కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్టు ఉంది పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో పరిస్థితి. దళితులు, అగ్ర వర్ణాలకు మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న ఊరిలో పర్యటించేందుకు కూడా రాజకీయ నేతలు జంకుతున్నారు. ఒక వర్గానికి మద్దతుగా మాట్లాడితే మరో వర్గం ఆగ్రహం చివిచూడక తప్పదు. దీంతో అటువైపు వెళ్లకపోవడమే మంచిదనుకున్న అధికార పార్టీ నాయకులు గ్రామంలో పర్యటించి వారికి నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేయలేదు.
ఇలాంటి నేపధ్యంలో ప్రతిపక్షనేత గరగపర్రు పర్యటన తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. జగన్ అక్కడికెళ్లి ఎలా మాట్లాడతాడు? ఎరికి మద్దతుగా మాట్లాడుతాడు? సమస్యకు ఎలాంటి పరిష్కారం సూచిస్తాడు? అని సర్వత్రా ఎదురుచూశారు. అయితే జగన్ మాత్రం నొప్పించక తానొవ్వక.. అన్నట్టు రాజకీయ లౌక్యం ప్రదర్శించాడు.
ఎమోషన్స్ ఏమాత్రం రెచ్చగొట్టకుండా, ఏ వర్గానికో మద్దతుగా అన్నట్టు కాకుండా ఆచితూచి వ్యవహరించాడు. దళితుల గ్రామ బహిష్కరణకు కారణం అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు వివాదమే అని పైకి చెప్తున్నా అగ్రవర్ణాలు, దళితుల మధ్య కొన్నాళ్లుగా ఆధిపత్యం కోసం ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూనే ఉంది. అది ఇప్పుడు తీవ్ర రూపం దాల్చిందంతే.
చంద్రబాబు గరగపర్రు అంశాన్ని రాజకీయంగా కాకుండా అధికారుల మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించాలని చూశాడు. జిల్లా కలెక్టర్‌ను గ్రామానికి పంపి పరిస్థితి చక్కదిద్దాలని సూచించాడు.. కానీ జగన్ స్వయంగా గ్రామంలో పర్యటించి ఇరు వర్గాలతో మాట్లాడి కాస్త నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. జరిగిందేదో జరిగిపోయింది.. ఒక ఊరి వాళ్లం కలిసిపోదాం అంటూ జగన్ ఇరు వర్గాలను ఊరగించాడు.
అయితే మాటల్లో ఏ వర్గానికి మద్దతు పలకకున్నా తన ప్రవర్తన ద్వారా అటు దళితులు, ఇటు అగ్రవర్ణాలు ఇరువురి మనస్సును జగన్ గెలుచుకున్నారు. దాదాపు గంటన్నుర పాటు దళితవాడలో వారి మధ్య నేల మీద కూర్చుని గడిపారు. పసిపిల్లలను చాలా సేపు ఒడిలో కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ పరాయి కులం వ్యక్తి అనేక భావన కనబడకుండా జాగ్రత్తపడ్డాడు.
మరోవైపు అగ్రవర్ణాల్లో వ్యతిరేకత రాకుండా వారి వద్ద కాస్త సర్దుకుపోదాం అన్నా .. అనే విధంగా బ్రతిమాలినట్టు మాట్లాడి వారి ఈగోకు భంగం కలగకుండా చూసుకున్నాడు. బ్యాలెన్సింగ్ క్యారెక్టర్ ప్రదర్శించి ఏ వర్గం వ్యతిరేకత లేకుండా చివరికి సేఫ్‌గా బయటపడ్డాడు.
అన్నింటికంటే ముఖ్యంగా గరగపర్రు పర్యటనను పార్టీ వ్యవహారంగా, పబ్లిసిటీ స్టంట్‌గా కాకుండా తన వ్యక్తిగత పర్యటనగా లో ప్రొఫైల్‌లో జగన్ ముగించాడు. చుట్టుపక్కల నుంచి పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగానే తరలివచ్చినా ఎక్కడా పార్టీ నినాదాలు, జిందాబాద్‌లు కొట్టకుండా చూసుకోవాలని స్థానిక నేతలను ముందస్తుగానే హెచ్చరించాడు. తెచ్చిపెట్టుకున్న పెద్దరికం, అనవసర నీతుల జోలికిపోకుండా అణకువతో మసలుకుని అందరి మద్దతు సంపాదించుకున్నారు.