జగన్‌ - పీకే, చంద్రబాబు - ఆ 'ఇద్దరు'

రాజకీయాల్లో గెలుపోటములే ముఖ్యం ఇప్పుడు ఎవరికైనా. గెలవడం కోసం ఏం చేయడానికైనా వెనుకాడని నాయకులు, పార్టీలు తయారవడం ప్రస్తుత ప్రజాస్వామ్య 'మౌళిక' సూత్రంగా మారిపోయింది. నేరస్తులు, వ్యాపారుస్తులు తప్ప, రాజకీయాల్లోకి 'స్వచ్ఛమైన' మనసున్నవారికి చోటు లేకుండా పోతోందిప్పుడు. అలాగని, రాజకీయం అంతా అలాగే వుందని అనుకోవడం సబబు కాదేమో. చాలావరకు రాజకీయం ఇలాగే వుందన్నది మాత్రం నిర్వివాదాంశం. నూటికో కోటికో ఒక్కడు మంచోడు కనిపిస్తున్నాడు ప్రస్తుత రాజకీయాల్లో.

ఇక, అసలు విషయానికొస్తే, గెలుపోటములే ముఖ్యం గనుక, రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలవడం కోసం 'సలహాదారుల్ని' ఆశ్రయించక తప్పడంలేదు. ప్రశాంత్‌ కిషోర్‌.. దేశవ్యాప్తంగా మార్మోగిపోతున్న పేరు ఇది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్రమోడీకి, సలహాదారుగా పనిచేశారు ప్రశాంత్‌ కిషోర్‌. ఆ తర్వాత బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ కోసం పనిచేశారు. ఆ రెండూ సూపర్‌ హిట్స్‌ ఇచ్చాయి ఆయనకి. అయితే, మొన్నీమధ్యన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో మాత్రం ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహాలు పనిచేయలేదు.

రాజకీయం అంటేనే అంత.. ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించినా, అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలే. ఇప్పుడు, ప్రశాంత్‌ కిషోర్‌ - వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి సలహాదారుగా మారారు. 2019 ఎన్నికల్లో ఏం జరుగుతుంది.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. కానీ, ప్రశాంత్‌ కిషోర్‌ ఎంట్రీతో, తెలుగుదేశం పార్టీలో గుబులు బయల్దేరింది. సలహాదారుని నియమించుకునే దుస్థితికి వైఎస్సార్సీపీ చేరిపోయిందంటూ టీడీపీ నేతలు అర్థం పర్థం లేని వెటకారాలు మొదలు పెట్టారు. 

నిజానికి, ఈ సలహాదారులన్న వ్యవహారం ఇప్పుడు కొత్తగా తెరపైకొచ్చిందేమీ కాదు. తెలుగుదేశం పార్టీకీ ఇద్దరు సలహాదారులున్నారు. 'ఆ రెండు మీడియా సంస్థల అధిపతులే' ఆ సలహాదారులు. ఆ ఇద్దరూ ఇచ్చే సలహాల్ని చంద్రబాబు తు.చ. తప్పకుండా పాటించేస్తుంటారంతే. రాజకీయంగా చంద్రబాబుని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం మాటేమోగానీ, ఆయన్ని మేగ్జిమమ్‌ భ్రష్టు పట్టించేశారు ఆ ఇద్దరూ. ఇది జగమెరిగిన సత్యం.  Readmore!

టీడీపీలో చిచ్చు రాజేసినా, ఇతర పార్టీల్లోని నేతల్లో అభద్రతా భావం తీసుకొచ్చినా.. అదంతా ఆ 'రెండు మీడియా సంస్థల'కే చెల్లుతుంది. చంద్రబాబు ఆలోచనల్ని ఆ రెండు మీడియా సంస్థలు అమలు చేయడం, తమ ఆలోచనల్ని చంద్రబాబు మీద బలవంతంగా రుద్ది, ఆయన్ని అడ్డదారిలోకి తోసెయ్యడం.. ఇది చాలాకాలంగా జరుగుతున్న తంతు.. అన్నది తెలుగు నాట ప్రతి ఒక్కరికీ అనుభవమే. 

ఎన్నో ఏళ్ళుగా చంద్రబాబు ఆ 'ఇద్దర్నీ' సలహాదారులుగా కొనసాగిస్తున్నప్పుడు, కోట్లు.. వందల కోట్లు.. వేల కోట్లు ఆ ఇద్దరికీ లబ్ది చేకూర్చుతున్నప్పుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఎందుకు సలహాదారుని, వ్యూహకర్తని నియమించుకోకూడదట.? నరేంద్రమోడీ అసమర్థుడయ్యే, ప్రశాంత్‌ కిషోర్‌ని గతంలో వ్యూహకర్తగా సలహాదారుగా నియమించుకున్నారా.? ఇప్పుడు జగన్‌ - పీకే కారణంగా అసమర్థుడయితే, అప్పుడు నరేంద్రమోడీ కూడా అసమర్థుడని టీడీపీ ఒప్పుకోగలదా.? 

సలహాదారులు కావొచ్చు, వ్యూహకర్తలు కావొచ్చు.. వెన్నుదన్నుగా నిలిచేవారు కావొచ్చు.. ఎవరైనాసరే, ఏ పార్టీకి అయినా సలహాలు మాత్రమే ఇవ్వగలరు.. వ్యూహాలు మాత్రమే రచించగలరు.. అలాగని, వాళ్ళెవరూ ఓటర్లపై ప్రభావం చూపలేరు. ఇది ప్రజాస్వామ్యం. ఐదేళ్ళూ నానా కష్టాలూ పడి భరించినా, ఐదేళ్ళకోసారి వచ్చే ఎన్నికల్లో ఏం చెయ్యాలనుకుంటారో, ప్రజలు అదే చేస్తారు.. పదేళ్ళ పాటు ప్రతిపక్షంలో వున్న చంద్రబాబు ఆ విషయాన్ని మర్చిపోతే ఎలా.?

Show comments