క‌రోనా క‌ట్ట‌డికి ఆ మార్గ‌మే శ‌ర‌ణ్య‌మా?

క‌రోనా క‌ట్ట‌డికి కేర‌ళ మార్గ‌మా శ‌ర‌ణ్య‌మా? అంటే... ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. కేర‌ళ‌ల‌లో సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తూ ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి పినరయి విజయన్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. 

కేర‌ళ‌ల‌లో నిన్న ఒక్క‌రోజే 41,953 కొత్త కేసులు న‌మోదు కావ‌డం, 58 మంది మృత్యువాత ప‌డ్డారు. దీంతో మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి లాక్‌డౌన్ త‌ప్ప మ‌రో ప్ర‌త్యామ్నాయ మార్గ‌మే లేద‌ని ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ భావించారు.

ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను అందుకు స‌మాయ‌త్తం చేసేందుకు రెండు రోజులు ముందుగానే అప్ర‌మ‌త్తం చేశారు. ఈ నెల 8న ఉద‌యం 6 గంట‌ల నుంచి 16వ తేదీ వ‌ర‌కు సంపూర్ణ లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి కీల‌క స‌మాచారాన్ని వెల్ల‌డించారు. 

కేవ‌లం అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు మాత్ర‌మే లాక్‌డౌన్ నుంచి మిన‌హాయింపు ఇవ్వ‌నున్న‌ట్టు సీఎం స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసి, తిరిగి వామ‌ప‌క్షాల నేతృత్వంలోని పిన‌ర‌యి ప్ర‌భుత్వం అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉండ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా సంపూర్ణ లాక్‌డౌన్ త‌ప్ప‌దా... అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ప్ర‌తి రోజూ 20 వేల‌కు త‌క్కువ కాకుండా కొత్త కేసుల‌తో పాటు 50-60 మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. దీంతో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మై నిన్న‌టి నుంచి మ‌ధ్యాహ్నం నుంచి లాక్‌డౌన్ విధిస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

మొద‌టి రోజు ప‌క్కాగా లాక్‌డౌన్ నిబంధ‌న‌లు అమ‌ల‌య్యాయి. రెండోరోజూ కూడా మ‌ధ్నాహ్నం త‌ర్వాత ఏపీలో క‌ర్ఫ్యూ వాతా వ‌రణం త‌ల‌పిస్తోంది. మ‌రోవైపు థ‌ర్డ్ వేవ్ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో క‌రోనా ఉధృతి మ‌రింత పెరుగుతుంద‌ని వార్త‌లు వ‌స్తుండ‌డంతో , క‌ట్ట‌డికి కొన్ని రోజులు సంపూర్ణ లాక్‌డౌన్ విధించ‌క త‌ప్ప‌దేమో అనే చ‌ర్చ జ‌రుగుతోంది. 

ఏది ఏమైనా ప్ర‌జ‌ల ప్రాణాల కంటే మ‌రేది ముఖ్యం కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రానున్న రోజుల్లో జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని అధికార పార్టీ నేత‌లు, ఉన్న‌తాధికారులు చెబుతున్నారు. 

Show comments