ఇంత నిబద్ధత ప్రజల పట్ల లేదేం?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వాగ్దానం నెరవేర్చుకున్నారు. అన్న మాటకు కట్టుబడ్డారు. హామీ ఇచ్చిన ప్రకారం ఒలింపిక్స్‌ విజేత పీవీ సింధుకు డిప్యూటీ కలెక్టర్‌గా (గ్రూప్‌-1 ఆఫీసర్‌) ఉద్యోగం ఇచ్చా రు. ఆమెకు ఉద్యోగం ఇవ్వడం కోసం అసెంబ్లీలో ఏపీపీ ఎస్సీ చట్టానికి సవరణలు చేసి ఆ బిల్లును ఆమోదింప చేశారు. ఇది స్పెషల్‌ కేసు కాబట్టి ప్రత్యేక బిల్లు అవసర మైంది. అంతర్జాతీయ క్రీడాకారిణిని ఆంధ్రప్రదేశ్‌కు సొంతం చేసుకొని ఎట్టకేలకు ఆమె ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. సింధుకు ఉద్యోగం ఇచ్చినందుకు ఎవ్వరికీ అభ్యంతరం లేదు.

కాని ఒక క్రీడాకారిణి పట్ల ఉన్న నిబద్ధత ప్రజల సమస్యల పరిష్కారం పట్ల ఎందుకు లేదు? ఇది కేవలం చంద్రబాబుకు వర్తించే ప్రశ్నే కాదు. ఏ ముఖ్యమంత్రికైనా వర్తిస్తుంది. పాలకులు విజేతలైన క్రీడాకారులను ఘనంగా గౌరవిస్తున్నారు. సన్మానిస్తున్నారు. కోట్ల రూపాయల నజరానాలు సమర్పిస్తున్నారు. విలువైన స్థలాలు, ఉద్యోగాలు ఇస్తున్నారు. వారి విషయంలో ఏదైతే చెబుతున్నారో ఆ పనులు వెంటనే చేసేస్తున్నారు. ఎక్కడా జాప్యం జరగడంలేదు. క్రీడాకారులు, క్రీడాకారిణులు పతకాలు సాధించగానే వారికి ఏఏ నజ రానాలు ఇస్తామని ప్రకటిస్తున్నారో వాటిని అందచేయడం లో ఏమాత్రం ఉదాసీనంగా ఉండటంలేదు.

కాని ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఏళ్ల తరబడి జాప్యం చేస్తున్నారు. కొన్ని సమస్యలు వారి పాలన ముగిసేవరకు పరిష్కారం కావు. అది చేస్తామని, ఇది చేస్తామని వాగ్దానాలు చేస్తారు. ఆ తరువాత వాటి గురించి ప్రజలు, మీడియా ఎన్నిసార్లు గుర్తు చేసినా పట్టించు కోరు. కాని క్రీడాకారుల విషయంలో ఏదీ మర్చిపోరు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిధుల కొరతంటూ సాకులు చెప్పే పాలకులు క్రీడాకారులకు కోట్ల రూపాయలు ధార పోస్తారు. ఇదంతా ప్రజల సొమ్మే కదా. సింధుకు ఏపీ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి ఊరుకోలేదు. అమరావతి ప్రాంతంలో వెయ్యి గజాల ఇళ్ల జాగా ఇచ్చింది.

మూడుకోట్ల రూపాయల నగదు బహుమతి ఇచ్చింది. సింధును ప్రభుత్వ సంక్షేమ పథకాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించబోతున్నట్లు చంద్రబాబు చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా సింధుకు గ్రూప్‌-1 ఉద్యోగం ఆఫర్‌ చేశారు. కాని ఆమె ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకుంది. సింధు ఒలింపిక్స్‌లో పతకం సాధించగానే కేసీఆర్‌ ఆమెకు వెయ్యి గజాల ఇళ్ల స్థలం, ఐదు కోట్ల నగదు బహుమతి ప్రకటించారు. తెలంగాణ బిడ్డ ఘన విజయం సాధించిందంటూ కొనియాడారు.

కాని ఆమె ఆంధ్రప్రదేశ్‌ వైపే మొగ్గు చూపింది. అయినప్పటికీ కేసీఆర్‌ ఆమెకు తాను చేసిన వాగ్దానం ప్రకారం ఐదుకోట్ల నగదు బహుమతి ఇచ్చేశారు. షేక్‌పేటలో కేటాయించిన వెయ్యి గజాల ఇంటి స్థలం కాగితాలను స్వయంగా అందించారు. గతంలో టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జాకు కేసీఆర్‌ కోట్ల రూపాయల నజరానాలు ఇచ్చారు. తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించారు. ఆమె బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఏం చేసిందో ఇప్పటివరకు తెలియదు. సింధు ఒలింపిక్స్‌లో విజయం సాధించగానే ఆ క్రెడిట్‌ను దక్కించుకోవడానికి, ఆమెను తమ రాష్ట్రానికి చెందిన అమ్మాయంటే తమ రాష్ట్రానికి చెందిన అమ్మాయని చెప్పకోవడానికి ఇద్దరు ముఖ్య మంత్రులు పిచ్చిగా తాపత్రయపడ్డారు.

ఒక దశలో ఈ తాపత్రయం వెగటు కలిగించింది కూడా. సింధును తెలంగాణ ప్రభుత్వం 'తెలంగాణ బిడ్డ' అంటే, ఏపీ ప్రభుత్వం 'ఆంధ్రా అమ్మాయి' అని క్లెయిమ్‌ చేసుకుంది. పోటీలు పడి కోట్ల రూపాయల నజరానాలు ప్రకటించారు. పెద్ద ఉద్యోగాలు ఆఫర్‌ చేశారు. రాజధానుల్లో  ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ఉదా సీనంగా ఉండే పాలకులు సింధును ఆకాశానికి ఎత్తడంలో, కానుకలు సమర్పించడంలో మాత్రం పరుగులు తీశారు. ఇక సన్మానాలు సత్కారాల సంగతి చెప్పక్కర్లేదు. చంద్రబాబు ప్రోటోకాల్‌ కూడా పక్కకు పెట్టి ఆమెకు ఎదురేగి స్వాగతం పలికారు.

