నమ్మినోడిని ముంచేస్తున్న ‘స్టార్లు’

నాన్నా.. పులి కథ అందరికీ తెలిసే ఉంటుంది.

పిల్లవాడు తొలిసారి ‘‘నాన్నా.. పులి వచ్చింది’’ అంటే.. తండ్రి గాబరాగా పరిగెత్తుకొస్తాడు.

రెండోసారి కూడా అబద్దమే చెప్పి పులి వచ్చిందంటే.. తండ్రి అంతే వేగంగా వస్తాడు.

మూడోసారి నిజంగానే పులి వచ్చినా, పిల్లాడు అరిచినా, తండ్రి పట్టించుకోడు!

ఈ నీతిచంద్రికను సినీస్టార్లు తెలుసుకుంటే మంచింది. లేకపోతే చివరకు వీళ్ల పరిస్థితి కూడా కథలో పిల్లాడి లాగా తయారవుతుంది!

మొన్న పవన్ కల్యాణ్, నిన్న మహేశ్ బాబు, ఇప్పుడు రజనీకాంత్... మూడు సినిమాలు, ఒకే కాన్సెప్ట్, ఒకే హైప్, ఒకే రిజల్ట్... మూడు సినిమాలూ అందులోని హీరోల మీద ఆధారపడినవే, మూడింటిలోనూ ఒకే తరహా మిస్టేక్, మూడు సినిమాలతోనూ లాభపడింది హీరోలు, నిర్మాతలే, ఆ మూడు సినిమాలతో నిరాశ పడింది అభిమానులు, ప్రేక్షకులే.. మునిగింది డిస్ట్రిబ్యూటర్లే! ఇక్కడ మిగిలిన వాళ్లతో పనిలేదు కానీ.. డిస్ట్రిబ్యూటర్లు మాత్రం చాలా ముఖ్యం. ఎందుకంటే వారు పైన పేర్కొన్న కథలో ‘తండ్రి’ లాంటి వారు, హీరోలు ఆ ‘పిల్లాడి’ లాంటివాళ్లు! ఎక్కువసార్లు.. తండ్రికి అబద్ధం చెబితే, స్టార్ల హీరోయిజం కూడా వారిని రక్షించలేదు!

‘అసంబద్ధ ప్రచారం మీద ఆధారపడ్డ ఒక అబద్ధపు ప్రపంచంలో బతుకున్నారు..’ స్టార్ హీరోల గురించి సూటిగా చెప్పదగ్గ మాట ఇది! వారసత్వాలతో ‘హీరో’లపై పోయి.. రకరకాల లెక్కలతో ‘స్టార్లు’ అయిపోయి.. తమ భ్రమల ప్రపంచంలో తాము బతుకుతూ, క్రేజ్‌ను ఖర్చు పెట్టుకుని కోట్లు సంపాదించుకొంటూ, నమ్మి పెట్టుబడులను పెట్టిన వారి పుట్టిని మాత్రం నిండా ముంచేస్తున్నారు! పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, ప్రిన్స్ మహేశ్ బాబు, సూపర్‌స్టార్ రజనీకాంత్.. ఎవరైతేనేం, వీరి చుట్టూ ఉన్నదొక విషవలయం! అభిమానగణముందని, అంతులేని క్రేజ్ కలిగి ఉన్నారని, మాయ చేయడానికి వాళ్లు మాత్రమే చాలనే మాటలు, అబద్ధపు అంచనాలు.. ఈ వలయాన్ని పన్నాయి! ఆ వలయంలో చిక్కుకుని ఇప్పుడు చిత్రసీమ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆ హీరోలు ఆనందంగానే ఉన్నా, వారి అభిమానులకూ పెద్దగా నొప్పి లేకపోయినా.. ఈ హీరోల ఫేక్ పబ్లిసిటీని నమ్మి పెట్టుబడులు పెట్టిన వారి జీవితంలో మిగిలిన చీకటి.. ఈ హీరోల చుట్టూ ఉన్నది ఎంతటి ప్రమాదకరమైన వలయమో అర్థం అయ్యేలా చేస్తోంది! 

