Waltair Veerayya Review: మూవీ రివ్యూ: వాల్తేర్ వీరయ్య

చిత్రం: వాల్తేర్ వీరయ్య
రేటింగ్: 2.25/5
తారాగణం: చిరంజీవి, రవితేజ, శ్రుతి హాసన్, క్యాథరీన్ థ్రెసా, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, బాబి సింహ తదితరులు 
కెమెరా: ఆర్థర్ విల్సన్
ఎడిటింగ్: నిరంజన్ దేవరమణె
సంగీతం: దేవి శ్రీప్రసాద్
నిర్మాతలు: నవీన్, రవి శంకర్
దర్శకత్వం: కె.ఎస్.రవీంద్ర (బాబీ)
విడుదల: 13 జనవరి 2023

అలుపులేకుండా వరసపెట్టి సినిమాలు చేస్తున్న మెగాస్టార్‌ చిరంజీవి, ధమాకాతో ఈ మధ్యనే హిట్ కొట్టిన రవితేజ కలిసి వాల్తేర్ వీరయ్యతో ముందుకొచ్చారు. మొదటి నుంచి వింటేజ్ చిరంజీవిని చూస్తారు అని చెప్తున్నారు కనుక కొత్తదనం కంటే పాతదనమే ఎక్కువుంటుందని ఆడియన్స్ ని ప్రిపేర్ చేసారు. బాస్ పార్టీ పాట, ట్రైలర్ మొదలైనవి జనంలోకి బాగా వెళ్లడం వల్ల ఎంత వింటేజ్ అని చెప్పినా ఎంతో కొంత కొత్తదనమో, బాగా గ్రిప్పింగ్ గా ఉండే తెలివైన కథనమో ఉంటుందని అంచనాలు పెట్టుకుని ప్రేక్షకులు హాలుకు వెళ్లడం సహజం. ఇంతకీ ఇందులో ఏముందంటే...

సముద్రంలో చేపలు పట్టుకునే గంగపుత్రుడు వీరయ్య. ముఠామేస్త్రి టైపులో అతనికంటూ జాలరిపేటలో ఒక ఫాలోయింగుంటుంది. పైగా అతని మాటంటే భయపడే గూండాలు కూడా ఉంటారు. 

ఇదిలా ఉంటే ఒక అంతర్జాతీయ డాన్ (బాబి సింహ) ని పట్టుకుంటారు రా ఏజెంట్లు. అతను కొంతమంది పోలీసుల్ని చంపి తప్పించుకుంటాడు. అతన్ని మలేషియా వెళ్లి వెతికి పట్టుకోవడానికి ఒక ఇన్స్పెక్టర్ (రాజేంద్ర ప్రసాద్) ఈ వాల్తేర్ వీరయ్య సాయం కోరతాడు. ఇంతకీ వీరయ్య అండ్ కో అతనిని పట్టుకుంటారా? ఆ క్రమంలో వారికి ఎదురైన చాలెంజెస్ ఏవిటి? అది ప్రధాన కథ. ఈ కథలోకి శ్రుతి హాసన్, రవితేజ, ప్రకాష్ రాజ్ ఎలా వస్తారు అనేది ఇక్కడ వివరించట్లేదు. 

