దాసరికి అనారోగ్యం.. పరిస్థితి ఆందోళనకరం.?

దర్శకరత్న దాసరి నారాయణరావు మళ్ళీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. వారం రోజుల క్రిందటే ఆయన హైద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చేరారనీ, నాలుగు రోజుల క్రితం ఆయనకు శస్త్ర చికిత్స జరిగిందనీ తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా వుందట. 

ఇంతకీ, దాసరి నారాయణరావుకి ఏమయ్యింది.? ఐదు నెలల కాలంలో దాసరికి రెండు సార్లు శస్త్ర చికిత్స ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది.? ఈ ప్రశ్నలిప్పుడు ఆయన అభిమానుల్ని, తెలుగు సినీ పరిశ్రమను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గతంలో దాసరి అన్నవాహికకు శస్త్ర చికిత్స నిర్వహించి, స్టెంట్‌ వేసినట్లుగా ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించిన కిమ్స్‌ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా అప్పట్లో దాసరికి శస్త్ర చికిత్స నిర్వహించాల్సి వచ్చింది. 

తాజాగా మరోమారు ఇన్‌ఫెక్షన్‌ తిరగబెట్టడంతో దాసరిని ఆసుపత్రిలో చేర్చారు. కిడ్నీ, లివర్‌, లంగ్స్‌ తదితర అవయవాలు సైతం దాసరిని ఇబ్బంది పెడుతున్నాయి. అధిక రక్తపోటుతో దాసరి బాధపడుతున్నారు. ఈ కారణంగానే దాసరి పరిస్థితి ఆందోళనకరంగా వున్నట్లు తెలుస్తోంది. 

తీవ్ర అనారోగ్యంతో దాదాపు మూడు నెలలపాటు ఆసుపత్రిలోనే వుండిపోయిన దాసరి, ఆ తర్వాత ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకుని, మొన్నీమధ్యనే తన పుట్టినరోజు వేడుకల్లో ఉత్సాహంగా కన్పించారు. ఇంతలోనే మళ్ళీ ఇప్పుడు ఇంకోసరి దాసరి అనారోగ్యానికి గురవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సినీ ప్రముఖులు.

Show comments