చంద్రబాబు గారూ..! వ్యవస్థలను నాశనం చేయకండి!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు ఇబ్బంది కలిగే ఏ అంశాన్ని అయినా కవర్‌ చేయడంలో ఆయనకు ఆయనేసాటి అని చెప్పాలి. తన సొంతజిల్లా అయిన చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద జరిగిన ఘోరమైన ఘటనలో పదిహేడు మంది బలైపోయారు. ఈ ఘట నను చాలా చిన్నదిగా చూపించడానికి జరిగిన ప్రయత్నాలు చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకప్పుడు ప్రభుత్వంలో ఏదైనా సమస్య వస్తే, దానిని తన, పర తేడా లేకుండా విచారణకు ఆదేశాలు ఇచ్చేవారు. ఇప్పుడు కాలం మారింది. జరిగిన ఘోరాన్ని ఎలా కవర్‌ చేయాలన్న దానిపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెడుతోంది. ఇది గత మూడేళ్లుగా సాగుతున్న ట్రెండే. తిరుమల అడవులలో తమిళ కూలీలు ఇరవై మందిని కాల్చిన ఘటన కానివ్వండి, గోదావరి పుష్కరాలలో తొక్కిసలాటలో ఇరవై తొమ్మిది మంది మరణించిన ఘటన కానివ్వండి, ఆయాచోట్ల ఇసుక మాఫియా గొడవలు.. ఇలా ఆయా సందర్భాలలో ఎక్కడ ఏమిజరిగినా ప్రభుత్వం వాటిని కప్పిపుచ్చడానికే ప్రాధాన్యం ఇస్తోంది. దీనికి కారణం ఒకటే ఆ ఘటనలకు ప్రధాన బాధ్యులుగా ఉన్నది తెలుగుదేశం పెద్దలవడమే. 

దాంతో పోలీసులు కూడా ఎక్కడలేని విధేయత ప్రదర్శిస్తూ అధికార పక్షానికి సహకరిస్తూ చట్టాలను చట్టుబండలను చేస్తున్నారు. ఏర్పేడు వద్ద ఇసుక మాఫియా, రోడ్డు ప్రమాదం విషయం చూడండి. ఆ గ్రామాల వద్ద ఇసుకదందా సాగుతోందని గ్రామస్థులు పలుమార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదట. పైగా గ్రామస్థులు నిరసన తెలపడానికి వస్తే పోలీస్‌స్టేషన్‌ గేట్లు వేస్తారట. ఎమ్‌ఆర్‌ఓ ఆఫీస్‌కు వెళితే అక్కడ ఎవరూ అందుబాటులో ఉండరు. ఎవరో ఎందుకు ఏకంగా అక్కడకు వచ్చిన ఎస్పీని కలిసి ఇసుక మాఫియా గురించి ఫిర్యాదు చేస్తే అది తనకు సంబంధంలేదని చెప్పి వెళ్లిపోయారట. వెంటనే కిందస్థాయి ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చి కంట్రోల్‌ చేయవలసిన ఎస్పీనే అలా వెళ్లిపోతే ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి. అలా నిరసనకు వచ్చిన వారిపై ఒక లారీ దూసుకువెళ్లడం, అనేకమంది గాయపడడం, వారిలో పదిహేడు మంది మరణించడం జరిగింది. ఇది అత్యంత బాధాకరం. దీనిని రోడ్డు ప్రమాదంగా చూడాలా? డ్రైవైర్‌, క్లీనర్‌, లేకపోతే ఓనర్‌ తప్పుగా మాత్రమే చూడాలా? నిజమే వారితప్పు ఉంది కనుక వారిపై చర్య తీసుకోవలసిందే. 

కాని అక్కడ జనం ఎందుకు గుమికూడారు.పోలీసులు ఎందుకు వారిని పట్టించుకోలేదు? అన్న విషయాలలోకి ప్రభుత్వ వ్యవస్థలు వెళ్లవా? చివరికి తూతూ మంత్రంగా ఇద్దరు టీడీపీ స్థానిక నేతలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు ప్రకటిస్తే సరిపోతుందా? ఒక పత్రిక రాసిన ప్రకారం వారు అనేక ఎకరాల భూములు కబ్జా చేశారట. ఇసుక ద్వారానే కోట్ల రూపాయలు ఆర్జించారట. చెన్నై, బెంగళూరు నగరాలకు ఇక్కడ నుంచి యధేచ్ఛగా ఇసుక వెళుతుందట. మరోవర్గం మీడియా మాత్రం డ్రైవర్‌ తప్పు చేశాడా? క్లీనర్‌ తప్పు చేశాడా అన్నదానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి కథనాలు ఇచ్చింది. ఇసుక మాఫియా దౌర్జన్యాల గురించి మంత్రి లోకేష్‌కు బాధితులు చెబితే ఎవరో ఒక వెధవ తప్పుచేస్తే అది పార్టీ అంతటికి ఎలా వర్తిస్తుందని అన్నారు. కాని లోకేష్‌ గమనించవలసింది ఇదొక్కటే ఘటన కాదు. అనేక ఘటనలలో పోలీసులు, అధికారులు టీడీపీ నేతల అక్రమాలను చూసిచూడనట్లు వదలి వేస్తుండడంతోనే ఈ సమస్యలు వస్తున్నాయన్న సంగతి గుర్తించాలి. 

అలాగే ఎర్రచందనం అక్రమ రవాణాలో కూడా పోలీసులు, టీడీపీ నేతలు కలిసి డబ్బు సంపాదించుకుంటున్నారని కూడా ఆ పత్రిక వివరించింది. ఇలాంటి వాటిని పార్టీలకు అతీతంగా చూసి చర్యలు తీసుకోకపోతే సమాజానికి తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై దాడికి దిగినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారి మధ్య రాజీకుదర్చడం, ఎమ్మార్వోని మందలించడం కాకుండా చట్ట ప్రకారం వ్యవహరించి ఉంటే తెలుగుదేశం నేతలకు కూడా ఒక సందేశం పంపినట్లయ్యేది. కాని చంద్రబాబే తెలుగుదేశం నేతలు, కార్యకర్తలకు సహకరించండని ఆదేశాలు ఇస్తే ఇక ఏ టీడీపీ నేత, కార్యకర్త చట్టం ప్రకారం వ్యవహరిస్తారు? ఏ అధికారి వారిమీద చర్య తీసుకోవడానికి ధైర్యం చేస్తారు. ఈ రకంగా ఏపీలో వ్యవస్థలను చంద్రబాబు ప్రభుత్వం నాశనం చేస్తుండడం దారుణమైన విషయం.

-కొమ్మినేని శ్రీనివాసరావు

Show comments