ఇలాంటి వలయంలో అనేక మంది చిక్కుకోవడానికి కారణం కూడా నిస్సందేహంగా ఈ హీరోలే. వారిది.. బాధ్యతా రాహిత్యమే! పాతిక వేల రూపాయలు జీతం తీసుకునే చిరుద్యోగి తన విధి నిర్వహణ విషయంలో సవాలక్ష విషయాలకు బాధ్యత వహించాలి.. మరి కొన్ని నెలల వ్యవధిలో వందకోట్ల రూపాయలతో ముడిపడిన ఒక సినిమా విషయంలో హీరోల బాధ్యత ఎంత ఉండాలి? తమ సినిమా హిట్టుకు సర్వం తామే అనుకునే ఈ హీరోలు.. అవి ఫెయిలయితే దానికి బాధ్యులు కారా? ‘‘ఏం వారు కావాలని ప్లాపులు తీయరు కదా..?’ అనే ప్రశ్నను ఇక్కడ వేయవచ్చు. అయితే ప్రస్తుత ట్రెండ్‌లో స్టార్ హీరోల పరిస్థితిని చూస్తుంటే.. తామేం చేసినా చెల్లుబాటు అవుతుందనే భ్రమలో వారు బతుకుతున్నారని మాత్రం స్పష్టం అవుతోంది. చుట్టూ ఉన్న వాళ్లు వీళ్లను పొగడటం, మీడియా కూడా విపరీతమై హైప్‌ను పెంచేయడంతో స్టార్ హీరోలు తెలిసి కూడా తప్పులు చేస్తూ.. ఆ తప్పులు చేయడమే తమ స్టార్ స్టేటస్ అనుకునే దగ్గరకు వచ్చారు!

వరసగా రెండు హిట్లను సొంతం చేసుకున్న కుర్ర హీరోలు మాస్ ఇమేజ్ కోసం తపిస్తారు, రెండు సినిమాలు హిట్టైతే వాటిల్లో నటించిన హీరోయిన్ తన రెమ్యూనరేషన్ పెంచేస్తుంది.. అదేమంటే, తమకున్న డిమాండ్‌ను వాళ్లు క్యాష్ చేసుకోవడం అంటారు. ఇదే లెక్కన, తమకంటూ అభిమానుల రూపంలో స్ట్రాంగ్ బేస్ ఉందనే భావన కలిగిన హీరోలు తామేం చేసినా చెల్లుబాటవుతుంది.. అనే భావనలోకి వచ్చేశారంతే! తాము కనిపిస్తే చాలా టికెట్లు తెగుతాయి.. తోచినట్టుగా ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకుందాం.. అనే దగ్గరకు వచ్చారంతే!

హీరోలు కాదు... వీళ్లు జస్ట్ వ్యాపారులు!

నిర్మాతలు రావాలి.. కథలు ఎంపిక చేయాలి.. డబ్బులు పెట్టాలి.. సినిమా బాగా తీయాలి.. వాటిని చూసి కాసులు రాలాలి.. రెమ్యూనరేషన్ ఇచ్చిన నిర్మాతకు లాభాలు రావాలి.. హిట్టు కొట్టాడనే ట్యాగ్ హీరోకి దక్కాలి.. అనే లైన్ ఏదీ లేదిప్పుడు! సినిమా తీస్తున్నామని ప్రకటిస్తారు.. నిర్మాతగా ఒక డమ్మీని పెడతారు, వందకోట్ల వసూళ్లే టార్గెట్ అంటారు. డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఆ సొమ్ములు సేకరిస్తారు. హీరో వాటా హీరోకి వెళుతుంది. మిగిలినది నిర్మాతకు లాభం! తోచినట్టుగా సినిమాను తీసేస్తారు... ఇక హైప్ పెంచడాన్ని మీడియా బాధ్యతగా తీసుకుంటుంది. దీన్నంతా చూసి కోట్ల రూపాయలు పెట్టిన డిస్ట్రిబ్యూటర్లు పొంగిపోవడం.. తీరా సినిమా రిలీజై నెగిటివ్ టాక్ వచ్చిందంటే మునిగిపోయేది స్థాయికి మించి పెట్టుబడులు పెట్టిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబీటర్లు మాత్రమే! 

