షాకింగ్‌: వెంకయ్యకు వైఎస్‌ జగన్‌ మద్దతు

2014 ఎన్నికల్లో బీజేపీ - టీడీపీ కూటమిని ఓడించాలంటూ తెలుగునాట కాళ్ళకు చక్రాలు కట్టుకు మరీ తిరిగేశారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌. రోజులు మారాయి.. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు పలికేసింది. అక్కడితో ఆగితే వింతేముంది.? ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీకి, వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు పలికింది. ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా అందరికీ పెద్ద షాకే ఇచ్చేశారు వైఎస్‌ జగన్‌. 

ఇలా వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వం ఖరారయ్యిందో లేదో, అలా ఆయనకు మద్దతు పలుకుతున్నట్లు వైఎస్‌ జగన్‌ తరఫున వైఎస్సార్సీపీ ప్రకటించేయడం విశేషమే మరి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి రాజ్యాంగ బద్ధమైన పదవులకు సంబంధించి ఎంపిక 'ఏకగ్రీవం' అవ్వాల్సిందన్న సదుద్దేశ్యంతోనే ఈ నిర్ణయమని వైఎస్సార్సీపీ చెబుతోంది. 

రామ్‌నాథ్‌ కోవింద్‌ సంగతేమోగానీ, వెంకయ్యనాయుడు విషయంలోనే వైఎస్‌ జగన్‌ కాస్త తొందరపడ్డారేమో అన్పిస్తోంది. ఎందుకంటే, రామ్‌నాథ్‌ కోవింద్‌కీ వైఎస్‌ జగన్‌కీ రాజకీయంగా కూఆ వైరమేమీ లేదు. వైఎస్‌ జగన్‌కీ, వెంకయ్యకీ మాత్రం రాజకీయంగా చాలా వైరమే వుంది.

చాలా సందర్భాల్లో 'జైలుకు వెళ్ళి వచ్చిన.. అవినీతిలో కూరుకుపోయిన..' అంటూ వెంకయ్య, జగన్‌ని ఉద్దేశించి సెటైర్లు వేసిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? అంతేనా, 'కనీసపాటి రాజకీయ అవగాహన కూడా లేనివారు పార్టీలను నడిపేస్తున్నారు..' అంటూ వైఎస్‌ జగన్‌నీ, వైఎస్సార్సీపీనీ ఎగతాళి చేశారు వెంకయ్య. 

కానీ, వైఎస్‌ జగన్‌ ఆ అవమానాలన్నింటినీ మర్చిపోయారు. ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య చేసిన ఘనకార్యం కూడా జగన్‌ మర్చిపోవడం ఆశ్చర్యకరమే. 'అబ్బే, ప్రత్యేక హోదాపై మేం వెనక్కి తగ్గలేదు.. పార్లమెంటు సాక్షిగా మా పోరాటం కొనసాగుతుంది..' అంటూ ఇప్పటికీ చెబుతోన్న వైఎస్‌ జగన్‌, రేప్పొద్దున్న ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య పేరు ప్రస్తావించకుండా వుండగలరా.? ఎందుకంటే, ప్రత్యేక హోదా అనే అంశానికి ప్రాణం పోసిందీ, తీసిందీ.. తద్వారా ఆ ప్రత్యేక హోదాకి బ్రాండ్‌ అంబాసిడర్‌ అయ్యిందీ వెంకయ్యే కదా .!

Show comments