నయా సూపర్‌ స్టార్‌

ఎవరన్నా అందంగా వుంటే చూడ్డానికి వేయి కన్నులు చాలవు అంటారు. మరి అందంగా వుండి, అభినయం వుండీ, అద్భుతమైన సినిమా అందిస్తే, వేయికోట్ల హీరో అయిపోతాడు. అంతే కదా మరి. మహానదులు సైతం ముందుగా పిల్ల కాలవల్లాగే ప్రారంభమవుతాయి. అసలు అలాగే అన్ని కథలూ ఉవ్వెత్తున మొదలుకావు. మొదలవుతూనే ప్రభంజనాలైపోవు. కొన్ని కథలు నిదానంగానే మొదలవుతాయి. కానీ ముందుకు నడచిన కొద్దీ గుండెల్లో నిలిచిపోతాయి. టాలీవుడ్‌లో హీరోల కథలూ ఇలాంటివే. అందరూ తొలి సినిమాతో హీరోయిజం చూపించడానికే ప్రయత్నిస్తారు. కానీ, హీరోలుగా ముద్ర వేసుకోరు. విషయం వుంది అని మాత్రం అనిపించుకుంటారు. అక్కడి నుంచి బలమైన అడుగులు వేసుకుంటూ ఒక్కో మెట్టూ ఎక్కుకుంటూ ముందుకు సాగుతారు. శిఖరాన్ని అధిరోహించే పని అలా నెమ్మదిగా ప్రారంభించి, ఆఖరికి విజేతలై నిలిచి, జేజేలందుకుంటారు. జయపతాక ఎగరేస్తారు.

ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్‌ రాజు కథ కూడా ఇలాంటిదే. అంతా 'ఈశ్వర్‌'యేచ్ఛ అనుకుంటూ సినిమాలు ప్రారంభించాడు. ప్రేక్షకుల అభిమాన 'వర్షం' కురిసింది. నటుడిగా 'మిస్టర్‌ పెర్‌ఫెక్ట్‌' అనిపించుకున్నాడు. అభిమానులకు 'డార్లింగ్‌' అయిపోయాడు. అప్పుడు తెలిసింది. 'మిర్చి'ఘాటు. అంతే బాహుబలి అయిపోయాడు. అంతర్వేది నుంచి అమెరికా దాకా పాకిపోయింది ఖ్యాతి. వేయికోట్ల హీరోగా అవతరించేస్తున్నాడు.

మన కుర్రకారుకు విదేశీనటుల పేర్లు కంఠోపాఠమే. కానీ విదేశీ ప్రేక్షకులకు పరిచయం అయిన తెలుగు హీరోల పేరేదైనా వుందా? అనుమానమే. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం బాహుబలిని చూస్తోంది. ప్రభాస్‌ను పరిచయం చేసుకుంటోంది. ఇప్పుడు ఇండియాకే నయా సూపర్‌ స్టార్‌ ఫ్రభాస్‌. అవును, ప్రభాస్‌ ఇప్పుడు నయా సూపర్‌ స్టార్‌.  ప్రేక్షకులు 'సాహో' ప్రభాస్‌ అంటున్నారు. బాక్సాఫీస్‌ కూడా సాహో అంటూ సాగిలపడి వేయికోట్లు కుమ్మరించింది. వేయికోట్ల హీరో ప్రభాస్‌.. మన ప్రభాస్‌. మన తెలుగు హీరో ప్రభాస్‌. మన నయా సూపర్‌ స్టార్‌ ప్రభాస్‌.

టాలీవుడ్‌లో హీరోలు ఆకాశం నుంచి ఊడిపడరు. అలాగని ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల మాదిరిగా, కింద నుంచి వచ్చేవారూ తక్కువే. సినిమా రంగంలోనే పుట్టి, సినిమా రంగంలోనే పెరిగి, సినిమాల్లోకి అడుగుపెట్టేవారే ఎక్కువ. అలా అడుగుపెట్టిన వారందరినీ అదృష్టం వరించేస్తుందనీ లేదు. అందలాలు అందుతాయనీ లేదు. కానీ కొందరికి మాత్రం ఇక్కడ స్టార్‌ సీటు రెడీగా వుంటుంది. అంచెలంచెలుగా, ఒక్కో సినిమా దాటుకుంటూ, ముందుకు రాగలిగితే, పిలిచి మరీ కూర్చో... అంటుంది. అందలంపైకి ఆహ్వానిస్తుంది. అలాంటి వాళ్లే సినీ తారా వినీలాకాశంలో తళుక్కున మెరిసిపోతారు. సూపర్‌ స్టార్‌ అని జనం చేత జోతలు అందుకుంటారు.