హీరో సేఫ్, నిర్మాత ఖుష్. సినిమా విషయంలో ఎవరికైతే ఎక్కువ బాధ్యత ఉండాలో.., వారికే దాని ఫలితంతో సంబంధం లేకుండా పోతే, మంచి సినిమాలు ఎలా వస్తాయి? అనేది బేసిక్ లాజిక్. సినిమాకు సైన్ చేస్తే చాలు ఒళ్లో కోట్లు వచ్చిపడుతుంటే.. హీరోలైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని ఎందుకు పని చేస్తారు? ఈజీ మనీకి అలవాటు పడిన వారి నుంచి ఏదో గొప్ప సినిమాను ఎలా ఎక్స్‌పెక్ట్ చేయాలి?

సినిమాకు కొబ్బరి కాయ కొట్టడానికి ముందే తన వాటాను తాను దక్కించుకున్న హీరో హ్యాపీ, విడుదలకు ముందే.. సినిమా ప్రదర్శన హక్కులను ఫ్యాన్సీ రేట్లకు అమ్మేసుకున్న నిర్మాత కూడా హ్యాపీ, అయితే చేసిన చెత్త పనికి ఎవరో ఒకరు బాధితుడు కావాలి కదా.. ఆ బాధ్యత మొత్తం డిస్ట్రిబ్యూటర్ మీద పడుతోంది! ఈ ప్రక్రియలో హీరోలు, నిర్మాతలు కేవలం జస్ట్ వ్యాపారులు. వారికున్న క్రేజ్ కోట్లు సంపాదించుకోవడానికి ఒక మార్గం అయ్యింది. 

ఎవరికో పుట్టిన బిడ్డ వెక్కివెక్కి ఏడుస్తోంది!

‘సర్దార్ గబ్బర్‌సింగ్’ ‘బ్మ్రెత్సవం’ ‘కబాలి’ ఈ సీరిస్‌ను చూస్తే ఈ పరిస్థితి సులభంగా అర్థం అవుతుంది. ఈ సినిమాలతో జరిగింది కేవలం వ్యాపారం.. వందల కోట్ల రూపాయలు చేతులు మారింది, లాభపడింది వీటి హీరోలు, నిర్మాతలు.. వారి లాభం మాత్రం నమ్ముకున్న వారికి శాపంగా మారింది! తమ సినిమాలు అభిమానులను కూడా అలరించడం లేదు, తమను నమ్మి పెట్టుబడులు పెట్టిన పంపిణీదారులను నిండా ముంచేశాం.. అనే గిల్టీ ఫీలింగ్‌పై మూడు సినిమా హీరోల్లో ఎవరిలోనూ కనిపించడం లేదు. తమ సినిమాను కొన్న వాళ్లే విలవిలలాడుతున్నారు.. అనే భావన లేదు వాళ్లకు! ఎవరికో పుట్టిన బిడ్డ వెక్కి వెక్కి ఏడుస్తోంది అన్నట్టుగా మారింది పరిస్థితి! 

