అక్కడ పొడచలేకపోయారు.. ఇక్కడ పొడుస్తారా!

ముఖ్యమంత్రి హోదాలోని వ్యక్తి తను దశాబ్దకాలం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన నియోజకవర్గంలో, తమ రాజకీయ చరిత్ర అంతా ముడిపడి ఉన్న నియోజకవర్గంలో.. సొంతంగా పార్టీ పెట్టి మరీ.. సొంత తమ్ముడిని నిలబెట్టి.. ఓటమిపాలైన చరిత్ర ఏదైనా ఉందంటే అది కిరణ్‌ కుమార్‌రెడ్డి ఫ్యామిలీకే ఉంది. పీలేరు నియోజకవర్గం తమకు పట్టుగొమ్మ.. అందునా ముఖ్యమంత్రి హోదా.. ఎంతో కొంత అభివృద్ధి చేశాడు కూడా. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు సొంత నియోజకవర్గానికి భారీగానే నిధుల కేటాయించుకున్నాడు కిరణ్‌. అయినప్పటికీ.. కిరణ్‌ తమ్ముడికి ఓటమి తప్పలేదు!

అదీ సొంతూర్లో కిరణ్‌ కుమార్‌రెడ్డి క్రెడిబులిటీ. మరి ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజలు ఓటేసిన వేళ కిరణ్‌ రాజకీయం మీద జనాలకు ఎంత మద్దతుందో క్రితంసారి సార్వత్రిక ఎన్నికల్లో పీలేరు ఫలితంతోనే తెలిసిపోయింది. మరి కట్‌ చేస్తే.. కిరణ్‌ రాజకీయ ముఖచిత్రంలో ఎక్కడా కనిపించకుండా మాయం అయ్యాడు. మూడేళ్లయ్యింది.. మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి ఏమీ కనిపించడంలేదు.

ఇదిలా ఉంటే.. కిరణ్‌ తమ్ముడు తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నాడట. అంతేకాదు.. రాజంపేట ఎంపీగా పోటీ చేస్తాడట, అలాగే టీటీడీ చైర్మన్‌ పదవి హామీనికూడా పొందాడట! అయినా టీటీడీ చైర్మన్‌ హామీని చంద్రబాబు చేత పొందిన వాళ్లు ఎంత మంది? అని ఆరాతీస్తే.. అదొక అనంతమైన సంఖ్య అవుతుంది. ఈ జాబితాలో ఇటు అనంతపురం అటు విశాఖపట్నం వరకూ బోలెడంత మంది నేతలున్నారు. వారందరికీ చెప్పినట్టుగానే.. కిరణ్‌ తమ్ముడు కిషోర్‌కు కూడా టీటీడీ చైర్మన్‌ పదవిని ఇస్తానని బాబు చెప్పాడట. రాజంపేట నుంచి పోటీ చేయమని ఆదేశించాడట.

మొత్తానికి సరైన అభ్యర్థే. పీలేరులో ప్రజాపోరులో పొడవలేదు ఆనీ.. కిషోర్‌ కుమార్‌రెడ్డి.. ఉన్నట్టుండి వచ్చి రాజంపేట నుంచి పోటీ చేస్తాడట! తద్వారా తమ చిరకాల ప్రత్యర్థి పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఢీ కొడతాడట. అయినా.. పీలేరు కిషోర్‌ను ఓడించింది కూడా పెద్దిరెడ్డి ఫ్యామిలీనే కదా. తమ నియోజకవర్గం మీద కన్నా పీలేరు మీదే ఎక్కువ కాన్సన్‌ ట్రేట్‌ చేసి మరీ.. కిషోర్‌ను ఓడించడానికి కృషి చేశాడు పెద్దిరెడ్డి రామంచంద్రారెడ్డి. రేపు వాళ్లనే ఢీ కొడితే పరిస్థితి ఎలా ఉంటుందో!

Show comments