఆశ పడ్డాను. ఆశ మాత్రమే, కచ్చితంగా యిలాగే జరుగుతుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే పోలీసులు అధికార పార్టీవాళ్లకి ఒకలా, ప్రతిపక్షాలకు మరోలా అమలు చేయవచ్చనే భయం ఉంది. రూల్సు ఎంత పకడ్బందీగా ఉన్నా, దాన్ని పట్టించుకోవలసినది స్థానికంగా ఉన్న పోలీసాధికారి. తాము తెచ్చిన ఆ జీవోను రేపు ప్రతిపక్షంలోకి వెళితే వైసిపియే తప్పు పట్టవచ్చు. ఇవాళ అది పౌరహక్కులకు భంగకరం అని వాదిస్తున్న ప్రతిపక్షం రేపు అధికారంలోకి వస్తే ప్రజాహితం కోసం అది అవసరమే అని వాదించవచ్చు. ఎవర్నీ నమ్మడానికి లేదు. ఎందుకంటే సామాన్యుడి గోడు ఏ పార్టీకీ పట్టదు. ఎంతసేపూ తమ ఆడంబరం, మా వెనక యింతమంది జనం ఉన్నారు అని చూపించుకోవడమే కావాలి.

సభలకు జనం వచ్చినంత మాత్రాన ఓట్లేస్తారా? 2019 ఎన్నికలకు ముందు టిడిపి సభలు జనంతో కళకళలాడ లేదా? ఫలితాల దగ్గరకు వచ్చేసరికి ఏమైంది? నిజంగా ఓట్లేద్దామనుకునే వాళ్లు సభలకు రారు, రానక్కరలేదు. ఎందుకంటే సభలకు వచ్చి వాళ్లు కొత్తగా తెలుసుకోవలసిన పని లేదు. గతంలో అయితే మీడియా యింత లేదు. ఎవరైనా నాయకుడు ఏదైనా చెపితే మర్నాటి పేపర్లో నాలుగు లైన్ల న్యూస్ వచ్చేది. పేపరు మొత్తమే ఆరు పేజీలు. జిల్లా సప్లిమెంటరీలు ఉండేవి కావు. ప్రకటనలు, జాతీయ, అంతర్జాతీయ (అప్పట్లో అవి బాగా యిచ్చేవారు) వార్తలకు చోటు పోగా 23 జిల్లాల వార్తలు కవర్ చేయాలి. అందువలన వార్తలను క్లుప్తంగా యిచ్చేవారు. ఒక సభలో ఐదారుగురు వక్తలు మాట్లాడితే, ఎవరు ముఖ్యమైన పాయింటు చెప్తారో దాన్ని మాత్రం పేర్కొనేవారు. ఆ పేపరు చాలా గ్రామాలకు మర్నాటి సాయంత్రం చేరేది. ఆకాశవాణి వార్తల్లో అయితే బొత్తిగా ఒక్క లైనే చెప్పేవారు. అందువలన నాయకులు ప్రజల్లోకి వెళ్లి మాట్లాడాల్సి వచ్చేది.