సింధుకు ఇద్దరు ముఖ్యమంత్రులు పెద్ద ఉద్యోగాలు ఆఫర్‌ చేసినప్పటికీ ఆమె చాలాకాలం అవునని కాదని చెప్పకుండా మౌనంగా ఉంది. ఇందుకు కారణం ఎటూ తేల్చుకోలేక కావొచ్చు లేదా ఉన్న ఉద్యోగంలో కొనసాగితే బాగానే ఉంటుంది కదా అనే ఆలోచన కావచ్చు. రెండు ప్రభుత్వాలు ఆమెకు ఉద్యోగం ఆపర్‌ చేయగానే ఉద్యోగం లేదని జనం అనుకొనివుంటారు. కాని భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్లో డిప్యూటీ మేనేజర్‌ (స్పోర్ట్స్‌)గా పని చేస్తోంది. ఆమెకు ఆల్రెడీ ఉద్యోగం ఉన్నా సీఎంలు ఆపర్‌ చేయడానికి కారణం ఒలింపిక్‌ విజేత తమ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తోందని గర్వంగా చెప్పుకోవడానికే.

ఇలా గర్వపడే అవకాశాన్ని సింధు ఏపీ సీఎం బాబుకు కల్పించడం ద్వారా కేసీఆర్‌తో పోటీపడిన ఆయన్ని గెలిపించినట్లయింది. కేసీఆర్‌కు నిరాశ మిగిలింది. ఏపీ ఆఫర్‌ను ఒప్పుకోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? రాష్ట్రాభిమానం కావొచ్చు. ఆమె హైదరాబాదులోనే పుట్టి పెరిగింది కాబట్టి ఆమెకు లేకపోయినా పెద్దవాళ్లకు (ఏలూరు ప్రాంతంవారట) ఉండొచ్చు. లేదా ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం కంటే మంచి ఉద్యోగమై ఉండొచ్చు.

ఇప్పుడామె డిప్యూటీ కలెక్టర్‌గా చేరితే ఐదారేళ్లలో ఐఏఎస్‌ ర్యాంక్‌ (కన్‌ఫ ర్మ్‌డ్‌) అధికారి అయ్యే అవకాశం ఉంది. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాసి పాసైన వ్యక్తి కాకపోయినా ఐఏఎస్‌ అధికారిగానే పరిగణిస్తారు. ప్రస్తుతం 21 ఏళ్ల సింధు ముప్పయ్‌ ఏళ్లు రాకముందే ఐఏఎస్‌ అధికారి అవుతుంది. ఒలింపిక్‌ విజేత అనే కీర్తితోపాటు ఐఏఎస్‌ అధికారి అనే పేరూ వస్తుంది. కొంతకాలం కిందట తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తూ తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పట్టించుకోని కేసీఆర్‌ సానియా మీర్జాకు, ఆంధ్రా అమ్మాయి అయిన పీవీ సింధుకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చి కానుకలు సమర్పించారని విమర్శించారు. తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ రైతు సమస్యలపై నివేదిక ఇస్తానంటే అపాయింట్‌మెంట్‌ ఇవ్వని కేసీఆర్‌ ఆంధ్రా ఆడబిడ్డ అయిన పీవీ సింధుకు కోట్ల రూపాయల నజరానా ఇచ్చి మూడు గంటలసేపు ముచ్చటించారని అన్నారు. ఇది సింధుపై ఉద్దేశపూర్వకంగా చేసిన విమర్శ కాకపోవచ్చు. కాని చివరకు ఆమె 'ఆంధ్రా అమ్మాయి' అయింది.

ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింధు విజయంలో తనకూ భాగముందని ఆమె విజయం సాధించినప్పుడు పరోక్షంగా చెప్పారు. అదే విషయం మొన్న ఉద్యోగం ఇచ్చినప్పుడూ చెప్పారు. తాను ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాదులో క్రీడారంగానికి అద్భుతమైన అవకాశాలు కల్పించానన్నారు. తానే గోపీచంద్‌ చేత అకాడమీ ఏర్పాటు చేయించానని, ఆయన అద్భుతమైన క్రీడాకారులను తయారుచేస్తున్నారని చెప్పారు. అంటే తాను ఆ అకాడమీ ఏర్పాటు చేయించకపోతే సింధు శిక్షణ పొందే అవకాశం ఉండకపోయేదని, కాబట్టి ఆమె గెలుపునకు తానూ కారకుడిననని ఆయన ఉద్దేశం. సింధు ఏ ప్రాంతం అమ్మాయి అనే విషయానికొస్తే సరైన జవాబు 'తెలుగమ్మాయి'. ఆమె తండ్రి పూర్వీకులది ఆంధ్రాలోని ఏలూరు. తరాల కిందటే (ముత్తాతలు) తెలంగాణకు వచ్చేశారు. సింధు తండ్రి సహా అంతా తెలంగాణ లోనే పుట్టి పెరిగారు. ఈ లెక్కన చూసుకుంటే ఆమె అచ్చమైన హైదరాబాదీ అవుతుంది. ఈ ఒలింపిక్‌ విజేతను భారతీయురాలిగా చూడాలి తప్ప ప్రాంతీయతత్వంతో చూడకూడదు.

-మేనా

Show comments