చిరంజీవంటే మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్. డ్యాన్సులు, సటిల్ కామెడీ, లైటర్ వీన్ లో సన్నివేశాలు..ఇవన్నీ అలనాటి చిరంజీవి సినిమాల్లో కామన్. ఇప్పుడు అవే పదార్థాలతో ఈ వాల్తేర్ వీరయ్య ని వండారు. అయితే అప్పట్లోలాగ చిరంజీవి సిగ్నేచర్ స్టెప్స్ తో కూడిన కాంప్లికేటెడ్ డ్యాన్సులు వేయలేకపోయినా ఉన్నంతలో తన పద్ధతిలో డ్యాన్సులు చేసే ప్రయత్నమైతే చేస్తున్నారు. అయితే ప్రభుదేవ, రాఘవలారెన్స్ కాలంలో చిరంజీవి నుంచి అద్భుతమైన స్టెప్స్ వచ్చేవి. ఖైది150లో కూడా సింపుల్ బట్ గ్రేస్ఫుల్ స్టెప్స్ కనిపించాయి. కానీ ఇక్కడ ఎందుకో గుర్తుంచుకునేలాంటి స్టెప్స్ పడలేదు. బాస్ పార్టీ సాంగులో కూడా ముఠామేస్త్రి లో "ఈ పేటకు నేనే మేస్త్రి" పాటలోని పాపులర్ స్టెప్పునే మళ్లీ వాడడం జరిగింది. 

అది పక్కన పెడితే ఈ సినిమాకి హైలైట్ మ్యూజిక్. దేవిశ్రీపసాద్ తన ట్యాలెంటంతా ధారపోసాడు. ప్రకాష్ రాజ్ పాత్రకి ఇచ్చిన బీజీయం బాగా ఆకట్టుకుంటుంది. బాస్ పార్టీ, పూనకాలు లోడింగ్ పాటలు పక్కా డ్యాన్స్ నెంబర్స్. అయితే వీటిల్లో లిరిక్స్ స్పష్టంగా వినపడవు. "శ్రీదేవి చిరంజీవి" పాట గుర్తుండేలా హాంట్ చేస్తుంది లిరికల్ గా కూడా. "నీకేమో అందమెక్కువ" మాత్రం తేలిపోయింది. లిరిక్స్ పెద్ద ఆకట్టుకునేలా లేవు.  

కెమెరా వర్క్ చాలా రిచ్ గా ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా పని చేసి ఉండాల్సింది. 2:40 నిమిషాల నిడివిలో కనీసం 10 నిమిషాలైనా తగ్గించి ఉండాల్సింది. 

సంభాషణలు సందర్భోచితంగా బాగున్నాయి. అతిగా పంచ్ డైలాగులు, బిల్డప్ లైన్లు పెట్టలేదు. "డోంట్ ఫియర్, ఐ ఇంటర్ ఫియర్", "వాయిదా..ఫాయిదా" వంటి ప్రాసలు డైలాగుల్లో దొర్లాయి. అయితే రవితేజ ఎందుకో మొదట్లో సీమ యాసలో మాట్లాడి తర్వాత తెలంగాణా మాండలికానికి షిఫ్ట్ అయ్యాడు. ఇదెందుకో అర్థం కాదు. 

అయితే చిరంజీవి పాత్రకి వెర్టిగో పెట్టడం, అలాగే గన్ చూపించగానే భయపడడం లాంటి వీక్నెస్సులు పెట్టి హీరో అనగానే మానవాతీత శక్తి అనిపించకుండా జాగ్రత్తపడ్డాడు దర్శకుడు. ఈ మాత్రం వీక్నెస్సులు లేకపోతే కామన్ మ్యాన్ కి హీరో పాత్రతో ట్రావెల్ చేయడం కష్టం. అయితే ఆ వెర్టిగో అంశాన్ని కథలో కీలకమైన ఎమోషనల్ సీన్లో వాడుకున్న తీరు కూడా బాగుంది. 

ఇంత చెప్పినా మళ్లీ సత్యరాజ్-చిరంజీవి మధ్యన రాసుకున్న మందు తాగే సీన్ నిజంగా మందుకొట్టి రాసుకున్నదా అని అనుమానమొస్తుంది. అంత చిరాకుకా ఉందది. 

ప్రధమార్థమంతా చిరంజీవి మీదే నడిచి ఆసక్తికరమైన ఇంటర్వల్ బ్యాంగ్ తో ముగుస్తుంది. ద్వితీయార్థంలో రవితేజ కలవడంతో కాస్త షేడ్ మారి ఆసక్తికరమైన ట్విస్టులు, వగైరాలు ఉంటాయి. అఫ్కోర్స్ అవి కూడా వింటేజ్ స్టైల్లోనే. 