ఇప్పుడు పరిస్థితి అలా లేదు. సభ పెట్టనవసరం లేదు. టీవీ స్టూడియోకి వెళ్లి స్టేటుమెంటు యిస్తే చాలు నిమిషాల్లో రాష్ట్రమంతా చేరిపోతోంది. స్టూడియోకి స్వయంగా వెళ్లనక్కరలేకుండా ఫోన్ చేసి చెప్పినా చాలు.  నాయకుడు యింట్లో కూర్చున్నా టీవీల వాళ్లు కెమెరాలు పట్టుకుని వచ్చి మాట్లాడించుకుని టెలికాస్ట్ చేస్తున్నారు. సెల్‌ఫోన్లు వచ్చాక టీవీలతో పని లేకుండా పోయింది. అనుచరుడు సెల్‌ఫోన్లో నాయకుడి సందేశాన్ని రికార్డు చేసేసి క్షణాల్లో వైరల్ చేసేయగలుగుతున్నాడు. నాయకుడు ఏం చెపుతున్నాడో తెలిసిపోయినప్పుడు యిక సభకు ప్రత్యక్షంగా వెళ్లడం దేనికి? అందుకని పార్టీ అభిమానులు తమంతట తాము సభలకు వెళ్లరు. నాయకుడు అక్కడ కొత్తగా చెప్పే విషయ మేముంటుంది? అధికారంలో ఉన్నవాళ్లయితే తాము యింత చేస్తున్నాం, అంత చేస్తున్నాం అని చెప్తారు. ప్రతిపక్షంలో ఉన్నవారైతే అధికారంలో ఉన్నవాళ్లు ఏమీ చేయటం లేదని చెప్తారు. చంద్రబాబుగారైతే ఆ పాయింటుతో పాటు తను హైదరాబాదు ఎలా కట్టారో మళ్లీమళ్లీమళ్లీ చెప్తారు. అవసరమా? నవీన్ పట్నాయక్ రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఆయన గురించి వ్యాసాలు, పుస్తకాలు చదువుతున్నాను. ఆయన ఉపన్యాసం 5, 6 నిమిషాల కంటె ఎక్కువ ఉండదట. అయినకు ఒడియా అంత బాగా రాదు కాబట్టి అనుకోవద్దు. మాటల కంటె చేతలు ముఖ్యమనుకోవడం చేతనే 22 ఏళ్లగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు.

నా చిన్నప్పుడైతే జాతీయ నాయకులకు ఒక గ్లామరుండేది. వాళ్లు ప్రత్యక్షంగా ఎలా ఉంటారో చూడాలనే కుతూహలం ఉండేది. ఎందుకంటే పేపర్లలో వేసే వాళ్ల ఫోటోలు అలుక్కుపోయి ఉండేవి. పేపరు క్వాలిటీ, నలుపుతెలుపుల్లో ప్రింటింగు క్వాలిటీ ఏవీ బాగుండేవి కావు. సినిమాకు ముందు వేసే ఫిల్మ్‌స్ డివిజన్ వారి డాక్యుమెంటరీలలో మాత్రమే వాళ్లు నడుస్తూంటే, మాట్లాడుతూంటే ఎలా ఉంటారో కొద్ది సెకన్లు చూసేవాళ్లం. అందువలన వాళ్లు మన ఊరు వచ్చారంటే పొలొమంటూ వెళ్లి చూసేవాళ్లం. లాల్ బహదూర్ శాస్త్రి గార్ని అలాగే చూశాను. స్వాతంత్ర్యయోధుల చుట్టూ ఉండే ఆరా వేరుగా ఉండేది. వారి పేర్లు పిల్లలకు పెట్టుకునేవారు. తర్వాత్తర్వాత వచ్చిన నాయకులకు అది లేదు. ఇప్పుడెవరూ పిల్లలకు వాళ్ల పేర్లు పెట్టుకోవడం లేదు. వాళ్లను చూడాలన్న తహతహా లేదు. తెల్లవారితే పేపరు యాడ్స్‌లో కనబడుతున్నారు, టీవీల్లో మాట్లాడుతున్నారు, వాట్సాప్‌ల ద్వారా చొరబడుతున్నారు. వీళ్లను చూడడానికి సభల కెందుకు రావాలి?

నా మట్టుకు నేను వందలాది రాజకీయ సభలకు వెళ్లాను. నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో, క్లాక్ టవర్ దగ్గర.. దుమ్ములో, ధూళిలో తోసుకుంటూ, తొక్కుకుంటూ సరిగ్గా కనబడకపోయినా, వినబడకపోయినా వెళ్లేవాణ్ని. మర్నాడు పేపర్లో ఉపన్యాసపాఠం పూర్తిగా వస్తుందన్న నమ్మకం లేదు, సైడ్‌లైట్స్ కవర్ చేస్తారన్న నమ్మకం లేదు, అందుకని! ఇప్పుడు మానేశాను. ఇంట్లో హాయిగా కూర్చుని ప్రసంగం ఆసాంతం టీవీలో స్పష్టంగా చూడగలిగేటప్పుడు, వినగలిగేటప్పుడు అవస్థలు పడడం దేనికి? నాలాగే చాలామంది ఉండివుంటారు. అందుకే సభలలో మధ్యతరగతివాళ్లు, మధ్యవయస్కులు కనబడటం లేదు. తీసుకురాబడిన వాళ్లలో పేదలే కనబడుతున్నారు. తమంతట తాము వచ్చేవాళ్లలో యువకులే ఉంటున్నారు. అదీ సినిమాతారల సభల్లోనే!

