ఆ పని చేస్తే బాబు ఇక నోరెత్తగలరా?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకటంలో పడ్డారు. సంకటమని మనం అనుకుంటున్నాం. కాని ఆయన  అపుకుంటారో లేదో తెలియదు. నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చేసిన నాయకులు ఎవరేమనుకున్నా పట్టించుకోరనే సంగతి తెలిసిందే కదా. చంద్రబాబు కూడా ఇందుకు అతీతులు కారు. నైతిక విలువలను ఎప్పుడో వదిలేశారు. అయినప్పటికీ 'నీతి సూత్రాలు' వల్లిస్తూనే ఉంటారు. తాను నీతిపరుడినని చెప్పుకోవడమే కాకుండా ఎదుటివారికి నీతులు బోధిస్తుంటారు. 'ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి' అని ఆచార్య ఆత్రేయ చెప్పారు కదా. ఈమధ్య 'లంచాలు తీసుకుంటే నాకు అవమానం' అని అన్నారు. ఉద్యోగులను ఉద్దేశించి అన్నట్లుగా ఉంది. 

కాని లంచాన్ని ఆయనే ప్రోత్సహించారు కదా. దాని ఫలితమే కదా నోటుకు ఓటు కేసు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ టీడీపీ నేతలను తన పార్టీలోకి లాక్కున్నప్పుడు ఇది అన్యాయమని మొత్తుకున్నారు. తలసాని శ్రీనివాస యాదవ్‌ను కేసీఆర్‌ మంత్రివర్గంలోకి తీసుకున్నప్పుడు మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నవారి చేత రాజీనామాలు చేయించాలని తమ్ముళ్లు డిమాండ్‌ చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు.  కాని ఏపీలో తాను చేసిన పనేమిటి? వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయించకుండా పార్టీలో చేర్చుకున్నారు. చంద్రబాబు రాజనీతిజ్ఞుడు కాదు. 'బతక నేర్చిన'  నాయకుడు.

 తన రాజకీయ జీవితంలో  ఇప్పటివరకు తప్పు చేయలేదని, చేయబోనని చెప్పుకుంటారు. కాని నైతిక విలువలను తుంగలో తొక్కారు. ఓ పక్క ఫిరాయింపులను ప్రోత్సహిస్తూనే మరో పక్క తప్పు చేయలేదని చెప్పుకోవడం హాస్యాస్పదం. పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ఫిరాయింపులను బాబు సమర్థించుకున్నారు. పార్టీని పటిష్టం చేయడానికి 'జంప్‌ జిలానీలు' అవసరమన్నారు. ఎదుటివారి తప్పులను ఎత్తి చూపాలంటే మనం తప్పుచేయకుండా ఉండాలి. కాని ఈనాటి ధర్మం అది కాదు.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు  నైతికతపై ఆయనకు పాఠాలు చెప్పారు. కాని తనూ అదే పని చేయడంతో కేసీఆర్‌ను విమర్శించే అధికారం కోల్పోయారు. ఇంకా కోల్పోవడానికి ఏమీ మిగల్లేదు. 

అయినా నాయకులు అదంతా గుర్తు పెట్టుకోరు. విమర్శలు చేస్తూనే ఉంటారు. చంద్రబాబు మళ్లీ నోరెత్తకుండా చేయాలని కేసీఆర్‌ వ్యూహం పన్నుతున్నారట...! టీడీపీకీ రాజీనామా చేశాడో లేదో తెలియని తలసాని శ్రీనివాస యాదవ్‌కు మంత్రి పదవి ఇచ్చి కేసీఆర్‌ తప్పు చేసింది వాస్తవమే. దీనిపై ఆయన మీద విమర్శలు రావడంతోపాటు తలసానితో ప్రమాణం చేయించిన గవర్నర్‌ నరసింహన్‌పైనా విమర్శలొచ్చాయి. అయినా గవర్నర్‌ కేసీఆర్‌ను ప్రశ్నించలేదు. అప్పుడు ఆ కథ ముగిసిపోయినా మళ్లీ అదేవిధమైన కథ మొదలవబోతోంది. ఏమిటది? టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు, నల్గొండ కాంగ్రెసు ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డికి మంత్రి పదవులు ఇవ్వాలనుకుంటున్నారు.

 దయాకర్‌రావు ఎమ్మెల్యే కాబట్టి తలసాని మాదిరిగానే రాజీనామా చేయకుండా మంత్రి అవుతారు. గుత్తా ఎంపీ కాబట్టి పదవికి ముందుగా రాజీనామా చేశాక మంత్రివర్గంలో చేరుతారా? చేరాక చేస్తారా? తెలియదు. ఇక అసలు విషయమేమిటంటే...ఏపీలో బాబు కూడా కేబినెట్లో మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నారు. ముగ్గురు నలుగురు ముఖ్య ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వాలనుకుంటున్నారు. వీరంతా ఎమ్మెల్యేలే. వారు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండానే మంత్రులవుతారు. ఇలా చేయడం తప్పు. ఈ తప్పు చంద్రబాబు చేశాక తాను చేయాలని కేసీఆర్‌ అనుకుంటున్నారట. 

బాబు ముందే తప్పు చేసుంటారు కాబట్టి  కేసీఆర్‌ను విమర్శించే హక్కుండదు. ఒకవేళ విమర్శిస్తే కేసీఆర్‌కు మంచి మాటలు రావు.  ముందే ఏపీ కేబినెట్లో మార్పులు చేశాకే దాన్ని చూసి తాను చేయాలనుకుంటున్నారట. ఇక బాబుకు మరో చిక్కుంది. ఈమధ్య చంద్రబాబుతో గవర్నర్‌ నరసింహన్‌ ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వొద్దని సలహా ఇచ్చారు. తలసానితో ప్రమాణం చేయించి తాను విమర్శల పాలయ్యానని, మరోసారి విమర్శలు చేసేందుకు అవకాశం ఇవ్వవద్దని కోరారు. మరి పెద్దాయన మాటను బాబు గౌరవిస్తారా? ఫిరాయింపుదారులకు పదవులు ఇవ్వకుంటే వారికి ఆగ్రహం కలిగే ప్రమాదముంది. పదవుల ఆశతోనే కదా వారు ఫిరాయించింది. నిజాయితీకి నిదర్శనంగా ప్రచారం చేసుకుంటున్న బాబు ఏం చేస్తారో చూడాలి. 

Show comments