తాము హీరోలుగా నటించిన సినిమాలతో అంతమంది మునిగిపోతుంటే.. సదరు  హీరోలు స్టార్లు ఎలా అవుతారు? అనే సందేహం రాకమానదిక్కడ! ‘కబాలి’ ఫలితంపై రజనీసార్ హ్యాపీగా ఉన్నాడని ఆ సినిమా దర్వకుడు రంజిత్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.. మరి ఆయనేదేం పోయింది, వచ్చే డబ్బులు సినిమా ప్రకటన రోజే వచ్చింది. ఆ డబ్బులిచ్చిన నిర్మాతకూ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా వచ్చిన డబ్బుతో గిట్టుబాటు అయ్యింది. అలా పెట్టిన వారు కదా.. మునిగేది! ఆ సినిమా ఫలితంతో రజనీకాంత్‌కు నొప్పి ఏముంటుంది? ఓవరాల్‌గా అందరు స్టార్ హీరోలదీ ఇదే పరిస్థితి ఇప్పుడు. సినిమా ఫలితాలలో హీరోలకు సంబంధం లేదు! 

దైవాంశ సంభూతులమనుకుంటున్నారు! 

పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, రజనీకాంత్.. ఈ మధ్య తీసిన సినిమాల విషయంలో ఈ ముగ్గురు హీరోల తీరును గమనిస్తే.. అన్నికోట్ల పెట్టుబడి పెట్టి చేస్తున్న పని పట్ల ఏ మాత్రం సీరియస్ కనిపించలేదు. అందుకు కారణం ఏమిటంటే.. తామేదో హిట్టు ఫార్ములాను పట్టేశామని వారు భావించడమే. ముందుగా పవన్ కల్యాణ్ సినిమా రూపొందిన తీరును గమనిస్తే.. మేకింగ్‌కు చాలా సమయమే తీసుకున్నారు. అయితే.. అందులో ‘మేకింగ్’ జరిగినది మాత్రం అతి తక్కువ సమయమే! దర్శకులు మారారు.. కథ మారిపోయింది.. సీన్లు మారిపోయాయి.. పుణ్యకాలం కాస్తా పూర్తి అయ్యాకా మూడు కెమెరాలు పెట్టి సినిమాను చుట్టేశారు! సినిమా కాస్తా ఫట్ మంది. బహుశా తను ఎంత సిల్లీకి నటిస్తే సినిమా అంత హిట్టు అవుతుందని పవన్ భావించి ఉండవచ్చు. 

గబ్బర్‌సింగ్ కన్నా సిల్లీగా చేస్తే.. దాని సీక్వెల్ పార్ట్ హిట్టవుతుంది.. అంతకు మించి కథ, కథనాలు అవసరం లేదని పవన్ లెక్క కావొచ్చు. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ సినిమాను చూసిన విశ్లేషకుడికి ఇదే అభిప్రాయం కలుగుతుంది. ఇక మహేశ్ బాబు.. తను అందంగా కనిపిస్తే చాలు.. తనంటే పడి చస్తున్నట్టుగా నాలుగురమ్మాయిలను తెరపై చూపితే చాలు.. సినిమా హిట్టే అనే భ్రమలో ఉన్నాడేందుకు రుజువు ‘బ్మ్రెత్సవం’. రజనీ సార్ సంగతి సరేసరి.. తను గడ్డం పెంచి కొత్తలుక్‌లో కనిపించినా, వంకరగా మెట్లు దిగినా, వికట్టహాసం చేస్తూ నాలుగు షాట్లు తీసుకొంటే చాలు సినిమాకు బ్రహ్మాండమైన వసూళ్లొస్తాయనే భావన ఆయనది! వీరి ఈ ఆలోచనల పుణ్యమే ఈ ఏడాది మూడు డిజాస్టర్లు వచ్చాయి!

అంటే ఇక్కడ వీరు రెండు రకాలుగా దోషులు. ఒకటి సినిమాను ఫక్తు వ్యాపారంగా మార్చడం, అలా మార్చిన తర్వాత తాము సంపాదించుకుంటున్న సొమ్ముకు సరైన ఔట్‌పుట్ ఇవ్వకపోవడం. తమను తాము దైవాంశం సంభూతులుగా భావించేసుకోవడం, చుట్టూ ఉన్న వాళ్లు వీళ్లను దేవుళ్లనేయడంతో వీరు పక్కా స్వార్థపూరితంగా వ్యవహరిస్తూ కూడా  స్టార్లుగా వెలుగొందుతున్నారు. 