ఒక్కో తరంలో ఒక్కో సూపర్‌ స్టార్‌. ఒక్కో టైమ్‌లో ఒకరు సూపర్‌ స్టార్‌. ప్రేక్షక జనాభిమానమే దీనికి కొలమానం. బాక్సాఫీసులు లెక్కలే దీనికి జవాబుదారీ. ఆ లెక్కన ఇప్పుడు నయా సూపర్‌ స్టార్‌ ప్రభాస్‌. భారతదేశంలో ఎవ్వరూ సాధించలేని వెయ్యికోట్ల కలెక్షన్ల ఫీట్లకు చేరువవుతున్న బాహుబరి సిరీస్‌లో కథానాయకుడు. బాహుబలి. టైటిల్‌ అంత పవర్‌ ఫుల్‌గా వుంటే సరిపోదు. అందులో కథానాయకుడిని చూడగానే బాహుబలిలా కనిపించాలి. బాహుబలే అనిపించాలి. అలాంటి పవర్‌ఫుల్‌ పర్సనాలిటీ వుండాలి. అచ్చం అలాంటి హీరో ప్రభాస్‌. సీనియర్‌ హీరోల కాలంలో రెబల్‌స్టార్‌ అని పిలిపించుకుని, తనదంటూ ఓ స్టయిల్‌ అని ముద్రవేసుకున్న హీరో కృష్ణంరాజు నట వారసుడిగా రంగంలో కాలు పెట్టాడు. తొలి సినిమా ఈశ్వర్‌. పాతబస్తీ నేపథ్యంలో, అల్లరి కుర్రాడి పాత్ర. పక్కా మాస్‌ కుర్రాడి అవతారం. పెద్దగా అప్లాజ్‌ రాలేదు. అలా అని, అబ్బే అంటూ ఎవరూ పెదవీ విరవలేదు. జస్ట్‌ అలా చూసి వదిలేసారంతే.

తరువాత వచ్చింది రాఘవేంద్ర. యాంగ్రీ యంగ్‌ మాన్‌ పాత్ర. అన్యాయాన్ని చూసినా, జరిగినా సర్రున తారాజువ్వలా లేచిపొయే కుర్రాడి పాత్ర. అలాంటి కుర్రాడు తల్లితండ్రుల కోసం మట్టి ముద్దలా వుండిపోయే వైనం. ఆఖరికి మళ్లీ కోడెతాచులా బుసకొట్టి కాటేసే క్లయిమాక్స్‌. ఇన్ని షేడ్‌లను బాగానే పండించాడు. అప్పుడే ప్రభాస్‌ పర్సనాలిటీ కూడా ప్రేక్షకుల కళ్లలో పడింది. అయినా పెద్దగా పేరేమీ వచ్చి పడిపోలేదు.

2004లో వచ్చింది వర్షం. ఉరుముల్లేవు, పిడుగుల్లేవు. జస్ట్‌ అలా వచ్చింది, కానీ నిలిచి కురిసి, థియేటర్లను కలెక్షన్లతో తడిపేసింది. ఓ హీరో పాత్రకు ఎన్ని షేడ్స్‌ వుండాలో, అన్నీ వున్న పాత్ర దొరికింది. విజ్రుంభించేసాడు. అప్పుడు పడింది ఇండస్ట్రీ దృష్టి. ఓకే... హీరోనే అన్నారు. హీరో అయిపోయాడు. ఆ వెంటనే అడవిరాముడు చేసాడు. పర్సనాలిటీ టార్జాన్‌లా వున్నంత మాత్రాన, తీసే విధంగా తీయకుంటే, అడవిరాముడు టైటిల్‌ అయినా అలా పక్కన వుండిపోవాల్సిందే. అదే జరిగింది.

అంతలోనే దర్శకుడు కృష్ణవంశీ ఓ డిఫరెంట్‌ సినిమా తీయాలనుకున్నారు. చక్రం అంటూ జీవితసారాంశం, ఫిలాసఫీ కాస్త రంగరించి మంచి సినిమా అందించారు. నిజానికి ప్రభాస్‌లోని నటుడిని పరిపూర్ణంగా వాడుకున్న సినిమా ఇది. అయినా కూడా జస్ట్‌ హీరోనే. ఇంకా ఆ పైస్థాయికి రాలేదు ప్రభాస్‌.

అదిగో అప్పుడు వచ్చింది ఛత్రపతి. దర్శకుడు రాజమౌళి సినిమా. ప్రభాస్‌లో ఎన్ని వేరియేషన్లు చూపించాలో అన్నీ చూపించేసాడు. పేద్ద హిట్‌ అయిపోయింది. ప్రభాస్‌ కూడా డిపెండబుల్‌ హీరో అని డిసైడ్‌ అయింది టాలీవుడ్‌.

