ఒకవైపు కాపులను తెలుగుదేశం పార్టీ ఉద్ధరిస్తున్నట్టుగా మరే పార్టీనూ ఉద్ధరించడం లేని అంటున్నారు చంద్రబాబు కేబినెట్ లోని మంత్రులు. ముద్రగడ పద్మనాభం దీక్ష .. పర్యవవసనాల నేపథ్యంలో.. మంత్రులు జై చంద్రబాబు అంటున్నారు. కాపులకు తెలుగుదేశం పార్టీ ఎంతో చేసిందని, చేస్తోందని.. వారు చెప్పుకొస్తున్నారు. వారి వెర్షన్ ఇలా ఉంటే.. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో మాత్రం పరిస్థితులు మరో రకంగా కనిపిస్తున్నాయి.
ముద్రగడ దీక్ష విషయంలో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు తీవ్రం అవుతున్న సంకేతాలు ఇస్తున్నాయివి. ముద్రగడ కుటుంబంపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తాము ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా గోదావరి , కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన తెలుగుదేశం పార్టీ క్యాడర్ నుంచి ప్రకటనలు వస్తున్నాయి. తుని వ్యవహారంలో కాపులపై కేసులు, ముద్రగడ దీక్ష, దాన్ని అణిచివేయడానికి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ముద్రగడ కుటుంబీకులపై పోలీసులు విచక్షణ రహితంగాదాడిచేయడం.. వంటి పరిణామాలు తమను క్షోభకు గురి చేస్తున్నాయని.. వీటికి నిరసనగా తాము తెలుగుదేశం పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా క్యాడర్ నుంచి ప్రకటనలు వస్తున్నాయి.
గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో ఇప్పటి వరకూ దాదాపు పదిహేనువందల మంది ఇలా రాజీనామాలకు పాల్పడినట్టుగా సమాచారం అందుతోంది. ఒకవైపు ఆదివారం వివిధ జిల్లా కేంద్రాల్లో కాపుల నిరసన ర్యాలీలు జరిగాయి. విశాఖ నుంచి అనంతపురం వరకూ కాపు, బలిజ నేతలనేకమందిని ముందస్తుగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ నిరసన ర్యాలీలు.. ముద్రగడకు సంఘీభావ ధర్నాలు జరిగాయి. అయితే వీటిని పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకున్నారు. నిరసన కారులను అడ్డుకుని పోలిస్ స్టేషన్లకు తరలించారు. కాపులు ఈ విషయంలో రగిలిపోతున్నారు. మొత్తానికి కాపుల రిజర్వేషన్లతో తెలుగుదేశం ఆడిన చెలగాటం.. ఆ పార్టీకి ముప్పు తీసుకొచ్చే పరిస్థితే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో కాపుల్లో దాదాపు డెబ్బై శాతం అండగా నిలవడంతోనే తెలుగుదేశం పార్టీ ఆ మాత్రం విజయాన్ని సాధించగలిగింది. మరి అలాంటి వారిలో అసహనం, ఆగ్రహాలు బాబు పార్టీకి మంచివి కావేమో!