మారిన ట్రెండులో డిస్ట్రిబ్యూటర్లు బాధితులు!

పాతతరం నటులను కదలిస్తే.. తాము ఎన్నో హిట్టు సినిమాల్లో నటించినా పారితోషకం సరిగా అందలేదంటుంటారు. కష్ణా లాంటి హీరో రెమ్యూనరేషన్‌ను పట్టించుకోకుండా సినిమాను చేస్తాడనే పేరును కలిగి ఉన్నారు. ఇక ఆ తర్వాత మారిన ట్రెండులో నిర్మాత నలిగిపోతున్నాడన్నారు. తారల రెమ్యూనరేషన్లు, మేకింగ్‌కు ఖర్చు ఎక్కువ అవుతుండటంతో చాలా మంది నిర్మాతలు దివాళా తీశారనే విశ్లేషణలు వినిపించాయి. అయితే ఇప్పుడు సినిమా పోతే.. స్టార్లకూ నష్టంలేదు, నిర్మాతలకూ సంబంధం లేదు. బాధితవర్గం పంపిణీదారులే! వీళ్లు ప్రాంతాలకు, జిల్లాలకు వేర్వేరుగా ఉండటంతో తలా కొంత భారం పడుతోంది. అయినప్పటికీ నష్టాలేమీ తక్కువ స్థాయిలో లేవు. స్టార్ల సినిమాలపై భారీ అంచనాలతో వాటి పంపిణీహక్కులు కొన్న వారు అందులో సగం స్థాయి సొమ్ములు కూడా రాకపోవడంతో బోరుమంటున్నారు. ఈ సినిమాలను తొలిరోజే చూసిన అభిమానులు ఐదారువందలు ఖర్చు పెట్టుకుని ఊసురుమని బయటకొచ్చి ఉంటారు. ఏదో మంచి సినిమా చూడాలని వెళ్లిన సగటు ప్రేక్షకులు  తలపట్టుకుని బయటకు వచ్చి ఉంటారు. వీళ్ల సంగతి సరే.. కోట్లు పెట్టి ప్రదర్శన హక్కులు కొన్నవారి పరిస్థితేంటి? ప్రతి స్టార్ హీరో కూడా తన వాటాలొచ్చేస్తే చాలు.. అన్నట్టుగా వ్యవహరించడం మొదలుపెడితే.. ఇండస్ట్రీలో చివరకు మిగిలేది హీరోలు మాత్రమే!

ఏదైనా పెరుగుట విరుగుట కొరేక! 

ఫేక్ హైప్ క్రియేట్ చేసి ఎనభై కోట్లు..వంద కోట్లు అంటూ హడావుడి చేస్తూ పోతే... అదో ఒకరోజు అంతా పేలిపోతుంది. ఈ హీరోలను నమ్మే నాథులు ఉండరు. ఈ హీరోలే డమ్మీ నిర్మాతలను కూర్చోబెట్టి.. తమ మీద రాళ్లు పడకుండా.. కోట్లు కూడబెట్టుకోవడం జరుగుతూపోతే.., డిస్ట్రిబ్యూటర్లైనా, ప్రేక్షకులైనా ఒకసారి మోసపోవచ్చు, రెండోసారి మోసపోవచ్చు.. కానీ చివరకు నాన్నా పులి లాగా తయారవుతుంది పరిస్థితి. ప్రతిసారీ కొత్త డిస్ట్రిబ్యూటర్లు దొరుకుతారు.. ప్రతిసారీ కొత్త బకరాలు దొరుకుతారు.. అనుకోవడం కూడా అమాయకత్వమే అవుతుంది. జరిగినదేదో జరిగిపోయింది.. ఇకపై అయినా స్టార్ హీరోలు మేల్కొంటే పర్వాలేదు, లేకపోతే ‘స్టార్’ అనే పదమే సగటు సినీ ప్రేక్షకుడిలో కంపరాన్ని పుట్టించగలదు సుమా!