ఇప్పటి ప్రజలు చూడాలనుకుంటున్నది ప్రముఖ సినిమా తారలను మాత్రమే. మా చిన్నప్పుడైతే స్టార్లు ఎక్కడో మద్రాసులో మిణుకుమిణుకు మంటూ ఉండేవారు. షూటింగులు కూడా స్టూడియోల్లో జరిగేవి. శతదినోత్సవ సభలకు మాత్రమే తారలు ఊళ్లకు వచ్చేవారు. ప్రజలు గంటల తరబడి వాళ్ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసి, వాళ్లు రాగానే కారు మీద రాళ్లేసేవారు. అది కూడా అభిమాన ప్రకటనే అని కొందరు విశ్లేషించేవారు. క్రమేపీ ఔట్‌డోర్ షూటింగులంటూ నటీనటులు కొన్ని ప్రాంతాల్లో ప్రజల మధ్య కనబడడం మొదలెట్టారు. అక్కడ గ్లామర్ కాస్త తగ్గింది. ఇక రాజకీయ సభలంటూ జనాల్లోకి విస్తారంగా రావడంతో విజిబిలిటీ పెరిగి, మోజు తగ్గనారంభించింది. 1982లో చైతన్యరథంపై ఎన్టీయార్ పర్యటించినప్పుడు పూటల తరబడి ప్రజలు వెయిట్ చేశారు. అధికారంలోకి వచ్చి, తరచుగా కనబడడంతో జనాలు తగ్గారు. 1989 టైములో అయితే మరీ పల్చబడ్డారు.

తెలుగుదేశం పుణ్యమాని సినిమావాళ్లు రాజకీయ సభల్లో పాల్గొనడం పెరిగింది. దానితో పాటు వాళ్లను ప్రత్యక్షంగా చూడాలన్నా ఆతృతా తగ్గింది. ఇటీవలి కాలంలో ఆడియో ఫంక్షన్లనీ, టీజరు విడుదల ఫంక్షననీ, టాక్ షో అనీ, మరోటనీ చెప్పి టీవీలలో వాళ్లు విస్తారంగా కనబడడంతో తెర బయట ఎలా ఉంటారో పూర్తి అవగాహన వచ్చేసింది. మా చిన్నప్పుడు మా ఊరికి చిడతల అప్పారావు వచ్చినా జనం గుమిగూడేవారు. ఇప్పుడు ఓ పాటి హీరో వచ్చినా తలతిప్పి చూడటం లేదు. చాలా పెద్ద హీరోలు మాత్రమే జనాలను ఆకర్షించ గలుగుతున్నారు. వాళ్ల సభలకే జనం స్వచ్ఛందంగా వస్తారు. వాళ్లు చెప్పినవాళ్లకు ఓట్లేస్తారా లేదా అంటే దానికి గ్యారంటీ లేదు. కానీ సభయితే నిండుగా కనబడుతుంది.

ఇలాటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ఎదుర్కుంటున్న సమస్య సభలకు జనాన్ని రప్పించడం ఎలా అని. అందుకని వచ్చినవాళ్లకు బిర్యానీ యిస్తాం, క్వార్టరు యిస్తాం అనే ఆఫర్లు. అలా చెప్పినా వాళ్లంతట వాళ్లు రావటం లేదు. బిర్యానీ యిచ్చినా మాత్రం ట్రక్కులెక్కి, ఎండలో పడి పోవడం, నాయకుడు వచ్చేదాకా కాచుకోవడం, వచ్చినపుడు జయజయధ్వానాలు చేయడం యిదంతా వేస్టు అనుకుంటున్నారు. ఈ రోజుల్లో పేదవర్గాలకు ఏదో రూపేణా డబ్బు అందుతోంది. పెద్ద హీరోల సినిమా ఓపెనింగు రోజున నాలుగు రెట్లు ఎక్కువ పెట్టి టిక్కెట్టు కొనేవారిలో పేదలూ ఉంటున్నారు. వాళ్లు బిర్యానీ కోసం సభలకు వస్తారనుకోవడం భ్రమ. అందువలన వాళ్లను రప్పించే బాధ్యతను స్థానిక నాయకులకు అప్పగిస్తున్నారు. ఇది యిప్పుడే కాదు, ఎప్పుడో ప్రారంభమైంది. ఎవరెంతమందిని తెస్తారో చూదాం అని పందెం పెట్టి ఆ నాయకులకు టార్గెట్లు పెట్టడం, వాళ్లు జనాలను బెదిరించో, ప్రలోభపెట్టో లారీల్లో తీసుకురావడం ఎప్పణ్నుంచో సాగుతున్న వ్యవహారం.

సభ జరుగుతూండగా వక్తలు ‘నేల యీనిందా? ఆకాశం మనుష్యులను వర్షించిందా అనే సందేహం వస్తోంది, యీ జనసందోహాన్ని చూస్తే. లక్షలాదిగా వచ్చిన యీ జనం చూస్తే అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి...’ అంటూ రొడ్డకొట్టుడు ఉపన్యాసం వినిపించేవారు. మా సభకు యిన్ని లక్షల మంది జనం వచ్చారని పార్టీ ప్రతినిథి చెప్పేవాడు. ‘ఆ సభాస్థలి విస్తీర్ణం యింత, మనిషి మీద మనిషి నిలబడినా, అంతమంది పట్టడం అసంభవం’ అని ఎదుటి పార్టీ వాళ్లు, ఆ పార్టీ అంటే గిట్టని పత్రికల వాళ్లు రాసేవారు. సభకు ఎంతమంది వచ్చారనే దానిపై పేచీలు నడిచే రోజుల్లో అస్మదీయులు వేదికపై కెమెరా ఫోకస్ చేసేవారు. శ్రోతల వైపు తిప్పినా క్లోజ్ షాట్స్ తీసేవారు. తస్మదీయులు లాంగ్ షాట్స్ తీసి, మైదానంలో ఖాళీగా ఉన్న ప్రాంతాలను హైలైట్ చేసేవారు.

ఇప్పుడు గ్రాఫిక్స్ రోజులు వచ్చాయి. మార్ఫింగ్, పేస్టింగ్, ఎడిటింగ్ సౌకర్యాలు వచ్చాయి. గుప్పెడు మందిని గంపెడు మందిగా చూపగలుగుతున్నారు. ఎక్కడిదో మీటింగుకి వచ్చిన జనాల్ని యిక్కడున్నట్లుగా అతికించి వీడియోలు తయారు చేస్తున్నారు. గతంలో న్యూస్ ఫోటోగ్రాఫర్లను వినియోగించేవారు. ఈ కొత్త విన్యాసాలకు వారు చాలరని సినీ డైరక్టర్లను పిలుస్తున్నారు. ఎవరు వచ్చినా కొండంత చూపించాలంటే గోరంతైనా అక్కడ ఉండాలి కదా! ఆ గోరంత కోసం కూడా తంటాలు పడాల్సి వస్తోంది. ఒక యిరుకు ప్రదేశంలో అందర్నీ కుక్కి, డ్రోన్ కెమెరాలను ఉపయోగించి షూట్ చేసి జనసముద్రం ఎఫెక్ట్ తెస్తున్నారు. ఇదంతా నేను కందుకూరు సంఘటన గురించి రాస్తున్నానని అనుకోకండి. 8 మంది దుర్మరణంతో అది హైలైట్ అయింది తప్ప యిలాటివి గతంలో అన్ని పార్టీల విషయంలో జరిగాయి. భవిష్యత్తులో కూడా జరుగుతాయి.

