హీరో గారి నిజజీవిత ప్రేమకథలో విలన్ ఎవరు?!

ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది హీరో విశాల్ ప్రేమకథ. ఒకవైపు శరత్ కుమార్ తో విబేధాలు.. మరోవైపు ఆయన కూతురితో ప్రేమాయణం! తెలుగు సినిమాల్లో హీరోహీరోయిన్ల ప్రేమకథతో పోలిస్తే, ఈ నిజ జీవిత ప్రేమకథ చాలా ఆసక్తికరంగా నడిచింది. విబేధాలు ముదిరాయి.. నడిగర్ సంఘం ఎన్నికల్లో డైరెక్టుగా శరత్ కుమార్ నే ఢీ కొట్టాడు విశాల్. అప్పటికీ.. శరత్ కూతురు వరలక్ష్మితో మాత్రం విశాల్ కు స్నేహమే ఉంది! ప్రేమ కొనసాగింది.

కాబోయే మామపై కాబోయే అల్లుడు పై చేయి సాధించాడు అనుకున్నారంతా! నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ ప్యానల్ విజయం సాధించింది. శరత్ కుమార్ ప్యానల్ ను చిత్తు చిత్తు చేసింది. ఈ పరిణామాలతో కూడా  వరలక్ష్మి.. విశాల్ ల మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలూ రాలేదు! తండ్రి, ప్రియుడిల మధ్య పోరాటంలో వరలక్ష్మి విశాల్ చాలా డిప్లొమాటిక్ గా వ్యవహరించి.. ఇరువురితోనూ బంధాన్ని కాపాడుకోగలిగింది. శరత్ కుమార్ తో ఆ రకమైన పోరాటానికి వ్యక్తిగత ప్రేమాభిమానాలకూ సంబంధం లేనట్టుగానే వ్యవహరించాడు విశాల్ కూడా. 

అయితే ఇప్పుడు విశాల్- వరలక్ష్మి ల మధ్య బ్రేకప్ వార్తలతో ఈ ప్రేమ కథలో విలన్ ఎవరు? అనేది అంతుబట్టకుండా మారింది. విశాల్ తన ప్రేమను తిరస్కరించాడని, అది కూడా ఒక మేనేజర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాడని వరలక్ష్మి ప్రకటించింది. అతడి పేరు ప్రస్తావించకపోయినా... వరలక్ష్మి చెప్పిన విషయం స్పష్టంగానే అర్థం అయ్యింది.

ఈ నేపథ్యంలో... ఈ ప్రేమకథలో విలన్ ఎవరు? అంటే.. విశాలే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తండ్రితో అతడి విబేధాలను సైతం లెక్కచేయక అతడితో బంధాన్ని కొనసాగించిన వరలక్ష్మి ప్రేమను తిరస్కరించినట్టు అయితే ఆ విలన్ విశాలే అవుతాడు నిస్సందేహంగా.

అయితే విశాల్ వరలక్ష్మి ల ప్రేమకథకూ, ఇటీవల నడిగర్ సంఘం పరిణామాలకూ సంబంధం ఉందనే మాట వినిపిస్తోంది. ఏకంగా శరత్ కుమార్, ఆయన సన్నిహితులను సంఘం నుంచి బహిష్కరించేశారు! వారి హయాంలో అవకతవకలు జరిగాయంటూ.. ఆ విధంగా వారిని సంఘం నుంచి బయటకు పంపించారు. అది శరత్ కు తీవ్రమైన అవమానామే. ఈ నేపథ్యంలో శరత్ ఒత్తిడి చేసి.. ఈ ప్రేమ జంటను విడదీశాడా? అనేది మరో అనుమానం.

మరి ఇన్ని రోజులూ ప్రేమ జంటగా పేరు పొందిన విశాల్- వరలక్ష్మిలు ఇప్పుడు ఈ బ్రేకప్ వార్తలతో ఆసక్తిని రేపుతున్నారు. ఇంకా ఈ ప్రేమకథలో ఏయే మలుపులుంటాయో!

Show comments