చిరంజీవి నటన గురించి విమర్శించడానికేం లేదు. తనదైన శైలిలో, ఫ్యాన్స్ తననుంచి ఏది ఆశిస్తారో అది ఇచ్చినట్టుంది. చిరంజీవి సోషల్ మీడియాలో వైరల్ అయిన "జంబలకిడి జారు మిటాయ", ఫ్రస్ట్రేటడ్ జర్నలిస్టు" డైలాగ్ తన స్టైల్లో పర్ఫార్మ్ చేయడం బాగుంది. 

శ్రుతి హాసన్ కూడా డబుల్ షేడ్ లో బాగా చేసింది. శ్రుతి పాత్రలోని సర్ప్రైజ్ ఎలిమెంట్ ని "క్రాక్" లో గోపీచంద్ మలినేని ఎలా ఆవిష్కరించాడో ఇక్కడ దర్శకుడు బాబీకూడా అలాగే ఆవిష్కరించాడు. 

రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ పాత్రలు ఓకే. సత్యరాజ్ గెస్ట్ పాత్రలో కాసేపు కనిపించాడు. ప్రకాష్ రాజ్ విలనీ మాత్రం బాగానే పండించాడు. బాబీ సింహా తొలి సగంలో పర్వాలేదనిపిస్తాడు. జాన్ విజయ్, రాజేంద్రన్ కూడా కాస్త స్క్రీన్ ప్రెజెన్స్ పొందారు. ఊర్వశి రౌతేలా ఐటం సాంగ్ కి ప‌రిమితం. వీళ్లు కాక ఈ సినిమాలో సుబ్బరాజు, ప్రభాస్ శీను, నాజర్, శ్రీనివాసరెడ్డి, శకలక శంకర్, ప్రదీప్ రావత్, సప్తగిరి, కమెడియన్ ప్రవీణ్ తదితరులు ఎందరో ఉన్నారు. కానీ ఎవ్వరినీ సరిగ్గా వాడలేదు. మరీ జూనియర్, ప్యాడింగ్ ఆర్టిస్టులకన్నా దారుణంగా ఉంది వీరి పరిస్థితి. 

కథనం మొత్తాన్ని హీరో సెంట్రిక్ గా నడపడం తప్పులేదు. కానీ సీన్లన్నీ హీరో సెంట్రిక్ అనుకుంటే ఏ ఇతర ఆర్టిస్టుకి మాత్రం న్యాయం జరుగుతుంది? కమెడియన్స్ ని కామెడీ చెయ్యనీయకుండా అంతా చిరంజీవి భుజాలపైనే వేసేయడం సరైన పని కాదు. మిగిలిన నటులకి ప్రాధాన్యమిచ్చినంత మాత్రాన చిరంజీవి స్టార్ ఇమేజేమీ తగ్గిపోదు. 

రవిజేజ పాత్ర సెకండాఫులో వచ్చి క్లైమాక్స్ ముందు వరకు ఉంటుంది. ఆమె భార్యగా క్యాథెరీన్ కాసేపు కనిపిస్తుంది. బ్రదర్ సెంటిమెంటుని చివర్లో బాగానే నడిపారు. 

తలలు నరకడాలు గట్రా ఉన్నా కూడా సినిమాని లైటర్ వీన్లో డీల్ చేయడం వల్ల అవి మరీ ఘోరంగా అనిపించలేదు. పండగ సీజన్లో టైం పాస్ చేయడానికి "వాల్తేర్ వీరయ్య" ఓకే. అయితే అలనాటి చిరంజీవిని చూడడానికి ఆసక్తున్నవారికి తప్ప అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోవచ్చు. 

బాటం లైన్: అలనాటి చిరంజీవి

Show comments