కందుకూరు ఘటనలో టిడిపి టిక్కెట్టు ఆశించిన యిద్దరు రియల్ ఎస్టేటు వ్యాపారస్తులు పోటీపడి జనాల్ని సేకరించారని, వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న ఆ రెండు గ్రూపులను క్రౌడ్ ఎఫెక్ట్ కోసం ఒక్కచోటికి చేర్పించడంతో దుర్ఘటన జరిగిందని వార్తలు వచ్చాయి. నిజం కావచ్చు, కాకపోవచ్చు. ఇది కాకపోయినా భవిష్యత్తులోనైనా యిలాటివి, ఏ పార్టీ తరఫు నుంచైనా జరగవచ్చు. అందరినీ ఒక చోట చేర్చిన తర్వాత కెమెరా యాంగిల్ కోసం ట్రక్‌ను వెనక్కి వెళ్లమన్నారట. వాహనం వెనక్కి రావడంతో కంగారు పడిన జనం పరుగులు పెట్టబోయి, ఒకరి మీద మరొకరు పడి గాయపడ్డారట. ట్రక్ వెనక్కి వెళ్లడం కెమెరా యాంగిల్ కోసమే కానక్కరలేదు. ఆంధ్రలో రోడ్లన్నీ గతుకులమయం అని ప్రతిపక్షాల వారే చెపుతున్నారు కదా, ఏ గుంతలోనో పడి బయటకు లాగడంలో జర్కుతో వెనక్కి వచ్చి ఉండవచ్చు. ఇరుకు ప్రాంతంలోకి వెళ్లినపుడు యిలాటివి జరగవచ్చనే స్పృహ నాయకులందరికీ ఉండాలి. గతంలో జగన్ కూడా యిదే మార్గంలో వెళ్లారని టిడిపి ఎత్తి చూపింది.

ఈ పార్టీల వాదాల మాట ఎలా ఉన్నా, ఆ మార్గం ద్వారా ఓ సామాన్యుడు యాంబులెన్స్‌లో వెళ్లాల్సి వస్తే ఎలా అనేదే నా ప్రశ్న. వీడియో బాగా వచ్చిందా లేదా? వచ్చిన జనం ఓట్లేస్తారా? లేదా అన్నదే పార్టీలకు కావాలి. కానీ సామాన్యుడికి కావల్సినది ఊపిరుండగా ఆసుపత్రికి చేరడం. నాయకుడి ఊకదంపుడు ఉపన్యాసం పూర్తయి, వచ్చిన జనాభా తమకు రావల్సినవి చేజిక్కించుకుని అక్కణ్నుంచి కదిలేదాకా యాంబులెన్స్ నిలిపివేస్తే లోపల ఉన్న పేషంటు కుటుంబం ఎంత ఆరాటపడుతుంది? రోగి గుండె ఎంత దడదడలాడుతుంది? జీవో 1 ఏం చెపుతోంది? బహిరంగ సభలను ఏదైనా మైదానంలో పెట్టుకోండి, రోడ్ల మీద వద్దు అంటోంది. దానిలో నాకేమీ తప్పు కనబడటం లేదు. దాన్ని పక్షపాతంతో అమలు చేస్తేనే తప్పు పడతాను.

