రాజుగారూ.. రెడ్డిగారు మనోడే.!

రెడ్డిగారు రౌడీయిజం ప్రదర్శించారు.. ఆ రెడ్డిగార్ని రాజుగారు వెనకేసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మొత్తం తతంగానికి తెరవెనుక స్క్రీన్‌ప్లే రచిస్తున్నది నాయుడుగారు.! 

విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, 'ఇండిగో' సిబ్బందిపై దాడి చేసిన విషయం విదితమే. సమయం ముగిశాక బోర్డింగ్‌ పాస్‌ కోరిన రెడ్డిగారికి, నిబంధనల ప్రకారం బోర్డింగ్‌ పాస్‌ ఇవ్వడం కుదరదని 'ఇండిగో' సిబ్బంది చెప్పడంతో, రెడ్డిగారిలో ఆవేశం కట్టలు తెంచుకున్న విషయం విదితమే.

'అబ్బే, నేనెవరిమీదా దాడి చేయలేదు..' అని రెడ్డిగారు బుకాయించేసినా, సీసీటీవీ కెమెరాలు ఆయనగారి నిర్వాకాన్ని రికార్డ్‌ చేసేశాయి. 

తెలుగు మీడియా కాస్తంత 'స్లో'గా ఈ విషయాన్ని కవర్‌ చేసినా, నేషనల్‌ మీడియా మాత్రం రెడ్డిగారి పైత్యాన్ని హైలైట్‌ చేస్తూ ఏకిపారేసింది. పౌరవిమానయాన శాఖ మంత్రిగా పనిచేస్తున్న టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌గజపతిరాజుకి ఇప్పుడీ వ్యవహారం కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది.

గతంలో శివసేన ఎంపీ ఇలాగే, విమాన సిబ్బందిపై గుస్సా అయితే, అప్పట్లో రాజుగారు ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. మరిప్పుడు, రెడ్డిగారి విషయంలో ఏం చేస్తారు.? ఇదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న. 

'రాజుగారు మనోడే.. రెడ్డిగారూ మనోడే.. రాజుగారితో మాట్లాడితే మేటర్‌ సెటిలైపోద్ది..' అని నాయుడుగారు సూచించడంతో, టీడీపీ నేత, ఎంపీ సీఎం రమేష్‌ రంగంలోకి దిగారు.

రెడ్డిగారితో క్షమాపణ చెప్పించేసి, ఆ తర్వాత రాజుగార్ని మేనేజ్‌ చేసేయొచ్చన్నది సీఎం రమేష్‌ స్కెచ్‌. తెరవెనుక జరుగుతున్న ఈ తతంగాన్ని నేషనల్‌ మీడియా ఎలివేట్‌ చేసేసరికి, రాజుగారికి దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయిపోయింది. 

జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించామని, జేసీ దివాకర్‌రెడ్డికి తానేదో సాయం చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజుగారు సెలవిచ్చారు. నిజమేనా.? నమ్మొచ్చా.?

Show comments