మావాడికి లక్ష రూపాయిల జీతం అని చాలా మంది తల్లితండ్రులు గర్వంగా చెప్పుకుంటారు. కానీ పాపం, నెలాఖరు వస్తే వెయ్యి రూపాయిలు మిగిలదు. ఎందుకుంటే ఖర్చులు అలాంటివి. కేవలం అద్దెలు, తిండి, పాలు, నీళ్లే కాదు. మల్టీ ఫ్లెక్స్ లు, ఆన్ లైన్ షాపింగ్ లు, ఈఎంఐ లు, వీటికే సరిపోతుంది. మళ్లీ ఏదన్నా కొనాలన్నా కూడా అప్పు తప్పదు.
మన రాష్ట్రప్రభుత్వ వ్యవహారం ఇలాగే వుంది పేరుకు లక్షా యాభై ఆరువేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్ల బడ్జెట్. ఇందులొ ప్రజలకు ఏమన్నా చేయడానికి, లేదా కొత్తగా ఏమన్నా చేయడానికి కేటాయించింది ఎంత? 31,087 కోట్లు మాత్రమే. కానీ ఇలా కేటాయించడం వల్ల వచ్చిన డబ్బుల లోటు ఎంత? 21,863 కోట్లు. అంటే ఆ మేరకు అప్పులు తేవడమో, లేదా జనాల్నిబాదడమో చేయాలి. రెండూ చేయలేకుండా సైలెంట్ గా నిధుల కేటాయింపులు తగ్గించేసి, వచ్చే ఏడాది సవరణ బడ్జెట్ లో చూపించాలి. బడ్జెట్ ను ఘనంగా చెప్పుకుంటారు కానీ సవరణ బడ్జెట్ గురించి మాట్లాడరుగా ఎవరూ?
సరే మరి ఇంతకీ 1,56,999 కోట్ల బడ్జెట్ లో కొత్త పనులకు, పథకాలకు, కేవలం 31వేల కోట్లేనా? మరి మిగిలినది? అదే 1,25,912 కోట్లు. రెవెన్యూ వ్యయం. అనగా, ఈ ప్రభుత్వాన్ని నడపడానికి అయ్యే ఖర్చు. ఉద్యోగుల జీతాలు, ప్రజా ప్రతినిధుల వేతనాలు, ఆఫీసుల నిర్వహణ వ్యయం, అసెంబ్లీ నిర్వహణ వ్యయం, ఎమ్మెల్యేల కు ఇచ్చే సదుపాయాలు, ముఖ్యమంత్రి టూర్ ల ఖర్చు, ఇలా సమస్త ఖర్చలు కలిస్తే 1,25,912 అన్నమాట. అంటే వాస్తవంగా 11 వేల కోట్లు పథకాలకు ఖర్చు చే యడానికి ఆస్కారం వుంది. అంటే జస్ట్ 11 వేల కోట్లు ప్రజల కోసం ఖర్చుచేసే అవకాశం కోసం ప్రభుత్వాన్ని నడపాలి. పన్నులు వసూలు చేయాలి. కిందా మీదా అయిపోవాలి. అలా చేస్తే మిగులు ఇది. ఇంతేనా అని జనం అంటారు కాబట్టి, మరో ఇరవై వేల కోట్లు అప్పు చేసో, అదనపు కనిపించని బాధుడు బాదో సంపాదించి ముఫై ఒక్క వేల కోట్లు ఖర్చు చేస్తారన్నమాట.
ప్రజలను పిండి, ప్రజలపై రకరకాల ఫీజులు, పన్నులు వేసి వసూలు చేస్తే, తాగబోయించి ఆదాయం సంపాదిస్తే, అదంతా ఎక్కడికిపోతోంది. జస్ట్ ఆఫీసులు, స్టాఫ్, ప్రజా ప్రతినిధుల నిర్వహణకు. అంటే ప్రభుత్వం, నిర్వహణే లేకపోతే జనాలకు లక్షా 25వేల కోట్లు మిగులు అన్నమాట. ఏ ప్రభుత్వం వల్ల అయినా లాభం ఏమిటో? ప్రజలకు పోలీసులు రక్షణ ఇస్తారు. రెవెన్యూ వాళ్లు భూముల వ్యవహారాలు చూస్తారు అనుకుంటారేమో? దానికి మళ్లీ జనం ఎవరి పనులకు వారు ఆమ్యామ్యాలు చెల్లించాల్సిందేగా?
ఎక్కడికి వెళ్తున్నాం మనం?