అలాంటపుడే సమస్య వస్తుంది. వరుసపెట్టి సినిమాలూ వస్తాయి.. డైరక్టర్లూ వస్తారు. వాటితో పాటే జయాలు, అపజయాలు పలకరిస్తాయి. మంచి సినిమాలు వుండొచ్చు. కానీ మంచి హిట్‌లు కూడా వుండాలి. పౌర్ణమి మంచి సినిమా, కానీ మంచి హిట్‌ కాలేకపోయింది. యోగి మంచి సినిమానే, జనాలకు తగినట్లు మలచలేకపోయారు. మున్నా, డైరక్టర్‌ విషయంలో ప్రభాస్‌ చేసిన తప్పు. బుజ్జిగాడు ప్రభాస్‌లోని కామెడీ యాంగిల్‌ బయటకు తీసింది. బిల్లా, ప్రభాస్‌ స్టయిల్‌కు అద్దంపట్టింది కానీ, మరీ అద్భుతం అనిపించుకోలేదు. ఏక్‌ నిరంజన్‌ డిటో.. డిటో.

ఎక్కడికెళ్తోంది ప్రభాస్‌ కెరీర్‌? ఏ సినిమా పడాలి? ఏది సూటవుతుంది? అంత సమస్య, అంతసీన్‌ లేదు. ప్రభాస్‌కు. అతగాడు చాలా కూల్‌.. కూల్‌. చేసుకుంటూ వెళ్తే, సూటయ్యే సినిమా అదే వస్తుంది. హిట్‌లు అవే పలకరిస్తాయి. అనే ధీమా. అప్పుడు వచ్చింది డార్లింగ్‌. నిజానికి ఈ పదం ప్రభాస్‌కు ఊతపదం. అదే సినిమా టైటిల్‌ అయింది. అంతేకాదు, సినిమా పెద్ద హిట్‌ అయింది.

హిట్‌లు అంతే వస్తే వరుసగా వస్తాయి. ఆ వెంటనే మిస్టర్‌ ఫెర్‌ఫెక్ట్‌ వచ్చింది. ప్రభాస్‌కు పెర్‌ఫెక్ట్‌ సినిమా అంతేగా సెట్‌ అయింది. అదీ పెద్ద హిట్‌. అదే టైమ్‌లో ఓ మిస్‌ఫైర్‌. రెబల్‌. నిజానికి దర్శకుడు లారెన్స్‌ స్టయిల్‌కు అద్దంపట్టే సినిమానే. కానీ అకర్లేని పైత్యాలు, మొహమాటపు వ్యవహారాలు తోడయ్యాయి. పైగా ఇన్‌టైమ్‌ రిలీజ్‌ కూడా కాదు. దాంటో ఫట్‌ మంది.

అలాంటి టైమ్‌లో వచ్చింది  మిర్చి. గుంటూరు మిర్చి ఘాటు అంతా రంగరించాడు దర్శకుడు కొరటాల శివ. ఇలాంటి అలాంటి బ్లాక్‌ బస్టర్‌ కాదు. ప్రభాస్‌లోని హీరోయిజం అంతా ఫైకి తీసి, అంతెత్తున నిలబెట్టి, అందరికీ కనిపంచేలా చేసాడు. ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. టాలీవుడ్‌ టాప్‌ హీరోల్లో ఒకడిగా ఫిక్స్‌ అయిపోయాడు.

అంతలో రాజమౌళి తన డ్రీమ్‌ ప్రాజెక్టు అనేంతగా బాహుబలి స్టార్ట్‌ చేసారు. రెండేళ్ల పాటు సినిమానా?  రెండేళ్లలో ప్రభాస్‌ నాలుగు సినిమాలు చేసేయచ్చు. అనవసరంగా ప్రభాస్‌ను బ్లాక్‌ చేస్తున్నారు. ప్రభాస్‌ దొరికిపోయాడు. ఇలాంటి కామెంట్‌లు అన్నీ తెరచాటున వినిపించాయి. మిగిలిన నటుల సంగతేమో కానీ, ప్రభాస్‌ బాహుబలి తప్ప మరేవీ టచ్‌ చేయలేదు. ఇద్దరు దర్శకులకు మాట ఇచ్చి వెయిటింగ్‌ లిస్ట్‌లో వుంచేసాడు. ఆఖరికి జీవితంలో కీలకమైన పెళ్లిని కూడా పక్కన పెట్టేసాడు.

