'అమ్మ' అన్నది ఎప్పటికీ కమ్మని రాజకీయమే...!

'యాతాస్థలి..మూత్రశాల ఎచటైతేనేం ఎచటైతేనేం పోటీబడి కాటులాడ'..అన్నారు కాళోజీ నారాయణరావు 'నా గొడవ'లో. ఇదొక్కటే కాదు. ఇంకా చాలా అన్నారనుకోండి. ఆయన అన్నదంతా రాజకీయ నాయకుల గురించే. వారు రాజకీయం చేయాలంటే ప్రతి రోజూ ఏదో ఒక సబ్జెక్టు దొరుకుతూనే ఉంటుంది. కొట్లాడుకోవాలంటే ఏదో ఒక పాయింటు రెడీగా ఉంటుంది. బతకనేర్చినవారిని 'వీడు బండ మీద పైస పుట్టిస్తాడు' అంటుంటారు. అలాగే రాజకీయ నాయకులు కూడా ఏం ఉన్నా లేకపోయినా రాజకీయం చేయగలరు.

జయలలిత చనిపోయాక రాజకీయాలు రంజుగా సాగుతున్న తమిళనాడులో మరో కొత్త వివాదం లేచింది. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ లేవదీసిన ఈ వివాదం అన్నాడీఎంకేలోని శశికళ, పన్నీరుశెల్వం వర్గాలకు చిరాకుగా, ఆగ్రహంగా ఉంది. రెండు వర్గాలూ స్టాలిన్‌ మీద దాడి చేస్తున్నాయి. ఎందుకు? ఈ వివాదంలో ప్రధానాంశం జయలలిత కాబట్టి. జయలలిత మరణించింది.అంతకు మించి సుప్రీం కోర్టు ఆమెపై 'అవినీతిపరురాలు' అనే ముద్ర వేసింది. కాని అన్నాడీఎంకేవారు ఆమె అవినీతిపరురాలు అనే మాటను జీర్ణం చేసుకోలేకపోతున్నారు. 

ఆమె ఇప్పటికీ వారికి అమ్మే. వారి హృదయాల్లో కొలువైన దేవతే. ప్రతిరోజు ఆమె పేరు తలచుకోందే వారి రాజకీయ జీవితం ముందుకు సాగదు. జనం మధ్యకు పోలేరు. 'అమ్మ అన్నది ఒక కమ్మని మాట' అన్నాడో సినీ కవి. తమిళనాడులో అమ్మ అన్నది ఒక కమ్మని రాజకీయంగా మారింది. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లుగా అన్నాడీఎంకే నేతలు అమ్మ పేరుతో రాజకీయం చేస్తుండగా, వారిని దెబ్బతీసేందుకు ప్రతిపక్ష నేత స్టాలిన్‌ అమ్మనే ఉపయోగించుకుంటున్నారు.

తాజాగా స్టాలిన్‌ లేవదీసిన వివాదం ఏమిటంటే...జయలలిత మరణించి, ఆమెపై సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తరువాత కూడా సచివాలయం సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఆమె ఫొటోలే ఉన్నాయి. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఫొటోయే పెడతారు. ఒకే పార్టీ ఐదేళ్లు అధికారంలో ఉండి మధ్యలో ముఖ్యమంత్రులు మారినా ఎవరు సీట్లో కూర్చుంటే వారి ఫొటోయే ఉంటుంది. కాని తమిళనాడులో జయలలిత ఫొటోలే ఉన్నాయి. దీనిపై స్టాలిన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకు?

జయలలిత అవినీతిపరురాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి ప్రభుత్వ కార్యాలయాల్లో ఆమె ఫొటో పెట్టడం సమంజసం కాదని, వాటిని వెంటనే తొలగించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చారు. అన్నాడీఎంకేకు జయ ఆరాధ్య దేవత కాబట్టి దివంగత నేత గౌరవార్థం ఆమె ఫొటోలు పెట్టుకోవడంలో అభ్యంతరం ఉండకపోవచ్చు. ఆమె ఫొటో పక్కన కావాలంటే ప్రస్తుత సీఎం ఫొటో పెట్టుకోవచ్చు. అది అధికార పార్టీ ఇష్టం. జయ 'క్లీన్‌ సీఎం' అయివుంటే స్టాలిన్‌ ఏమీ మాట్లాడకపోయేవాడేమో. కాని సుప్రీం కోర్టు ఆమెను దోషిగా చెప్పింది కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని అవినీతిపరురాలి ఫొటో ఉండకూడదంటున్నారు. నైతిక విలువలరీత్యా చూస్తే ఇది సరైందేననిపిస్తుంది. కాని అమ్మ పేరు చెప్పుకొని రాజకీయాలు చేసే, పాలన సాగించే అన్నాడీరఎంకే నాయకులు దీనిపై మండిపడుతున్నారు. జయపై నాయకుల మనసులో ఎలాంటి అభిప్రాయం ఉన్నప్పటికీ అమ్మను కాదంటే జనం ఊరుకోరు. ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలతో జయ జనాన్ని ఆకట్టుకున్నారు.

ఆ పథకాల కారణంగా వారి బతుకుల్లో సానుకూల మార్పు వచ్చిందో లేదో చెప్పలేంగాని ఆమె తమకు ఎంతో చేసిందని వారు ఫీలవుతున్నారు. జయను కోర్టు అవినీతిపరురాలన్నా వారు పట్టించుకోవడంలేదు. జనం నాడిని పసిగట్టి రాజకీయం చేయాలి కాబట్టి అన్నాడీఎంకే నేతలు స్టాలిన్‌పై దాడి చేస్తున్నారు.  ప్రభుత్వ కార్యాలయాల నుంచి జయ ఫొటోలు తీయడం జరగదు. భవిష్యత్తులో డీఎంకే అధికారంలోకి వస్తే ఆ పని చేస్తుండవచ్చు.  

రెండాకుల పార్టీ అధికారంలో ఉన్నంత కాలం అమ్మ ప్రభావం తగ్గకపోవచ్చు. ఆమెలా పరిపాలించే నాయకుడు, ఆమెను మరిపించే నేత వస్తే తప్ప జనం జయను మర్చిపోరు. అలాంటి నాయకుడు అన్నాడీఎంకే నుంచి వస్తాడో, డీఎంకే నుంచి వస్తాడో చూడాలి. 

Show comments