పవన్‌ కల్యాణ్‌కు సీమలో ఇవన్నీ ప్రతిబంధకాలే!

ఒకటైతే వాస్తవం.. పవన్‌కల్యాణ్‌ పార్టీకి రాయలసీమలో 'ప్రజారాజ్యం' అంతటి జోష్‌ కూడా ఉండదు. చిరంజీవి రాజకీయ పార్టీని స్థాపించి రాయలసీమకు వస్తే జనాలు నీరాజనాలు పట్టారు. రాయలసీమలో నాయకుల దగ్గర నుంచి సాధారణ ప్రజానీకం వరకూ చిరంజీవికి హారతులు ఇచ్చారు. చిరంజీవి ఇంపాక్ట్‌ ఆంధ్రాలో ఎక్కువ ఉంటుందని అనుకున్నారు కానీ, రాయలసీమలోనే అది ఎక్కువగా కనిపించింది. అప్పట్లో చిరంజీవి పార్టీ జనాల్లో తీసుకొచ్చిన కదలికను గమనించినా, ఓట్ల శాతాన్ని పరిశీలించి చూసినా.. రాయలసీమలోనే చిరంజీవి ఎక్కువ ఆదరణ కనిపించింది. ఆంధ్రాలో సీట్లు గెలిస్తే గెలిచి ఉండొచ్చు గాక.. రాయలసీమలో చిరుపార్టీ ప్రత్యేకతను అయితే చాటుకుంది. చిరంజీవి ఆంధ్రాలో పోటీ చేసిన నియోజకవర్గంలో ఓడిపోయి, రాయలసీమ నుంచి మాత్రమే ఎమ్మెల్యేగా గెలవగలిగాడంటేనే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

అదీ నాటి జోష్‌. అయితే చిరుకు సీమలో దక్కిన ఆ ఆదరణలో పదోవంతు కూడా పవన్‌కల్యాణ్‌కు దక్కే పరిస్థితి లేదు. దీనికి ప్రధాన కారణాలు ఏమనగా.. చిరంజీవి మోసం చేశాడనే భావన ఇక్కడి జనాల్లో ఉండటం. పార్టీ పెట్టినప్పుడు చిరంజీవిని ఆదరించిన వాళ్లు దాన్ని విలీనం చేసే సరికే తట్టుకోలేకపోయారు. చిరు చేసిన ఆ పనిని తమ యాసలో తిట్టుకున్నారు సీమలోని చిరు అభిమానులు. చిరు పార్టీ తరపున పవన్‌కల్యాణ్‌ కూడా తిరిగాడు, ఇప్పుడు చిరుతో తనకు సంబంధం లేదని పవన్‌ చెప్పవచ్చు గాక.. కానీ పవన్‌ను గుర్తించేది కేవలం చిరంజీవి తమ్ముడిగానే! అప్పుడు అన్నాదమ్ములిద్దరూ కలిసి వచ్చి.. పార్టీ పెట్టి దాన్నిఅమ్ముకున్నారు, ఇప్పుడు తమ్ముడు ఒకడే వచ్చి మళ్లీ మొదలుపెట్టాడు.. అనేది సీమలో గట్టిగా ఉన్న ఒక భావన.

కొన్ని కులాల్లోని మధ్యతరగతి, సినిమా హీరో అని ఓటు వేసే తత్వం, బీసీ వర్గాలు, మాస్‌ ఓటర్‌.. ఈ వర్గాలు చిరంజీవి వైపు ఆకర్షితం అయ్యాయి. మామూలుగా ఈ ఓటు బ్యాంకు అంతా సాలిడ్‌ తెలుగుదేశం పార్టీకి చెందుతుంది. అయితే ఆ సమయంలో ఈ వర్గాలు చిరంజీవి ప్రభావానికి లోనయ్యాయి. రాయలసీమలో 2009 ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలోనూ త్రిముఖ పోరే జరిగింది. ప్రతి నియోజకవర్గం లోనూ ఇరవై నుంచి ముప్పైవేల ఓట్ల వరకూ చిరంజీవి పొందగలిగాడు. మరి అంతమంది నమ్మకాన్ని మెగాస్టార్‌ వమ్ము చేశాడు. ఆ ప్రభావం పవన్‌ మీద చాలా వరకూ ఉంటుంది. అందుకే.. జనసేనకు 'ప్రజారాజ్యం' అంతటి జోష్‌ లేదు, ఉండదు.

ఇక రెండో అంశం.. పవన్‌కల్యాణ్‌ జనసేనకు రాబోయేవి రెండో ఎన్నికలు. క్రితంసారి ఎన్నికల్లో పవన్‌ టీడీపీ, బీజేపీలకు మద్దతుగా ప్రచారం చేసిన విషయాన్ని, హామీల అమలుకు పూచీ తనే అని చెప్పుకున్న విషయాన్నీ ఇక్కడి వారు మరిచిపోలేదు. తెలుగుదేశం హామీలకు ప్రలోభపడి ఓట్లు వేసిన వారే చాలామంది. వారిలో ప్రధాన వర్గాలు రైతులు, మహిళలు. రుణమాఫీ వంటి హామీ అమలు విషయంలో ప్రభుత్వంపై పీకలదాకా కోపంతో ఉన్నారు రైతులు. ఇక మహిళల సంగతి చెప్పనక్కర్లేదు. అలాగే పవన్‌కల్యాణ్‌ను మహిళలు ఏ మాత్రం ఆదరించే అవకాశాలు లేవు. మూడు పెళ్లిళ్లు దానికి కారణం.

ఇక సీరియస్‌ నెస్‌.. ఏదో సినిమాలు చేసుకొంటూ ఉంటాను, అప్పుడప్పుడు వస్తాను.. మీటింగులు పెడతాను, మళ్లీ మరిచిపోతాను.. అంటే కుదరదు. చిరంజీకి అప్పుడు ఆ మాత్రం ఆదరణ దక్కిందన్నా.. అందుకు కారణం.. తను సినిమాలను పక్కన పెడతాను, రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పుకోవడమే.. ఎన్నికలకు ఇంకో ఏడెనిమిది నెలలు ఉన్నాయనంగా పార్టీ పెట్టడం.. టక్కున జనాల మధ్యకు రావడం అదంతా ఒక ఊపు! ఆ ఊపు.. వేడీ ఏదీ? ఇదే జనసేనకు పెద్దలోటు.

చిరంజీవి దోసె.. వేడి మీద ప్రతి నియోజకవర్గంలోనూ కొన్ని ఓట్లనైనా పొందగలిగింది. పవన్‌ కల్యాణ్‌ దోసె.. వేడి కావడం చల్లారడం.. ఇదే తంతు. ఇది ఆఖరికి హార్డ్‌ కోర్‌ ఫ్యాన్స్‌ ఆసక్తిని కూడా చంపేస్తోంది. వాళ్లకే క్లారిటీ లేకుండా చేస్తోంది.

ఈ ప్రతిబంధకాలు అన్నీ.. పైపైకే కనిపిస్తున్నాయి. మరి క్షేత్రస్థాయికి వెళితే ఇంకెలా ఉంటుందో పరిస్థితి. ఇలాంటి వాటిని ఎదుర్కొంటాను అన్నట్టుగా.. వైకాపా ఆయువుపట్టైన చోట ప్రభుత్వ వ్యతిరేకత ప్రబలంగా ఉన్న చోట.. తెలుగుదేశాన్ని గెలిపించడమే లక్ష్యంగా పవన్‌ కల్యాణ్‌ ముందుకు వస్తున్నాడు. మరి దీనికి ఫలితాలు ఎలా ఉంటాయో.

Show comments