శివుడు కాస్తా నందిగా మారి శివలింగాన్ని భుజాన మోస్తూ, ముందుకు నడుస్తూ వుంటే ప్రేక్షకుల ఈలలు కేకలతో థియేటర్లు దద్దరిల్లాయి. 'నేనెవర్ని' అని కీలక సన్నివేశంలో ఘర్జిస్తే, ప్రేక్షకులు అంతకు అంతా రెచ్చి కేకలు పెట్టారు. ఇండియా వ్యాప్తంగా ప్రభాస్‌ పేరు మారుమోగిపోయింది. తమిళ తంబిలు, మళయాళీలు, కన్నడిగులు, ఉత్తర భారతీయలు, ఇలా ఒకరేమిటి? దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు ప్రభాస్‌ పరిచయం అయిపోయాడు.

రెండేళ్లు అనుకున్న బాహుబలి అయిదేళ్లు టైమ్‌ తీసుకుంది. అయినా ప్రభాస్‌ మాటంటే మాటే. పెళ్లీ లేదు. మరో సినిమా ప్రసక్తీ లేదు. బాహుబలి-2 వచ్చింది. అదో సునామీ. అదో ప్రభంజనం. అంతకు మించి చెప్పడానికి ఎన్ని పదాలు వాడినా అర్థం ఒక్కటే. అంతకు మించి అదేమిటో జనాలకు ఇప్పటికే తెలుసు.

తెలుగునాట సరే, పక్క రాష్ట్రాల్లో ఓకె, ఉత్తర భారతానికీ నచ్చింది, అసలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఊగిపోవడం ఏమిటి? సినిమా సంగతి అలా వుంచండి. తొలిభాగంలో ప్రభాస్‌ ఎక్కువగా కనిపించింది శివుడిగా. అందువల్ల అంతగా హీరోయిజం ఎలివేట్‌ కాలేదు. కానీ మలిభాగంలో కనిపించింది అమరేంద్ర బాహుబలిగా. ఆ నడక, ఆ ఠీవి, ఆ మాట, ఆ రాజసం, అణువు అణువునా తొంగి చూసాయి. ఒక్కసీన్‌లో అని కాదు, ఒక ఫైట్‌లో అని కాదు, ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ కాదు, క్లయిమాక్స్‌ ఫైటూ కాదు, ప్రతిచోటా ప్రభాస్‌ ప్రతిభాపాటవ ప్రదర్శన పదర్శితమైంది. ఇప్పుడు స్టార్‌ కాస్తా సూపర్‌ స్టార్‌ అయ్యాడు. స్టార్‌, హీరోగా మారి, ఆపై టాప్‌ హీరోల జాబితాలోకి చేరి, ఇప్పుడు స్టార్‌లకే స్టార్‌, సూపర్‌ స్టార్‌ అయిపోయాడు.

ఇదంతా పార్ట్‌వన్‌ మాత్రమే. అసలు సిసలు పార్ట్‌-2 ముందు వుంది. శిఖరం అధిరోహించడం, సింహాసనం సాధించడం ఎంతకష్టమో, అక్కడ నిలదొక్కుకోవడం అంతకన్నా కష్టం. ఒక్క తప్పటడుగు చాలు కిందకు లాగేయడానికి. అందుకే ప్రభాస్‌కు రాబోయే సినిమాలే అతికీలకం. అది సాహో కావచ్చు. మరొకటి కావచ్చు. మరొక్కటి, రెండు హిట్‌లు అభిమాన జనాలకు ఇవ్వగలిగితే, ప్రభాస్‌ నుంచి సూపర్‌ స్టార్‌ కిరీటం లాక్కోవడం కష్టమే. ప్రభాస్‌ ముందున్న తక్షణ కర్తవ్యం ఆ రెండు హిట్‌లు. ప్రభాస్‌ ఇమేజ్‌ను క్యాష్‌ చేసుకోవాలనుకునే నిర్మాతలు కావచ్చు, దర్శకులు కావచ్చు, తాము సూపర్‌స్టార్‌ భవిష్యత్‌తో డీల్‌ చేస్తున్నామని గుర్తుంచుకోవాలి. సూపర్‌ స్టార్‌ ప్రభాస్‌ను అంతకు మించి చూపించగలగాలి. లేదా కనీసం అలాగైనా వుంచాలి.

ఈ క్రతువులో ప్రభాస్‌తో సహా దర్శక నిర్మాతలందరి బాధ్యతా వుంది. ఎందుకంటే ప్రభాస్‌ స్టార్‌ కాదు.. సూపర్‌ స్టార్‌.

-ఆర్వీ

Show comments