టాలీవుడ్ త్రిశంకు స్వర్గంలో ఉందనేందుకు రుజువుదిగో...

టాలీవుడ్ చుట్టూ ఉన్నది ఒక కల్పిత ప్రపంచం.. మన సినిమాలు 50 కోట్లు, అరవై కోట్ల మార్కులను దాటుతూ వెళుతున్నాయి.. ఒకదాన్ని మించిన స్థాయిలో మరోటి కొత్త హైట్స్‌కు చేరుతున్నాయి.. అనేది కేవలం ఒక భ్రమ. దీనికి ప్రత్యక్ష రుజువులు అనేకం కనిపిస్తాయి. విడుదలకు ముందు చెబుతున్న లెక్కలకూ, సినిమాలు సాధిస్తున్న వసూళ్లకూ ఏ మాత్రం పొంతన లేదు అనేందుకు ఏ ఒక్క ఏరియాను ప్రామాణికంగా చూసుకుని చూసినా అర్థం అవుతుంది. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం చూస్తే.. తెలుగు సినిమాలు ‘కర్ణాటక’లో పలుకుతున్న డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌కు సాధిస్తున్న వసూళ్లకు కొంచెమైన పొంతన లేకపోవడాన్ని గమనించవచ్చు.

కర్ణాటకలో తెలుగు సినిమాలకు ఎనలేని క్రేజ్ ఉంది. ఆంధ్ర, తెలంగాణలో బోలెడంత ప్రాంతం సరిహద్దుగా ఉండటం, కర్ణాటకలో భాగమైపోయిన చాలా ప్రాంతాల్లో తెలుగే ఎక్కువగా మాట్లాడటం.. జిల్లాలకు జిల్లాలే తెలుగు ప్రాబల్యం ఉన్నవి కావడం, ప్రధానంగా కర్ణాటక రాజధాని బెంగళూరులోనే తెలుగు అధికారిక భాష స్థాయిలో విస్తతంగా వినియోగంలో ఉండటం.. వంటి కారణాల చేత అక్కడ తెలుగు సినిమాలకు మంచి ఆదరణ ఉంది. ఆది నుంచి కూడా తెలుగు సినిమాలు సీడెడ్ ఏరియాలో ఎంత ఆదరణ పొందుతాయో కర్ణాటకలో కూడా అంతే ఆదరణ పొందుతూ వస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో పెరిగిపోయిన హైప్‌తో అక్కడ తెలుగు సినిమాలను భారీ రేట్లకు అమ్మడం మొదలుపెట్టారు. ఎంతగా అంటే.. మూడేళ్ల కిందటి వరకూ తెలుగు సినిమాల డిష్ట్రిబ్యూషన్ హక్కులు లక్షల రూపాయల రేంజ్‌లోనే ఉండేవి. అయితే ఇప్పుడు చిన్న సినిమాలైతే కోటి రూపాయలు.. స్టార్ హీరోల సినిమాలైతే ఆరుకోట్ల రూపాయలు అనేంత వరకూ వెళ్లి పరిస్థితి. 

సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా పంపిణీ హక్కులను ఆరు కోట్ల రూపాయలకు అమ్మారు, బ్మ్రెత్సవం 6.3 కోట్ల రూపాయలు పలికింది, కబాలి తెలుగు వెర్షన్ రైట్స్‌ను ఐదుకోట్ల రూపాయలకు అమ్మారు! మరి ఈ సినిమాలు సాధించిన వసూళ్ల లెక్కలు చూస్తే.. పంపిణీదారులు ఎంత నష్టపోయారో అర్థం అవుతోంది. గబ్బర్‌సింగ్‌కు కర్ణాటకలో మూడుకోట్ల రూపాయల వరకూ వచ్చాయి, బ్మ్రెత్సవం రెండు కోట్లకు పరిమితం అయ్యింది.. ఇక కబాలి స్థాయి కూడా రెండుకోట్లకు మించడం లేదు!