జీవో 1 పేరు చెప్పి రోడ్డుపై ర్యాలీలు నిషేధిస్తే దాన్నీ తప్పు పడతాను. ర్యాలీలు, ప్రదర్శనలు నిషేధించం అని ప్రభుత్వ న్యాయవాది కోర్టులో స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వ చర్యలను నిరసించాలన్నా ప్రజాసమస్యలను పదిమంది దృష్టికి తీసుకురావాలన్నా ర్యాలీలు అవసరం. వాటిని అనుమతించాలి. అయితే రోడ్డు మొత్తం మూసేయకుండా సగం తెరిచి ఉంచి, పరిమిత దూరం, పరిమిత కాలంలో సాగాలని ఆదేశించాలి. ఓ గంటో, గంటన్నరో ట్రాఫిక్ మెల్లిగా సాగితే ఓర్చుకోవచ్చు. హైవేల మీదుగా ర్యాలీనో, పాదయాత్రో చేసుకోండంటే హాస్యాస్పదంగా ఉంటుంది. ప్రజల దృష్టిని ఆకర్షించాలంటే రోడ్లే గతి. అయితే యిరుకు సందుల ద్వారా కాకుండా, విశాలమైన రోడ్ల ద్వారా యాత్రలు సాగాలి. అప్పుడే రాజకీయ ప్రయోజనం, ప్రజాహితం రెండూ సాధించబడతాయి.

ప్రస్తుత ప్రతిపక్షం యిది గుర్తించకుండా యిది బ్రిటిషు కాలం నాటి చట్టం ప్రకారం చేశారు అనే వాదన చేసింది. చట్టాల్లో 90శాతం అప్పటివేనట. ర్యాలీలు చేసుకోండి, సభలు మాత్రం వద్దు అంటూంటే జీవో కొట్టేయాలి అంటూ ఆదరాబాదరాగా కోర్టుకి వెళ్లడం, వెకేషన్ జజ్ ప్రవర్తనపై హైకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు, మీరేమైనా ర్యాలీ తలపెట్టారా? ప్రభుత్వం నిరాకరించిందా? అని పిటిషనర్‌ను చీఫ్ జస్టిస్ అడగడం.. యివన్నీ చూశాం. లోకేశ్ పాదయాత్రకు పోలీసులు పెట్టిన షరతులు రాక్షసమైనవి అంటూ వాదించేవాళ్లు వినాయక నిమజ్జనం ట్రక్కులకు హైదరాబాదు పోలీసులు పెట్టిన షరతులు చూసి అప్పుడు మాట్లాడాలి. రేపు టిడిపి ప్రభుత్వంలోకి వస్తే యీ రూల్సన్నీ ఎత్తేసి యిష్టం వచ్చినట్లు చేసుకోండి అంటుందనుకుంటున్నారా? ప్రజల ప్రాణాల పట్ల మీకు లక్ష్యం లేదా అని కోర్టు అప్పుడు అక్షింతలు వేయదా?

అధికారం శాశ్వతం కాదు. ఏ రాజకీయ పక్షమైనా సరే, ప్రజాసంక్షేమాన్ని కాపాడే చట్టాన్ని ఆహ్వానించాలి, గౌరవించాలి, చిత్తశుద్ధితో అమలు చేయాలి. రాజకీయపక్షానికి భావప్రకటనా స్వేచ్ఛ నిచ్చిన రాజ్యాంగమే సామాన్యుడికి జీవించే హక్కు కూడా యిచ్చింది. అతడికి గ్రీన్ ఛానెల్ ఎలాగూ దొరకదు. అతను ఆక్రమణలతో, తోపుడుబళ్లతో, అడ్డదిడ్డపు పార్కింగులతో సగం చిక్కిపోయిన మామూలు రోడ్ల మీద నిత్యం వెళ్లవలసినవాడే. జీవితమంతా అలాగే సర్దుకుపోతాడు. ఎప్పుడో ఒఖ్క రోజు అతనికి త్వరగా వెళ్లవలసిన అవసరం పడుతుంది. రైలు మిస్సయినా, విమానం మిస్సయినా, ఆటోలోనే భార్యకు ప్రసవమైనా అతను ఓర్చుకుంటాడు, కష్టనష్టాలను తట్టుకుంటాడు. కానీ యాంబులెన్స్‌లో నిస్సహాయంగా పడి ఉండి, ప్రాణం మిణుకుమిణుకుమంటూ ప్రతి క్షణం విలువైనది అనిపించే సమయంలో రోడ్డు మీద సభ పెట్టి అడ్డుకున్నపుడు అతను పెట్టే శాపాలను యీ పార్టీలు తట్టుకోగలవా?

– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2023)

mbsprasad@gmail.com

Show comments