ఆంధ్రప్రదేశ్..ఈ పేరిట వేదిక ఏర్పాటు చేసి, జనం మరిచిపోతున్న, పట్టించకుండా వదిలేసిన ప్రత్యేక హోదా పోరును మరోసారి రగిల్చారు వైకాపా అధినేత జగన్ విశాఖలో. మరో రెండు మూడు నెలల్లో విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విశాఖ రైల్వే జోన్ అన్నది కీలకం కానున్నది. హోదాకు బదులుగా మసిపూసి మారేడుకాయ చేసి ప్యాకేజీ అందించిన కేంద్రం, విశాఖ రైల్వే జోన్ గురించి మాత్రం మాట్లాడడం లేదు. పైగా విశాఖ బదులుగా విజయవాడ అయితే బెటర్ అన్న వాదనను కొత్తగా తెరపైకి తెచ్చారు.
ఇలాంటి నేపథ్యంలో విశాఖలో వైకాపా అధినేత తలపెట్టిన సభ సూపర్ సక్సెస్ అయింది. ఇది వాస్తవం. అంతలా సక్సెస్ అయింది అనడానికి నిదర్శనం ఒక్కటే, ఎప్పుడూ జగన్ సభలను అంతగా హైలైట్ చేయని తెలుగుదేశం అనుకూల దినపత్రికలు సైతం ఫ్రంట్ పేజీలో ఈ ఈవెంట్ ను కవర్ చేసాయి. సరే, కవర్ చేయడం అన్నదానికన్నా ముందుగా అసలు జనం ఇంతలా జగన్ సభకు రావడం అన్నదాన్ని చూడాలి. మున్సిపల్ ఎన్నికలు వున్నాయి కాబట్టి, టికెట్ లు ఆశించేవారు జనాన్ని తీసుకువచ్చారని అనుకోవచ్చు. అయితే విశాఖను హుద్ హుద్ బారి నుంచి కాపాడేసి, ఓ లెవెల్ కు తీసుకెళ్లిపోయారు చంద్రబాబు అని తెలుగుదేశం జనాలు చాటుతున్న వేళ కూడా వైకాపా టికెట్ లకు ఇంత పోటీ ఎలా సాధ్యం?
వైకాపా విశాఖ టికెట్ ల కోసం చాలా గట్టి పోటీ వుందన్నది విశాఖ రాజకీయాలు పరిశీలించేవారందరికీ తెలిసిందే. విశాఖలో తన పార్టీకి పట్టు వుందనే వైకాపా నేత జగన్ తన తల్లి విజయమ్మను అక్కడ పోటీకి దింపారు. అయితే అప్పట్లో జరిగిన అసత్య ప్రచారం ఇంతా అంతా కాదు. కడప గూండాలు దిగారని, లోకల్ ఫీలింగ్ రెచ్చ గొట్టడం అన్నది అప్పట్లో జరిగిన వ్యవహారం. నిజానికి విజయమ్మకు పోటీగా నిలిచిన కంభంపాటి హరిబాబు కూడా విశాఖ నేటివ్ కాదు. అయినా తెలుగుదేశం పార్టీ మీడియా బలం జనాల కళ్లు చెవులు మూసేసింది.
కానీ కార్పొరేషన్ ఎన్నికల వ్యవహారం వేరుగా వుంటుంది. ఇక్కడ అంతా లోకల్ వ్యవహారం వుంటుంది. ఎక్కడి నుంచో వచ్చి సెటిల్ అయినవారు, లోకల్ జనాలు పోటీ పడతారు. ఇప్పుడు ఇక నాన్ లోకల్ అనే ప్రచారం తెలుగుదేశం పార్టీకి నడవదు. ఎందుకంటే ఆ పార్టీ జనాలు మూడు వంతుల మంది నాన్ లోకల్ కాబట్టి. అందువల్ల ఇక వైకాపా, తెదేపాల నడుమ జెన్యూన్ ఫైట్ తప్పకపోవచ్చు. పైగా గతంలో కాంగ్రెస్ లో వున్న నాయకులంతా చాలా మంది వైకాపాతో వున్నారు ఇప్పుడు.కాంగ్రెస్ కు చెందిన బొత్స ఇప్పుడు వైకాపాలో వున్నారు. ఆయన ప్రభావం కొంతయినా విశాఖలో వుంటుంది. అందువల్ల వైకాపా బలం తక్కువ అంచనా వేయడానికి లేదు. విశాఖ సభ చెప్పిన అసలు సంగతి ఇదే.
పైగా మరోపక్క తెలుగుదేశం పార్టీ బలంగా ఏమీ లేదు. గంటా, అయ్యన్న వర్గాలు విశాఖలో కూడా తెరవెనుక కత్తులు దూస్తున్నాయి. ఇది కాక తెలుగుదేశం-భాజపా జనాల మధ్య లుకలుకలు వుండనే వున్నాయి. అందువల్ల ఎలాగైనా గట్టిగా ప్రయత్నిస్తే విశాఖ తీరంలో లంగరు వేయచ్చని వైకాపా భావిస్తోంది. దానికి హోదా, రైల్వే జోన్ లాంటి సెంటిమెంట్ లను జోడిస్తోంది. కానీ తెలుగుదేశం పార్టీకి ఒకటే శ్రీరామ రక్ష. వైఎస్ పుణ్యమా అని మున్సిపల్ ఎన్నికలకు డైరెక్ట్ ఎన్నికలు లేకుండా పోయాయి. సో, ఎవరు గెలిచినా, కోట్లు కుమ్మరిస్తే, మేయర్ పదవి పార్టీ ఫోల్డర్ లోకి వచ్చి వాల్తుంది. అది ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైన సత్యం.