భారీ అంచనాలు.. భారీ సంఖ్య థియేటర్లలో విడుదల అయితే.. చచ్చి చెడి ఈ సినిమాలు అమ్మిన ధరలో ముప్పైశాతం వసూలు చేయడం కష్టం అయ్యిందే.. అయినా ఆ ధరలకు ఎలా అమ్ముతున్నారు? కొనేవాళ్లు ఎలా కొంటున్నారు? అనేది ప్రశ్న! ఒకవేళ ఆ సినిమాలు ప్లాఫులుగా నిలవక హిట్టు అనిపించుకున్నప్పటికీ.. థియేటర్ల వద్ద వాటి వసూళ్లు ఆరు కోట్ల ఫిగర్‌కు రీచ్ అయ్యే సమస్యే లేదని.. ఈ పోకడలను గమనిస్తున్న వారు అంటున్నారు. ఈ సినిమాలు హిట్టు అనిపించుకున్నా.. అదనంగా ఒక్కోటి మరో కోటీ, కోటిన్నర రూపాయలు వసూలు చేయగలిగేవి.. అర్థం లేని హైప్‌తోనే వాటి ధరలు ఆరుకోట్ల స్థాయికి చేరాయి తప్ప.. ఏదో మార్కెట్ ఉంది అని కాదని వారు చెబుతున్నారు.

అంతేకాదు.. వీరు చెబుతున్న మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కేవలం తెలుగు చిత్రపరిశ్రమలోనూ కొంత వరకూ తమిళ చిత్ర పరిశ్రమలోనూ ఈ పోకడ ఉందనేది! ఉన్న మార్కెట్‌కు మించిన స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసేసి.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ రేట్లకు సినిమాను అంటగట్టి.. వాళ్లను నిండా ముంచేస్తున్నది, తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలే అని వీరు చెబుతున్నారు. కన్నడ, మలయాళీ చిత్ర పరిశ్రమలు.. అక్కడి స్టార్లు ఇంకా భూమ్మీదే ఉన్నారని, అంచనాలు, అభిమానులు అంటూ వారు పంపిణీదారులను ముంచేసే పనులు చేయడం లేదని వారు విశ్లేషిస్తున్నారు.

మరి దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను చెబుతూ టాలీవుడ్ స్థాయి పెరిగింది, మన స్టార్లు చించేస్తున్నారు.. అని చెప్పుకోవడం పూర్తిగా అసంబద్ధం. రెండు రూపాయల విలువైన ప్రోడక్ట్‌కు కత్రిమ డిమాండ్‌ను క్రియేట్ చేసి.. ఆరు రూపాయలకు అమ్ముతున్నారు. అమ్ముకున్న వాడికి లాభం, కొన్నవాడికి తీరని నష్టం. ఇలా అయితే ఏ వ్యాపారం ఎక్కువ కాలం సాగుతుంది? ఇక్కడ వినిపించే మరో మాట ఏమిటంటే.. కొంతమంది నల్లధనికులు కూడా ఈ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నారనేది. తమ దగ్గర ఉన్న బ్లాక్‌ను వైట్ చేసుకునేందుకు ఈ పంపిణీ రంగంలోకి ప్రవేశిస్తున్నారని.. వారు కొంత నష్టపోయినా.. అంతకు మించిన స్థాయిలో డబ్బును వైట్ మనీగా మార్చేసుకుంటున్నారని కూడా తెలుస్తోంది. మొత్తంగా.. తప్పుడు వసూళ్ల లెక్కలు చెబుతూ ఒకరకంగా, ఇలాంటి వ్యాపారంతో మరో రకంగా.. సినీ పరిశ్రమ జీరో ఫైనాన్స్ దందాగా మారుతున్నట్టుంది.

-వెంకట్ ఆరికట్ల 

Show comments